Abn logo
Jun 6 2020 @ 02:11AM

ఆ మంచిరోజుల ‘హంసధ్వని’

1956లో బెంగలూరులోని ఫోర్ట్ ఉన్నత పాఠశాలలో శ్రీరామనవమి ఉత్సవాల సంగీత సభలో బడే గులాం అలీ ఖాన్ హంసధ్వని రాగాలాపన బహు భాషలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయ విధానాలు, సంగీత సంప్రదాయాలు, వాస్తు శిల్ప శైలులను ఒక చోటకు తీసుకువచ్చి సమ్మిళితం చేసింది. మన దేశ, మన భారతీయ నాగరికత సాంస్కృతిక వైవిధ్యానికి బడే సాహెబ్ గాన కచేరీ ఒక ప్రతిష్ఠాకరమైన ప్రశంస. సందర్భవశాత్తు అదొక ఆశ్చర్యకరమైన, ఆనందప్రదమైన, ఆవిస్మరణీయమైన రసానానుభవం.


ప్రతిసాయంత్రమూ ఆ రోజుకు నా అధ్యయన లేదా రచనా వ్యాసంగాన్ని విరమించుకుని భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని విధిగా వింటుంటాను. గతంలో సిడిలు, కేసెట్లతో ఆ మహత్తర గాంధర్వ లోకంలో సేద తీరేవాణ్ణి. ఇప్పుడు అనంత సంగీత కృతుల భండారం (యూ ట్యూబ్ అని చెప్పాలా?)లో శోధించి, వినదలుచుకున్నదాన్ని వింటాను. గాయనీగాయకుల లేదా రాగాల పరంగా నా ఎంపిక ఉంటుంది. ఇటీవల యూ ట్యూబ్ సంగీత నిధిలో ఒక ఆణిముత్యాన్ని చూశాను. విన్నాను. వెన్వెంటనే మళ్ళీ విన్నాను. పదే పదే విన్నాను. తరచు వింటూనే వున్నాను. అదే, ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ హంసధ్వని రాగాలాపన.


బడే గులాం అలీఖాన్ 1902లో పశ్చిమ పంజాబ్ లోని కసూర్‌లో జన్మించారు. ఆయన తండ్రి అలీ బక్ష్ గాయకుడు. పాటియాలా ‘ఘరానా’ (హిందుస్థానీ సంగీత సంప్రదాయం)లో సుప్రసిద్ధుడు. పాటియాలా సంస్థాన సిక్కు మహారాజాలు ఆ సంగీత సంప్రదాయానికి పోషకులు. దేశ విభజనతో బడే సాహెబ్ పాకిస్థాన్‌లో స్థిరపడ్డారు. అయితే అక్కడ శాస్త్రీయ సంగీతాన్ని అభిమానించేవారు (శ్రోతలూ, పోషకులూ) చాలా స్వల్పసంఖ్యలో ఉండడంతో భారత్‌కు తిరిగి వచ్చేందుకు గాన సాహెబ్ నిర్ణయించుకున్నారు. 


1950 దశకంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య రాక పోకలు ఇప్పటి కంటే చాలా సులువుగా సాగుతుండేవి. బడే గులాం బొంబాయికి వచ్చారు. ఒక శ్రేయోభిలాషి ఆయన అవస్థను మొరార్జీ దేశాయి (ఆనాటి ఉమ్మడి బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రి) దృష్టికి తీసుకు వెళ్ళారు. మొరార్జీ భాయి ఆ మహాగాయకుడికి ప్రభుత్వ గృహాన్ని సమకూర్చారు. కేంద్రంలోని జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం పాకిస్థాన్ నుంచి వచ్చిన ఈ ఉస్తాద్ భారతదేశ పౌరుడు అయ్యేందుకు దారిని సుగమం చేసింది. 


