Narendra Modi Vs Criticism : మోదీని విమర్శిస్తే జైలు తప్పదా?

ABN , First Publish Date - 2022-09-03T22:26:28+05:30 IST

ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి మీడియా పాత్ర చాలా ముఖ్యమని తెలిపారు.

Narendra Modi Vs Criticism : మోదీని విమర్శిస్తే జైలు తప్పదా?

న్యూఢిల్లీ : "విమర్శని ఆహ్వానిద్దాం, కానీ, ఆరోపణలను మాత్రం సహించవద్దు. ఇది వర్తమాన మౌలిక సూత్రం, ఈ కాలానికి అవసరం. విమర్శ అనేది అభిప్రాయాల ప్రక్షాళనకు తలుపులను తెరుస్తుంది. కానీ, ఎంత ఎక్కువగా ఆరోపణలు చేస్తే అంత ఎక్కువ బలాన్ని మనం కోల్పోతాం, ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది,” అన్నారు నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తొలినాళ్లలోనే. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘‘’నాకు ప్రధాన మంత్రి ముఖం నచ్చలేదు...’ అని అంటే, వెంటనే దాడులు, జైలు తప్పడం లేదు,” అన్నారు. చిన్నపాటి విమర్శ, కొద్దిపాటి ప్రతిఘటన కూడా సహించే పరిస్థితులు దేశంలో లేవని జస్టిస్ శ్రీకృష్ణ చేసిన వ్యాఖ్యలు – ప్రజాస్వామ్యయుత వాతావరణానికి సంబంధించి ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ప్రధాని స్పష్టంచేసిన విమర్శ – నింద అనే విభజనని అధికార యంత్రాంగం సరిగా అర్థం చేసుకుందా, లేదా అనే విషయం కూడా చర్చనీయాంశమైంది. 


మరాఠీ పత్రిక ‘పుధరి’ వజ్రోత్సవాల సందర్భంగా 2015 జనవరిలో కొల్హాపూర్లో జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, విమర్శల స్థానాన్ని ఆరోపణలు ఆక్రమించాయని చెప్పడానికి విచారిస్తున్నానని అన్నారు. ప్రతి నిర్ణయం తర్వాత, ప్రతి అభిప్రాయం తర్వాత విమర్శ తప్పనిసరిగా ఉండాలన్నారు. చర్చకు, సమీక్షకూ అవకాశం ఉండాలని చెప్పారు. చిట్టచివరిగా ఏర్పడే అభిప్రాయం సత్యాన్ని తెలుసుకోవడానికి దోహదపడుతుందని చెప్పారు. విమర్శ లేకపోతే ప్రజాస్వామ్యం నష్టపోతుందన్నారు. విమర్శల వల్ల ఎవరూ బాధపడకూడదన్నారు. సత్యాన్ని మదింపు చేసుకోవడానికి విమర్శ ఓ అవకాశాన్ని ఇస్తుందని, అంతేకాకుండా తప్పుడు దిశలో గమ్యం తెలియకుండా ప్రయాణించడాన్ని నివారించే అవకాశాలను సృష్టిస్తుందని, పొరపాట్లు చేయకుండా మనల్ని నిరోధిస్తుందని చెప్పారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి మీడియా పాత్ర చాలా ముఖ్యమని తెలిపారు.


మాటలకు, చేతలకు పొంతన ఏదీ?

నరేంద్ర మోదీ మాటల్లో ఏం చెప్పినా, చేతల్లో ఏం జరుగుతోందనేది చర్చనీయాంశమైంది. ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి తమకు భద్రత కరువైందని ఆయన విధానాలను విమర్శించే సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు, పాత్రికేయులు, మేధావులు, విద్యార్థి నాయకులు భావిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించేవారిని టీవీ న్యూస్ చానళ్ళు, సామాజిక మాధ్యమాల ద్వారా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మైనారిటీలపై దాడులు, ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటివాటిని ఎత్తి చూపినపుడు తమను జాతి వ్యతిరేక శక్తులుగా పేర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమర్ ఖలీద్, గౌరీ లంకేష్, షార్జీల్ ఇమామ్, స్వామి అగ్నివేష్, వరవరరావు  వంటివారు ఎదుర్కొన్న పరిస్థితులను ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. 


రాజద్రోహం కేసుల్లో పెరుగుదల

2014 మే నెలలో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి రాజద్రోహం కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జాతీయ నేర రికార్డుల బ్యూరో వెల్లడించిన వివరాలనుబట్టి తెలుస్తోంది. ప్రభుత్వ విధానాలపై నిరసన తెలియజేయడం, సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలను పంచుకోవడం, వ్యక్తిగతంగా సమాచారాన్ని తెలియజేసుకోవడం సైతం రాజద్రోహంగా పరిగణిస్తూ కేసులు పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది అక్టోబరులో టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత జట్టుపై పాకిస్థాన్ జట్టు విజయం సాధించినందుకు సంతోషిస్తూ పోస్టులు పెట్టిన ముగ్గురు కశ్మీరీ విద్యార్థులపై రాజద్రోహం కేసులు నమోదు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులు దుయ్యబడుతున్నారు.


