క్వారంటైన్‌లో ఉండాల్సిన వారు రోడ్లపైకి

ABN , First Publish Date - 2020-05-23T11:03:48+05:30 IST

ఒకరికి కరోనా వచ్చిందని నిర్ధారణ అయితే వ్యాప్తి కాకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులతోపాటు సన్నిహితంగా ఉన్నవారిని,

క్వారంటైన్‌లో ఉండాల్సిన వారు రోడ్లపైకి

 కరోనా బాధిత కుటుంబీకులపై లేని నిఘా


హైదరాబాద్‌ సిటీ, మే 22 (ఆంధ్రజ్యోతి): ఒకరికి కరోనా వచ్చిందని నిర్ధారణ అయితే వ్యాప్తి కాకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులతోపాటు సన్నిహితంగా ఉన్నవారిని, ఇరుగుపొరుగును కట్టడి చేస్తారు. క్వారంటైన్‌లో ఉన్నవారు ఏం చేస్తున్నారు? బయటికి వచ్చారా? చూసుకోవాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులపై ఉంటుంది. ఇటీవల లంగర్‌హౌ్‌సలో జరిగిన ఘటన అధికారుల బాధ్యతా రాహిత్యాన్ని ఎత్తి చూపుతోంది. లంగర్‌హౌస్‌ ప్రశాంత్‌నగర్‌లో ఓ మహిళకు పాజిటివ్‌ వచ్చింది. ఆమెను గాంధీ ఆస్పత్రికి మంగళవారం తరలించారు. అనంతరం అధికారులు కుటుంబసభ్యులతోపాటు ఆమె భర్తను క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఆమె భర్త నిబంధనలు పాటించకుండా బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. మత్తులో రాత్రి మొత్తం రోడ్లపై తిరుగుతూ మూత్రవిసర్జన చేయబోయాడు. గమనించి అడ్డుకున్న స్థానికులతో గొడవపడ్డాడు.


అంతటితో ఆగకుండా తెల్లవారు జామున 3 గంటల సమయంలో స్నేహితులతో కలిసి వారించిన వాళ్ల వాహనాలకు నిప్పు పెట్టి పారిపోయాడు. రాత్రి సమయంలో కర్ఫ్యూ అమలులో ఉంది. సాధారణ వ్యక్తులు కూడా బయటకు వచ్చేందుకు అనుమతిలేదు. ఇంట్లో ఉండాల్సిన వ్యక్తి రోడ్లపై తిరుగుతున్నా అధికారులకు ఆవిషయం తెలియకపోవడం విశేషం. మరుసటి రోజు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితులను క్వారంటైన్‌కు తరలించారు. భార్య ద్వారా అతడికి, అతడి ద్వారా స్నేహితులకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదుకాని లంగర్‌హౌస్‌ ప్రాంతంలో తొలి కరోనా కేసు నమోదవడం, ఆమె కుటుంబీకులు స్నేహితులతో కలిసి రోడ్లపై సంచరించడం చూసిన స్థానికులు భయాందోళలనకు గురవుతున్నారు.


పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు క్వారంటైన్‌లో ఉండాల్సిన వారిపై నిఘా పెట్టడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా వచ్చిన వారి కుటుంబీకులను నియంత్రించలేకపోతే సామూహిక వ్యాప్తి జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కరోనా ప్రారంభ దశలో విదేశాల నుంచి వచ్చిన వారు పార్టీలు, ఫంక్షన్‌లకు హాజరై కరోనా వ్యాప్తికి ప్రత్యక్షంగా కారణమయ్యారు. వారిపై నిఘా పెట్టకపోవడంతో అధికారులు కూడా వైరస్‌ వ్యాప్తికి పరోక్షంగా కారకులయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2020-05-23T11:03:48+05:30 IST