మనోహరమూ, శ్రవణపేయమూ అయిన హంసధ్వని రాగాన్ని తొలుత రామస్వామి దీక్షితార్ (కర్ణాటక సంగీత సంప్రదాయ మహాత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్ తండ్రి) స్వరబద్ధం చేశారు. గాన విదుషీమణులు ఎం. ఎస్.సుబ్బు లక్ష్మి, ఎం.ఎల్.వసంతకుమారి మొదలైన వారు తమ కచేరీలలో విధిగాగానం చేసే ‘వాతాపి గణ పతిం భజే’ తదితర పాటలను హంసధ్వని రాగంలో ఆలాపిస్తుంటారు. 18వ శతాబ్దిలో ఉదయించిన ఈ కర్ణాటక రాగాన్ని తదనంతర కాలంలో హిందుస్థానీ సంగీతవేత్తలు స్వీకరించి, తమ సంప్రదాయంలో భాగంగా చేసుకున్నారు. 


కర్ణాటక సంగీతం కంటే హిందుస్థానీ సంగీతాన్నే నేను ఎక్కువగా వింటుంటాను. గాయకుడు అమీర్ ఖాన్, గాయని కిషోర్ అమోంకర్, పిల్లనగ్రోవి విద్వాంసుడు పన్నాలాల్ ఘోష్ ఆలాపించిన హంసధ్వనిని నేను చాలా సార్లు విన్నాను. అయితే బడే గులాం అలీ ఖాన్ గానం చేసిన హంసధ్వనిని వినడం ఇదే మొదటిసారి. గతంలో బడే సాహెబ్ పహాడీ, బేహాగ్ రాగాలాపనలను విన్నాను. అవంటే నాకు మహా ప్రీతి. అయితే బడే సాహెబ్ హంసధ్వనిని చాలా అరుదుగా మాత్రమే ఆలాపించినందున యూ ట్యూబ్‌లో లభించిన ఆ అనర్ఘ రత్నం చాలా ప్రత్యేకమైనది. ఆ సంగీత భండారంలో మరింతగా శోధించగా ఎంతో ఆసక్తికరమైన, నాకు మరీ ఆనందదాయకమైన వివరాలు లభించాయి. మా ఊరు బెంగలూరులో బడే గులాం అలీఖాన్ 1956లో నిర్వహించిన సంగీత కచేరీలో ఆలాపించిన హంసధ్వనే ఇప్పుడు యూ ట్యూబ్ నాకు ప్రసాదించిన గాన సుధ. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఆ సంగీత కచేరీ జరిగింది. ఈ సంగీత సభ అప్పుడూ ఇప్పుడూ బెంగలూరు సంగీత సంస్కృతిలో ఒక ముఖ్య అంశం. ఏటా చామరాజ్ పేట లోని ఫోర్ట్ ఉన్నత పాఠశాల విశాల ఆవరణలో ఆ సంగీత సభను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆ ఉన్నత పాఠశాల పేరుకు మూలమైన ‘ఫోర్ట్’ తొలుత ఒక మట్టి కోట. 16 వ శతాబ్దిలో కెంపగౌడ నిర్మించాడు. ఆ తరువాత హైదరాలీ దానిని రాతి కోటగా పునర్నిర్మించాడు. అతడి కుమారుడు టిప్పు సుల్తాన్ 18వ శతాబ్దిలో ఆ కోటను మరింత సుందరంగా సింగారించాడు. అయితే ఆ ఉన్నత పాఠశాల మాత్రం 20 వ శతాబ్ది తొలినాళ్ళ నాటిది. దాని సొగసైన భవనాన్ని బ్రిటిష్ వలసపాలనాకాలపు వాస్తు శైలిలో నిర్మించారు.