ప్రధాని మోదీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్‌లను 2018లో విమర్శించినందుకు ఇంఫాల్‌కు చెందిన పాత్రికేయుడు కిషోర్ చంద్ర వాంగ్‌ఖెమ్చాపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. ప్రజల నుంచి విమర్శలు, నిరసనలు వ్యక్తమైనపుడు రాజద్రోహం కేసులను నమోదు చేయడం బీజేపీ పాలిత రాష్ట్రాల వ్యూహంగా మారిపోయిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 


2010 నుంచి 816 రాజద్రోహం కేసులు నమోదు కాగా, వీటిలో సుమారు 11,000 మంది నిందితులు. వీటిలో 65 శాతం కేసులు మోదీ అధికారం చేపట్టిన తర్వాతే నమోదయ్యాయి. గత దశాబ్దంలో రాజకీయ నేతలను, ప్రభుత్వాలను విమర్శించినందుకు 405 మంది రాజద్రోహం కేసులను ఎదుర్కొన్నారు. వీరిలో 95 శాతం మందిపై ఈ కేసులు 2014 తర్వాత నమోదయ్యాయి. వీరిలో 149 మందిపై ఈ కేసు నమోదు కావడానికి కారణం వారు మోదీని విమర్శించడం, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం అని రికార్డులు చెప్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు 144 మందిపై ఈ కేసులు నమోదయ్యాయి. 


ట్రోల్స్ వేధింపులు

ప్రపంచంలో ఇంటర్నెట్ జనాభా అధికంగా గల దేశాల్లో భారత దేశం రెండోది. అయితే బీజేపీ, మోదీలకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని సామాజిక మాధ్యమాల్లో వెంటాడుతున్నారని ప్రముఖ పాత్రికేయురాలు స్వాతి చతుర్వేది ‘అయామ్ ఏ ట్రోల్’ పుస్తకంలో రాశారు. బీజేపీ ప్రాపకంతోనే ఆన్‌లైన్ ట్రోలింగ్ జరుగుతోందని వెల్లడించారు. 2015 వరకు బీజేపీ వలంటీర్‌గా పని చేసిన సాధ్వి ఖోస్లా ఇంటర్వ్యూను ఈ పుస్తకంలో ప్రచురించారు. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ వ్యతిరేకులపై విమర్శలు, దూషణల కోసం వందలాది మంది సామాజిక మాద్యమ కార్యకర్తలను వినియోగించినట్లు తన పరిశోధనలో వెల్లడైందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాల్ సెంటర్ జాబ్ మాదిరిగా పని చేస్తున్నారన్నారు. 


పెగాసస్ గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ సహాయంతో చాలా మంది పాత్రికేయులు, రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారులపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం తన సొంత ప్రజలపైనే నిఘా పెట్టడమేమిటని అనేక మంది ప్రశ్నించారు. అయితే ఈ సాఫ్ట్‌వేర్‌పై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదిక ఇటీవలే అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ కమిటీకి సమర్పించిన 29 ఫోన్లలో ఐదు ఫోన్లలో మాత్రమే ఓ మాల్‌వేర్ ఉందని, అది పెగాసస్ కాదని సుప్రీంకోర్టు చెప్పింది. 


మోదీ విమర్శకుల్లో ప్రణబ్ ముఖర్జీ!

కొసమెరుపు ఏమిటంటే, మోదీ విమర్శకుల్లో దివంగత ప్రణబ్ ముఖర్జీ కూడా ఉన్నారు. అయితే ఆయన చేసిన విమర్శలకు పెద్దగా ప్రచారం లభించలేదు. ఆ విమర్శలు ఏమిటంటే, 

- పార్లమెంటు కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూసే ప్రధాన బాధ్యతను నిర్వహించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. 

- మోదీ వ్యవహార శైలిలో ఆధిపత్య ధోరణి కనిపిస్తుంది. 

- 2015 డిసెంబరులో కాబూల్ నుంచి తిరిగి వస్తూ నవాజ్ షరీఫ్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో దిగడం అనవసరం, అవాంఛనీయం. 

- విదేశీ నేతలతో మోదీ మరీ అతిగా వ్యక్తిగత సంబంధాలు పెట్టుకుంటున్నారు. 

- సరిహద్దుల ఆవల లక్షిత దాడులు (సర్జికల్ స్ట్రైక్స్) చేయడం సాధారణ విషయమే. వాటి గురించి మితిమీరి ప్రచారం చేయవలసిన అవసరం లేదు.

- ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం పొరపాటు మాత్రమే కాదు, చాలా పెద్ద తప్పు.

- పెద్ద నోట్లను రద్దు చేసేటపుడు చెప్పిన లక్ష్యాలు నెరవేరలేదు. 

                                           - యెనుములపల్లి వేంకట రమణ మూర్తి 

Updated Date - 2022-09-03T22:26:28+05:30 IST