‘తోటపల్లి’ వస్తోంది!

ABN , First Publish Date - 2020-12-06T04:43:23+05:30 IST

తోటపల్లి జలాశయం చెంతనే ఉండి కూడా నీరు అందని రైతులు ఎంతోమంది. ఎగువ ప్రాంతంలో ఉండడం వల్ల వారి పంట పొలాల దరికి నీళ్లు చేరడం లేదు. దీనిపై వారు ఏళ్లుగా ప్రభుత్వానికి విన్నపాలు ఇస్తున్నారు. ఉద్యమాలు చేశారు.

‘తోటపల్లి’ వస్తోంది!
తోటపల్లి జలాశయం.

 ఎగువ భూములకు నీటి సదుపాయం

ఎత్తిపోతల పథకాల ద్వారా అందించే యోచన

రూ.45 కోట్లతో ఇంజినీర్ల ప్రతిపాదన

 8,352 ఎకరాలకు పెరగనున్న ఆయకట్టు 


తోటపల్లి జలాశయం చెంతనే ఉండి కూడా నీరు అందని రైతులు ఎంతోమంది. ఎగువ ప్రాంతంలో ఉండడం వల్ల వారి పంట పొలాల దరికి నీళ్లు చేరడం లేదు. దీనిపై వారు ఏళ్లుగా ప్రభుత్వానికి విన్నపాలు ఇస్తున్నారు. ఉద్యమాలు చేశారు. ఎట్టకేలకు సమస్యను గుర్తించిన ప్రభుత్వం జలాశయంలోనే ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై ప్రతిపాదనలు కోరింది. ఆ మేరకు ప్రాజెక్టు కాల్వల్లో ప్రవహిస్తున్న నీటిని ఎత్తి పోసే అవసరం లేకుండా ఏర్పాట్లు చేయొచ్చునని సంబంధిత ఇంజినీర్లు ప్రణాళిక తయారు చేశారు. రూ.45 కోట్లు ఖర్చు కాగలదని నివేదించనున్నారు. 


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఎంతోమంది భూములను ధారాదత్తం చేశారు. నామమాత్ర పరిహారం ప్రభుత్వం చెల్లించినా ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించి జీవనాధారమైన భూములను ఇచ్చేశారు. కొన్ని గ్రామాల ప్రజలు ఏకంగా ఊళ్లనే విడిచి పెట్టాల్సి వచ్చింది. ఇటువంటి అనేక మంది రైతుల పొలాలకు జలాశయం నీరు అందడం లేదు. చెంతనే జలాశయం ఉన్నా తమ వద్ద మిగిలి ఉన్న భూములకు సాగునీరు అందక అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు.  కాల్వలకు ఎగువన భూములు ఉన్న కారణంగా నీరు చేరడం లేదు. దీనిపై రైతులు పోరాటాలు చేశారు. తమకూ దారి చూపాలని కోరారు. రెండు జిల్లాల రైతాంగానికి సాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు నుంచి తమకు సహకారం అందించాలని డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నాగూరు వద్ద ఎడమ ప్రధాన కాల్వపై ఎత్తి పోతల పథకాన్ని నిర్మించేందుకు  యోచించగా పాలకొండ ఎమ్మెల్యే కళావతి అప్పట్లో అభ్యంతరం తెలిపారు. తోటపల్లి ఎడమ ప్రధాన కాల్వపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తే తన నియోజకవర్గ పరిధిలోని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం, పాలకొండ, బూర్జ మండలాల రైతులకు సాగునీటికి ఇబ్బందులు ఎదురుకానున్నాయని చెప్పారు. దీంతో ఆ ప్రతిపాదన నిలిచిపోయింది. 

 మూడు ఎత్తిపోతల పథకాలు

ఎమ్మెల్యే అభ్యంతరాలను పరగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఏకంగా జలాశయంలోనే ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. దీనివల్ల కాల్వల్లో ప్రవహిస్తున్న నీటిని ఎత్తి పోసే అవసరం లేకుండా ఏర్పాట్లు చేయాలని చెబుతూ ప్రతిపాదనలు కోరింది. తోటపల్లి, చింతలబెలగాం, నాగూరు వద్ద ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తే ఉపయోగమని సాగునీటి శాఖ ఇంజినీర్లు నివేదిక రూపొందించారు. మూడు ఎత్తిపోతల పథకాల ద్వారా 8,352 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. తోటపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా 2,626 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.17.25 కోట్లు ఖర్చు కాగలదని ప్రాథమిక అంచనా వేశారు.  చింతలబెలగాం ఎత్తిపోతల పథకం ద్వారా 2716 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.15.40 కోట్లు వ్యయం అవుతుందని భావిస్తున్నారు. అలాగే నాలూరు ఎత్తిపోతల పథకం ద్వారా 8332 ఎకరాలకు నీరిచ్చేందుకు రూ.12.43 కోట్లు ఖర్చు కాగలదని అంచనాలు తయారు చేశారు. 

ఈ మూడు ఎత్తిపోతల పథకాల ద్వారా కురుపాం నియోజకవర్గ పరిధిలోని జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల ఎగువ భూములకు సాగునీరు అందించాలన్నది ఉద్దేశం. జలాశయ నిర్మాణ దశలో ఉన్నప్పటి నుంచి ఎత్తిపోతల పథకం మంజూరు చేయాలన్న డిమాండ్‌ ఎగువ ప్రాంత రైతుల నుంచి వినిపిస్తోంది. అయితే సమగ్ర అంచనాలు సిద్ధం చేస్తున్నామని... ప్రస్తుతం హైడ్రాలజికల్‌ అనుమతులు మాత్రమే వచ్చాయని ఈఈ బాలకృష్ణచౌదరి తెలిపారు.

 

Updated Date - 2020-12-06T04:43:23+05:30 IST