ఆ మూడు ఇచ్చి, పుచ్చుకోక తప్పదు... చైనా మంత్రికి తెగేసి చెప్పిన జైశంకర్...

ABN , First Publish Date - 2022-07-07T22:11:09+05:30 IST

భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు మూడు అంశాలు ప్రాతిపదిక

ఆ మూడు ఇచ్చి, పుచ్చుకోక తప్పదు... చైనా మంత్రికి తెగేసి చెప్పిన జైశంకర్...

న్యూఢిల్లీ : భారత్-చైనా (India-China) మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు మూడు అంశాలు ప్రాతిపదిక కావాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీకి మన దేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanyam Jaishankar) స్పష్టం చేశారు. తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి కొనసాగుతున్న సమస్యలు సత్వరం పరిష్కారమవాలని చెప్పారు. బాలీలో జరిగిన జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం నేపథ్యంలో వీరిద్దరూ ప్రత్యేకంగా ఓ గంటపాటు సమావేశమయ్యారు. 


ద్వైపాక్షిక సంబంధాలకు పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనాలు ప్రాతిపదిక కావాలని వాంగ్ యీకి జైశంకర్ చెప్పారు. సరిహద్దు సమస్యను సత్వరమే పరిష్కరించుకోవడం కోసం త్వరగా ఇరు దేశాల సైన్యాల మధ్య చర్చలు జరగాలని జైశంకర్, వాంగ్ ఆకాంక్షించారు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో చైనా నుంచి భారత దేశానికి వచ్చిన భారతీయ విద్యార్థులను తిరిగి చైనాకు అనుమతించడంపై వాంగ్‌తో జైశంకర్ చర్చించారు. ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకల పునరుద్ధరణ గురించి కూడా మాట్లాడారు. 


విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపిన వివరాల ప్రకారం, జైశంకర్, వాంగ్ (Wang Yi) గతంలో జరిగిన సమావేశాల్లో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్స్, అవగాహనలకు పూర్తిగా కట్టుబడి ఉండటం చాలా ముఖ్యమని జైశంకర్ గట్టిగా చెప్పారు. తూర్పు లడఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ సత్వరమే పరిష్కారం కావాలని జైశంకర్ పిలుపునిచ్చారు. తూర్పు లడఖ్‌లో కొన్ని ఘర్షణ ప్రాంతాల నుంచి దళాల ఉపసంహరణ వేగాన్ని కొనసాగించాలని కోరారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనాలంటే మిగిలిన ఘర్షణ ప్రాంతాల నుంచి కూడా దళాలను పూర్తిగా ఉపసంహరించాలని స్పష్టం చేశారు. 


భారత్, చైనా సైనిక, దౌత్య అధికారులు ప్రతి నిత్యం సంప్రదింపులు జరపాలని, సాధ్యమైనంత త్వరగా సీనియర్ సైనిక కమాండర్లు తదుపరి విడత చర్చలు జరపాలని ఇరువురు మంత్రులు ఆకాంక్షించారు. 


చైనా (China) నుంచి భారత దేశానికి వచ్చిన విద్యార్థులు తిరిగి చైనా వెళ్ళేందుకు ఏర్పాట్లను వేగవంతం చేయాలని జైశంకర్ నొక్కివక్కాణించారు. చైనాలో కోవిడ్-19 ఆంక్షల కారణంగా రెండేళ్ళ నుంచి భారతీయ విద్యార్థులు తిరిగి చైనాకు వెళ్ళలేకపోతున్న సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-07-07T22:11:09+05:30 IST