ఆ ఎస్పీలు ‘మారాలి’!

ABN , First Publish Date - 2022-08-10T07:58:32+05:30 IST

ఆ ఎస్పీలు ‘మారాలి’!

ఆ ఎస్పీలు ‘మారాలి’!

పనితీరుపై ఉన్నతాధికారుల సమీక్ష

పలువురు ఎస్పీల తీరుపై అసంతృప్తి

ప్రపంచానికి కనిపించని ‘ప్రశాంత’ ఎస్పీ

ప్రచారం బురుజంత.. పనితీరు గోరంత

‘ముఖ్య’ జిల్లాకు ఎస్పీ.. డ్యూటీలో లేజీ

షరా ‘మామూలు’గా మరో ఎస్పీ

వారిపై బదిలీ వేటు తప్పదని ప్రచారం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమైన పలు జిల్లాల ఎస్పీలు పని తీరులో చతికిలపడుతున్నారు. కొందరు ప్రచారంతో నెట్టుకొస్తుండగా... మరికొందరు స్వామి భక్తితో సాగిపోతున్నారు. మరికొందరు... నెలవారీ మామూళ్లు, ప్రైవేటు సెటిల్‌మెంట్లతో ‘బిజీ’గా మారిపోయారు. వీరిపై పోలీసు పెద్దలకు సమాచారం అందడంతో పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.  అనకాపల్లి, నెల్లూరులో కానిస్టేబుళ్లు ముఖ్యమంత్రిపై సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేయడం.. అనంతపురంలో కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ ప్లకార్డు పట్టుకుని సీఎం పర్యటన రోజే నిరసన వ్యక్తం చేయడంలాంటివి ఉన్నతాధికారులను ఉలికిపాటుకు గురి చేశాయి. కోనసీమలో అల్లర్ల సమయంలో పోలీసుల తీరు విస్మయానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం జిల్లా ఎస్పీల పని తీరును అధికారులు సమీక్షించి... ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ముఖ్యమంత్రి, డీజీపీ సొంత ప్రాంతమైన రాయలసీమ జిల్లాల పోలీసు అధికారుల పనితీరుపైనే ప్రభుత్వంలో అసంతృప్తి వ్యక్తమైనట్లు ప్రచారం జరుగుతోంది. సీమలో ‘ముఖ్య’మైన జిల్లా పోలీస్‌ బాస్‌ పనితీరు మరీ అధ్వానంగా ఉన్నట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టిన ఆయన కీలక జిల్లాలో పనితీరు సరిగా కనబరచడం లేదంటూ ప్రభుత్వానికి నివేదికలు అందాయి. వ్యక్తిగత అలవాట్లు కూడా ఆయన పనితీరుపై ప్రభావం చూపుతున్నాయని... త్వరలో ఆయనపై బదిలీ వేటు తప్పదని తెలుస్తోంది. నాలుగు నెలల క్రితం ఏర్పాటైన ఒక జిల్లాకు యువ ఐపీఎస్‌ అధికారి ఎస్పీగా నియమితులయ్యారు. చూడటానికి ఆజానుబాహుడిలా ఉండే ఆ అధికారి జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉన్న పోలీసు స్టేషన్‌ను సైతం విజిట్‌ చేయలేదని తెలుస్తోంది. పూర్తిగా తన బంగ్లాకే పరిమితమై అన్ని బాధ్యతలు అడిషనల్‌ ఎస్పీకే అప్పగించి... తనలోకంలో తాను ఉంటున్నారని సమాచారం. దీంతో... ‘ప్రశాంత’మైన ఆ జిల్లాలో పరిస్థితి కట్టు తప్పకుండా డీఐజీ ఎక్కువగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఆ పక్కనే ఉన్న పాత జిల్లాలో ఎస్పీ పనితీరుపై బాగా విమర్శలు వస్తున్నాయి. చేయాల్సినవి చేయకుండా, అనవసరమైన వాటిపై దృష్టి సారించి సిబ్బందిని ఇబ్బంది పెడుతుంటారని ప్రచారం జరుగుతోంది. పోలీస్‌ పెద్దలకు ఆయన పనితీరు నచ్చకపోయినప్పటికీ... పొరుగు రాష్ట్రానికి చెందిన కీలక రాజకీయ నాయకుల అండదండలతోనే ఆయన కొనసాగుతున్నారని సమాచారం. ఇటీవలే సీమ జిల్లాకు వచ్చిన మరో ఎస్పీ ప్రచారంలో మాత్రం పెద్ద బురుజంత... పనితీరులో గులకరాయంత అని వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తూ ఫొటోలకు పోజులు ఇస్తూ హడావుడి చేస్తుంటారని... పోలీసింగ్‌లో మాత్రం అంత విషయం లేదనే చెబుతారు.


కోస్తాలో ఇలా... 

కోస్తా జిల్లాల్లోని ఒక ఎస్పీ నెల మామూళ్లు ఇవ్వకుంటే పోలీసు అధికారులను బహిరంగంగానే తిడతారనే పేరుంది. గతంలో ఆయన పరిధిలో ఉన్న కల్పతరువులాంటి సబ్‌ డివిజన్‌... ఆతర్వాత జిల్లాగా మారిపోయింది. దీంతో ఆయన తెగ బాధపడుతున్నారట! ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఏ పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చినా నేరుగా జిల్లా ఎస్పీకే చెప్పాలి. ఆయన బృందం రంగంలోకి దిగి వ్యవహారాన్ని సర్దుబాటు చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక దొంగతనం ఘటనలో పొంతనలేని వివరణ ఇచ్చిన ఆయన మాటలు మాత్రం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయంటూ పోలీసులు గుర్తు చేస్తున్నారు. ఆ జిల్లా పొరుగునే కొత్తగా ఏర్పాటైన మరో జిల్లా ఎస్పీ పనితీరు కూడా అంత బాగోలేదంటున్నారు. సదరు యువ ఐపీఎస్‌ పనితీరుపై పెదవి విరుపులు కనిపిస్తుంటే ఆయన సతీమణి పనితీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇద్దరు మహిళా ఎస్పీల సామర్థ్యానికి ప్రజలు సెల్యూట్‌ కొడుతుండగా... మరో ఎస్పీ పరిస్థితి ఏదో ఉన్నారంటే ఉన్నరనేలా ఉందని చెబుతున్నారు. ఎప్పుడు బదిలీలు జరిగినా రాయలసీమలో ముగ్గురు, కోస్తాలో ఇద్దరు, ఉత్తరాంధ్రలో ఒకరి బదిలీ చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి కోరారు. త్వరలో ఆ జిల్లాకు కూడా కొత్త ఎస్పీని ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది.

Updated Date - 2022-08-10T07:58:32+05:30 IST