Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

జగన్‌ సేవలో ఆ నలుగురు

twitter-iconwatsapp-iconfb-icon
జగన్‌ సేవలో ఆ నలుగురు

‘తరగతి గదిలో నన్ను ఎవరో ఏ పూలచొక్కా మూస్కొని కూర్చోరా అని అవమానించారు. లెక్చరర్‌ వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే’ అని కమెడియన్‌ సునీల్‌ డిమాండ్‌ చేయగా, ‘‘నిన్ను ఎవరో ఏదో అంటే నేను క్షమాపణ చెప్పడం ఏమిటి’’ అని లెక్చరర్‌ పాత్రధారి ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంటాడు. ‘నువ్వు–నేను’ సినిమాలోని ఈ సన్నివేశం మాదిరిగానే ‘ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి’ స్టూడియోలో మూడు రోజుల క్రితం జరిగిన డిబేట్‌ సందర్భంగా చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటనపై ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతాపార్టీ స్పందించిన తీరు ఉంది. చర్చలో పాల్గొన్న బీజేపీ ప్రతినిధి విష్ణువర్ధన్‌‌ రెడ్డిపై అమరావతి జేఏసీ ప్రతినిధి డాక్టర్‌ శ్రీనివాసరావు చెప్పు విసిరినందున ఏబీఎన్‌ యాజమాన్యం, అంటే నేను క్షమాపణ చెప్పాలని, డాక్టర్‌ శ్రీనివాసరావుపై మేమే కేసు పెట్టాలని సోము వీర్రాజు అండ్‌ కో డిమాండ్‌ చేశారు. క్షమాపణ చెప్పేవరకు ఏబీఎన్‌ను, ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తామని కూడా బీజేపీ రాష్ట్ర శాఖ పేరిట విడుదలైన ప్రకటనలో హెచ్చరించారు. పత్రికా ప్రమాణాలు, నైతికవిలువలను గాలికొదిలేసినట్టుగా కూడా ఆ పార్టీ మమ్మల్ని నిందించింది. సదరు ప్రకటన సారాంశాన్ని చూసిన పలువురు ‘నువ్వు–నేను’ చిత్రంలోని సన్నివేశాన్ని నాకు ఫార్వర్డ్‌ చేశారు. చర్చల సందర్భంగా లేదా మరో సందర్భంలోనైనా భౌతికదాడులకు పాల్పడటం తీవ్ర అభ్యంతరకరమే. అలాంటి చర్యలను ఎవరూ సమర్థించరు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న పరిస్థితులలో డాక్టర్‌ శ్రీనివాసరావు చర్యను లక్షలాది మంది నెటిజన్లు సమర్థించడం మాకే ఆశ్చర్యం కలిగించింది. ఏబీఎన్‌ స్టూడియోలో ఇటువంటి దురదృష్టకర సంఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు. అయితే, ప్రపంచవ్యాప్తంగా అనేక సందర్భాలలో, అనేక చానళ్ల చర్చా కార్యక్రమాలలో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. అయినా, విష్ణువర్ధన్‌‌ రెడ్డిపై భౌతిక దాడి జరగడాన్ని తీవ్రంగా పరిగణించిన నేను మరుసటి రోజు విష్ణువర్ధన్‌‌తో పాటు, డాక్టర్‌ శ్రీనివాసరావుతో విడివిడిగా మాట్లాడాను. ఇద్దరికీ సమ్మతమైతే స్వయంగా నేనే స్టూడియోలో కూర్చుని లైవ్‌లోనే వివాదాన్ని పరిష్కరిస్తానని కూడా చెప్పాను. ఏ కారణం వల్లనో గానీ విష్ణువర్ధన్‌‌ రెడ్డి తాను రాలేనని, శ్రీనివాసరావు విచారం వ్యక్తంచేస్తే చాలునని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. దీంతో స్టూడియోలో కూర్చుని జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేయడానికి శ్రీనివాసరావు అంగీకరించారు. అయినప్పటికీ సోము వీర్రాజు అధ్యక్షతన పనిచేస్తున్న ఏపీ బీజేపీ మా సంస్థలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. మంచిదే! శ్రీనివాసరావు చర్యపై అభ్యంతరం ఉంటే కేసు పెట్టవలసింది విష్ణువర్ధన్‌‌ రెడ్డి కాగా, కేసు నమోదు చేయించడం మా బాధ్యత అన్నట్టుగా బీజేపీ తన ప్రకటనలో పేర్కొనడం విడ్డూరంగా ఉంది.


