మాస్క్ ధరించని ప్రయాణికులు పోలీస్ స్టేషన్‌కే!

ABN , First Publish Date - 2021-03-18T21:53:21+05:30 IST

కోవిడ్ నిబంధనలను పాటించని ప్రయాణికులపై ఎయిర్‌లైన్స్ కఠిన

మాస్క్ ధరించని ప్రయాణికులు పోలీస్ స్టేషన్‌కే!

న్యూఢిల్లీ : కోవిడ్ నిబంధనలను పాటించని ప్రయాణికులపై ఎయిర్‌లైన్స్ కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. మాస్క్ ధరించడానికి ఇష్టపడని ప్రయాణికులను పోలీసులకు అప్పగించడానికి సైతం వెనుకాడటం లేదు. విమానయానాన్ని నియంత్రించే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మార్గదర్శకాల నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రయాణికులపై ఎయిర్‌లైన్స్ సంస్థలు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నాయి. 


మాస్క్ ధరించడానికి తిరస్కరించే విమాన ప్రయాణికులను నో-ఫ్లై లిస్ట్‌లో పెట్టడం, పరిస్థితి తీవ్రరూపం దాల్చితే నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రయాణికులను పోలీసులకు అప్పగించడం వంటి చర్యలను ఎయిర్‌లైన్స్ అమలు చేస్తున్నాయి. 


అలయెన్స్ ఎయిర్ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం, జమ్మూ నుంచి ఢిల్లీ వెళ్తున్న నలుగురు ప్రయాణికులను మార్చి 16న నో-ఫ్లై లిస్ట్‌లో పెట్టారు. ఈ నలుగురు ప్రయాణికులు మాస్క్ ధరించడానికి నిరాకరించడంతో ఈ చర్య తీసుకున్నారు. 


ఇండిగో ఎయిర్‌లైన్స్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ నుంచి గోవా వెళ్ళేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికురాలిని పోలీసులకు అప్పగించారు. ఆమె మాస్క్ ధరించకపోవడంతో, పదే పదే విజ్ఞప్తి చేసి, హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఆమ మాస్క్ ధరించలేదని, దీంతో పోలీసులకు అప్పగించామని ఇండిగో ప్రకటించింది. 


డీజీసీఏ నిబంధనల ప్రకారం, అనుచితంగా ప్రవర్తించే విమాన ప్రయాణికులను విమానయాన సంస్థలు నో-ఫ్లై లిస్ట్‌లో పెట్టవచ్చు. డీజీసీఏ ఇటీవల విడుదల చేసిన నోటీసు ప్రకారం, విమానంలో కోవిడ్-19 నిబంధనలను పాటించని ప్రయాణికులను వెంటనే విమానం నుంచి దించేయవచ్చు. 


Updated Date - 2021-03-18T21:53:21+05:30 IST