సింధియాపై రాహుల్ సెటైర్...

ABN , First Publish Date - 2021-07-17T00:41:31+05:30 IST

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి చేరి కేంద్ర మంత్రి పదవిని సొంతం చేసుకున్న జ్యోతిరాదిత్య..

సింధియాపై రాహుల్ సెటైర్...

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి చేరి కేంద్ర మంత్రి పదవిని సొంతం చేసుకున్న జ్యోతిరాదిత్య సింధియాపై రాహుల్ విమర్శలు గుప్పించారు. వాస్తవాలను, బీజేపీని ఎదుర్కోలేక భయపడే వాళ్లు స్వేచ్ఛగా పార్టీని వీడి వెళ్లవచ్చని అన్నారు. పార్టీ బయట ఉంటూ భయం లేని నేతలు కాంగ్రెస్‌లో వస్తామంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వర్కర్లతో రాహుల్ శుక్రవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. భయపడే సింధియాలు పార్టీని వీడితే ఇబ్బందేమీ లేదన్నారు. భయమంటే తెలియని వ్యక్తులు చాలామందే ఉన్నారని, అయితే వాళ్లు పార్టీ బయట ఉన్నారని అన్నారు. వాళ్లంతా మనవాళ్లేనని పేర్కొన్నారు. అటువంటి వారిని పార్టీలోకి తెండని కార్యకర్తలకు సూచించారు. అలాగే పార్టీలోనే ఉంటూ బయపడే వాళ్లను బయటకు పంపాలని స్పష్టం చేశారు.


''వాళ్లంతా ఆర్ఎస్ఎస్ వ్యక్తులు. వాళ్లు వెళ్లిపోతారు. వెళ్లనీయండి. వాళ్లను మనం కోరుకోం. వారి అవసరం లేదు. భయమంటే తెలియని వ్యక్తులు మనకు కావాలి. అదే మన సిద్ధాంతం, నా సందేశం కూడా అదే'' అని రాహుల్ గాందీ అన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియోకు చెందిన సుమారు 3,500 మంది పార్టీ కార్యకర్తలతో రాహుల్ జూమ్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ జరపడం ఇదే మొదటి సారి. వివిధ రంగాలకు చెందిన సుమారు 10 మంది యువ కార్యకర్తలతో కూడా రాహుల్ నేరుగా మాట్లాడారు. తాను ఎప్పుడూ వారికి అందుబాటులో ఉంటాననే భరోసా ఇచ్చారు. అలాగే సోషల్ మీడియా సభ్యులు తనతో మాట్లాడేందుకు భయపడాల్సిన పని లేదని, వారంతా తన కుటుంబ సభ్యుల్లో భాగమేనని అన్నారు. ''మీరు మీ  సోదరుడితో మాట్లాడుతున్నారు. భయపడాల్సిన పని లేదు. నేను కూడా ఎవరికీ భయపడటం మీరు చూడలేరు'' అని పార్టీ సోషల్ మీడియా వర్కర్లలో ఆయన ఉత్సాహం నింపారు.

Updated Date - 2021-07-17T00:41:31+05:30 IST