ఈ చారిత్రక వివరాలు నన్ను అమితంగా పులకింపచేశాయి. ఇటీవలి సంవత్సరాలలో శ్రీరామనవమి ఉత్సవాల సంగీత సభలకు స్వయంగా వెళుతున్నాను. 1956నాటికి నేను ఇంకా ఈ లోకంలోకి రాలేదు. అయితే ఆ ఏడాది బడే సాహెబ్ హంసధ్వని రాగా లాపనను విన్నవారిలో కొంత మంది, ముఖ్యంగా బెంగలూరు నగర ప్రముఖ సంగీత రసికులు శివరామ్, లలిత ఉభయకర్ లు తదనంతర కాలంలో నాకు పరిచితులయ్యారు. శాస్త్రీయ సంగీతంలో విశేష శ్రద్ధాసక్తులు గల విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సి.వి.రామన్ కూడా ఆనాటి బడే సాహెబ్ గాన కచేరిలో శ్రోతగా ఉండివుంటారని నేను భావిస్తున్నాను. చామరాజ్ పేట్‌లో నివసిస్తున్న మా బాబాయిలు, పిన్నమ్మలు, మామయ్యలు, అత్తమ్మలలో కొంత మంది కూడా ఆ మహాగాయకుని కచేరీకి హాజరయివుంటారు. 


పాకిస్థాన్‌లో జన్మించిన ముస్లిం సంగీత విద్వాంసుడు, సిక్కు మహారాజాల పోషణలో వర్ధిల్లిన పాటియాలా ఘరానా ఉస్తాద్ భారతదేశపు దక్షిణాది మహానగరంలో శ్రీరామనవమి ఉత్సవాల సంగీత సభలో హంసధ్వనిని ఆలాపించి సంగీత ప్రియులకు ఒక వినూత్న రసనానుభవాన్ని ప్రసాదించారు. హిందూమత మహాన్నత పూజ్య పురుషుని పేరిట నిర్వహించిన ఉత్సవాలలో కర్ణాటక సంగీత సంప్రదాయ రాగాన్ని బడే సాహెబ్ ఆలాపించారు. బ్రిటిష్ వలసపాలన కాలంలో నిర్మించిన ఒక పాఠశాల ఆవరణలో ఆ సంగీత కచేరీని నిర్వహించారు. 16వ శతాబ్దినాటి కోట పేరిట ఆ ఉన్నత పాఠశాలకు నామకరణం చేయడం జరిగింది. ఆ కోట ప్రస్తుత రూపురేఖలు హిందూ, ముస్లిం పాలకుల కళాభిరుచుల నుంచి సంతరించుకున్నవే. మరో ముఖ్యమైన విశేషాన్ని కూడా తప్పక చెప్పవలసివున్నది. బడే సాహెబ్ గాన కచేరీ జరిగిన 1956లోనే దక్షిణ భారతావనిలోని కన్నడ భాషా ప్రాంతాలన్నీ విలీనమై కన్నడిగులకు ఒక సమైక్యరాష్ట్ర మేర్పడింది. బ్రిటిష్ వారి హయాంలో కన్నడ భాషీయులు మైసూరు, హైదరాబాద్ సంస్థానాలలోనూ; మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీలలోనూ నివసిస్తుండేవారు. స్వాతంత్ర్యానంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటునకు ప్రజలు ఉద్యమించిన ఫలితంగా కన్నడ ప్రాంతాలన్నీ విలీనమై 1956లో సమైక్య కన్నడ రాష్ట్ర మేర్పడింది.


భారతీయ సంస్కృతి గురించి అదొక ఏకాండశిల లాంటిదనే విధంగా మాట్లాడడం అసాధ్యమని ప్రముఖ కన్నడ సాహితీవేత్త శివరామ కారత్ ఒకసారి వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఇలా అన్నారు: ‘భారతీయ సంస్కృతి నేడు పలు రీతుల్లో ప్రవర్థిల్లుతున్నది. కనుక దాని గురించి వాస్తవంగా ‘‘సంస్కృతులు’’అని మాట్లాడవలసివున్నది. ఈ సంస్కృతి మూలాలు పురాతన కాలంలో వున్నాయి. పలు జాతులు, భిన్న భిన్న దేశాల, మతాల ప్రజలతో సంబంధాలు, అనుబంధాల ద్వారా ఈ సంస్కృతి అభివృద్ధి చెందింది. కనుక భారతీయ సంస్కృతిలోని వివిధ అంశాలలో ఏది దేశీయమైనది, ఏది వైదేశికమైనదో చెప్పలేము. అలాగే మనం ఏది ఇష్టపూర్వకంగా తీసుకున్నదో, ఏది అధికార ప్రాబల్యంతో మన మీద మోపబడిందో చెప్పలేము. భారతీయ సంస్కృతిని ఈ దృక్పథంతో చూసినప్పుడు, వివేచించినప్పుడు ఎటువంటి దురహంకారాలకు, దురభిమానాలకు తావులేదనే సత్యాన్ని మనం గ్రహిస్తాము’,


గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ కూడా మన ఉమ్మడి వారసత్వ వైవిధ్యం గురించి అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. టాగోర్ ఒకసారి ఇలా వ్యాఖ్యానించారు: ‘సుదూర ప్రదేశాల నుంచి ఎంతో మంది ప్రజలు అలలు అలలుగా ఈ గడ్డకు వచ్చారు. ఆర్యులు, ఆర్యేతరులు, ద్రావిడియన్లు, చైనీయులు, శకులు, హూణులు, పఠాన్లు, మొగల్స్ ఈ పుణ్యగడ్డకు తరలి వచ్చారు. దీనిని తమ జన్మ భూమిగా గౌరవించారు. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఈ భిన్న భిన్న జాతుల వారందరూ ఈ పుణ్యగడ్డపై ఏకమై ఒకే జాతిగా వర్థిల్లుతున్నారు’. శివరామ్ కారంత్, రవీంద్రనాథ్ టాగోర్ వక్కాణించిన బహుతా వాదం, సాంస్కృతిక వైవిధ్యం భారతీయ జీవనస్రవంతిలో ఎల్లెడలా కానవస్తుంది. మన జీవనశోభకు ఆ వైవిధ్యమే ఆలవాలంగా ఉన్నది. బహశా, ముఖ్యంగా మన శాస్త్రీయ సంగీతంలో ఇది మరింత స్పష్టంగా వర్థిల్లుతున్నది.


సంగీత వాద్యం లేదా రాగం లేదా గాన పద్ధతి ఏదైనా తీసుకోండి ఏది హిందూ ప్రదానమో ఏది ముస్లిం ప్రదానమో; అలాగే ఏది దేశీయమో, ఏది వైదేశికమో చెప్పలేము. సరే, మన ప్రధానమంత్రి శాస్త్రీయ సంగీతాన్ని అభిమానిస్తారో లేదో నాకు తెలియదు. శాస్త్రీయ సంగీతమంటే ప్రధానమంత్రికి ఏమీ ఆసక్తిలేకపోయినప్పటికీ, నేను ఈ కాలమ్‌లో వివరించిన రాగ స్వర కల్పనలను ప్రతిరోజూ యూట్యూబ్‌లో ఒక గంటసేపు వినాలని ఆయనకు, హిందూత్వ మద్దతుదారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. హంసధ్వనిని నిత్యం ఆలకిస్తే వారు తమ భారత్ భావన గురించి పునరాలోచన చేసే అవకాశమున్నది. సంకుచిత మనస్తత్వాన్ని, దురహంకార ధోరణులను విడనాడి భారతీయుడుగా ఉండడమంటే ఏమిటో వారు తప్పక ఒక విశాల దృష్టితో అర్థం చేసుకుంటారు. 1956లో బెంగలూరులోని ఫోర్ట్ ఉన్నత పాఠశాలలో శ్రీరామనవమి ఉత్సవాల సంగీత సభలో బడే గులాం అలీ ఖాన్ హంసధ్వని రాగాలాపన బహు భాషలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయ విధానాలు, సంగీత సంప్రదాయాలు, వాస్తు శిల్ప శైలులను ఒక చోటకు తీసుకువచ్చి సమ్మిళితం చేసింది. మన దేశ, మన భారతీయ నాగరికత సాంస్కృతిక వైవిధ్యానికి బడే సాహెబ్ గాన కచేరీ ఒక ప్రతిష్ఠాకరమైన ప్రశంస. సందర్భవశాత్తు అదొక ఆశ్చర్యకరమైన, ఆనందప్రదమైన, ఆవిస్మరణీయమైన రసానుభవం.


రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...

Advertisement