వాళ్లకు కుటుంబాలు ఉంటేగా కష్టాలు తెలయడానికి: అఖిలేష్

ABN , First Publish Date - 2022-02-18T23:46:46+05:30 IST

ఆనువంశిక నాయకులంటూ తమపై బీజేపీ చేస్తున్న విమర్శలకు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గట్టి ..

వాళ్లకు కుటుంబాలు ఉంటేగా కష్టాలు తెలయడానికి: అఖిలేష్

జలౌన్: ఆనువంశిక నాయకులంటూ తమపై బీజేపీ చేస్తున్న విమర్శలకు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కుటుంబాలే లేని వాళ్లకు కుటుంబ కష్టాలు ఎలా తెలుస్తాయని నిలదీశారు. కుటుంబాలు ఉన్న వాళ్లకే ఆ కుటుంబ కష్టాలు తెలుస్తాయని, అసలు కుటుంబమంటూ ఏదీ లేని వాళ్లకు కుటుంబ సభ్యుల కష్టనష్టాల గురించి ఏమి అర్ధమవుతుందని బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు. యూపీలోని జలౌన్‌లో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల సభలో అఖిలేష్ మాట్లాడుతూ, తాను ఆనవంశిక నేతనని బీజేపీ నేతలు చెబుతున్నారని, ఆ నేతలకు ఫ్యామిలీలు లేకపోవడం వల్లే కుటుంబ కష్టాలు తెలియవని అన్నారు. ఫ్యామిలీలో ఉంటున్న వారికే ధరలెలా చుక్కెలనంటుతున్నాయో తెలుస్తుందని, యువత ఉద్యోగాలు లేక ఎలా విలవిల్లాడుతున్నారో తెలుస్తుందని అన్నారు.


కేంద్రంపై అఖిలేష్ విరుచుకుపడుతూ, పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో ప్రజలు జమ చేసిన సొమ్మును పారిశ్రామికవేత్తలు ఎత్తుకుపోయారని, ఆ తర్వాత దేశాన్ని విడిచిపోయారని అన్నారు. కొద్ది రోజుల క్రితమే ఒక పారిశ్రామిక వేత్త 28 బ్యాంకుల నుంచి రూ.22,000 కోట్ల తీసుకుని పారిపోయారని తెలిపారు. ఇలా పారిపోయిన ఘటన ఇదే మొదటిది కూడా కాదని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద పారిశ్రామికవేత్తలు డబ్బులు దోచుకుని పరారయ్యారని అన్నారు.


నాలుగే దశ నాటికి 200 సీట్లు గెలుస్తాం...

ఉత్తరప్రదేశ్‌లో మొదటి రెండు విడతల పోలింగ్ పూర్తయ్యే సరికి తమ పార్టీ సెంచరీ (100 సీట్లు) చేసిందని, నాలుగో దశ పూర్తయ్యే సరికి 200 సీట్లు గెలుచుకోవడం ఖాయమని అఖిలేష్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈనెల 20న జరిగే మూడో దశ పోలింగ్‌లో జలౌన్ నియోజకవర్గం కూడా ఉంది. మొదటి రెండు దశల్లో 113 సీట్లకు పోలింగ్ జరుగగా, మూడో దశలో 56 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. ఏడు విడతల్లో పోలింగ్ పూర్తవుతుంది.

Updated Date - 2022-02-18T23:46:46+05:30 IST