బీజేపీ తీసుకున్న ఈ అధికారిక నిర్ణయాన్ని ఉల్లంఘించి, మాకు నచ్చిన వారిని ఆహ్వానించి, వారిదే పార్టీ వాయిస్‌గా ప్రచారం చేసి, ప్రజలను మోసం చేయాలని చూస్తే ఏబీఎన్‌పై చట్టపరమైన చర్యలతో పాటు ఇతర చర్యలకూ బీజేపీ ఉపక్రమిస్తుందని కూడా ఆ ప్రకటనలో హెచ్చరించారు. మీరు వద్దనుకున్నాక మీ వాళ్లను పిలిచి స్టూడియోలో కూర్చోబెట్టాల్సిన ఖర్మ మాకు పట్టలేదు. అయితే తన నిర్ణయాన్ని పార్టీ నాయకులే గౌరవించరన్న అనుమానం సోము వీర్రాజును పీడిస్తున్నట్టుంది. అందుకే ఇలాంటి హెచ్చరికలు చేశారు. ఆయన అనుమానపడుతున్నట్టుగానే ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారంనాడు నిర్వహించిన విలేకరుల సమావేశానికి మా సంస్థలను ఆహ్వానించారు. తన ఆదేశాలను ఉల్లంఘించినందుకు కన్నాపై వీర్రాజు ఏ చర్యలు తీసుకుంటారో తెలుసుకోవాలని ఉంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని చూసుకుని రాష్ట్రంలో అందరినీ బెదిరించి బతకడానికి రాష్ట్ర బీజేపీలో కొందరు అలవాటు పడిపోయారు. అలాంటి వారిలో సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌‌‌రెడ్డి, జి.వి.ఎల్‌ నరసింహారావు తదితరులు ఉన్నారు. వీరికి ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సునీల్‌ దేవధర్‌ అండగా ఉంటున్నారని చెబుతున్నారు. ఈ నలుగురూ బీజేపీ ముసుగులో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రయోజనాలు కాపాడటానికి పనిచేస్తుంటారని స్థానిక బీజేపీ నాయకులు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు కూడా. అయినా, కేంద్రప్రభుత్వాన్ని చూసి భయపడటానికి నేనేమీ జగన్మోహన్‌ రెడ్డి లేదా చంద్రబాబునాయుడుని కాదు. వీరిరువురూ రాజకీయ నాయకులు కనుక వారి సమస్యలు వారికి ఉంటాయి. నేనేమీ రాజకీయ నాయకుణ్ణి కాను. ఒక సాధారణ జర్నలిస్టును మాత్రమే. వీర్రాజు అండ్‌ కో హెచ్చరికలకు, బహిష్కరణలకు మేం భయపడం. బీజేపీలోని ఆ నలుగురు ఈ విషయం తెలుసుకుంటే మంచిది. విష్ణువర్ధన్‌‌ రెడ్డిపై చెప్పు విసిరిన డాక్టర్‌ శ్రీనివాసరావు గతంలో ఎన్నడూ ఆ విధంగా ప్రవర్తించలేదు. అర్థవంతంగా చర్చలలో పాల్గొంటారని ఆయనకు పేరు ఉంది. అయినా, ఆయన నిగ్రహం కోల్పోయే పరిస్థితి ఎందుకొచ్చిందో విష్ణువర్ధన్‌‌ రెడ్డి కూడా ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. జరిగిన తప్పులో నా కొలీగ్‌ వెంకటకృష్ణ వైఫల్యం కానీ, చానల్‌ లోపం కానీ ఉండి ఉంటే కచ్చితంగా క్షమాపణ చెప్పేవాళ్లం.


ఏ తప్పూ చేయకపోయినా ద్వేషంతో రగిలిపోతున్న వీర్రాజు క్షమాపణ కోరడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. అందుకే ఆయన హెచ్చరికలను మేం పరిగణనలోకి తీసుకోవడం లేదు. అంతేకాదు, ఆంధ్రజ్యోతి గ్రూపు సంస్థలకు అన్యాయంగా దురుద్దేశాలను పదే పదే ఆపాదిస్తున్న ఆ నలుగురి విషయంలో మేం కూడా ఎలా ఉండాలో అలాగే ఉంటాము. నిజానికి వీర్రాజు నన్ను గానీ, నేను ఆయనను గానీ ఎప్పుడూ కలుసుకోలేదు. అయినా, ఆయనకు నా మీద ద్వేషం ఉందంటే కారణం కులద్వేషమే కావచ్చు. అందుకు నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఏబీఎన్‌ స్టూడియోలో జరిగిన దురదృష్టకర సంఘటన తర్వాత నెటిజన్లు వారి వారి పార్టీలకు అనుకూలంగా స్పందించారు. ఏ పార్టీతో సంబంధం లేనివారు బీజేపీపై తమకు ఉన్న ఆగ్రహాన్ని దాచుకోలేదు. ఆ దురదృష్టకరమైన సంఘటన విషయంలో శ్రీనివాసరావును సమర్ధించనందుకు తెలుగుదేశం పార్టీ యూత్‌ వింగ్‌ ‘పసుపు సైన్యం’ పేరిట సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తులు ఒక అడుగు ముందుకెళ్లి ఏబీఎన్‌ చానల్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ విధంగా ఎవరికి వారు నోటి దురద తీర్చుకున్నారు. దీంతో మేము ఎటువంటి తప్పూ చేయలేదని స్పష్టమైంది. నిజంగా మా వైపు నుంచి తప్పు జరిగి ఉంటే ప్రజలకే క్షమాపణ చెప్పి ఉండేవాళ్లం. జరిగిన దానికి డాక్టర్‌ శ్రీనివాసరావుతో విచారం వ్యక్తంచేయించడం ద్వారా మా బాధ్యతను మేం సక్రమంగానే నిర్వర్తించామని నమ్ముతున్నాం. అయినా వివాదాన్ని కొనసాగించాలని బీజేపీలోని ఆ నలుగురూ భావిస్తే వారికి ఆ స్వేచ్ఛ ఉంటుంది. అయితే విలువలు, నైతికత గురించి వారు మాట్లాడకుండా ఉంటే మంచిది. తనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నుతోందని విష్ణువర్ధన్‌‌ రెడ్డి పరోక్షంగా విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. నిజానికి ఆయన ప్రజా నాయకుడు కూడా కాదు. అయినా తెలుగుదేశం పార్టీనో మరొకరో అలాంటి వ్యక్తిపై ఎందుకు కుట్ర చేస్తారు? తమను తాము అతిగా ఊహించుకోవడం అంటే ఇదే! బీజేపీ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ పార్టీకే మంచిది. నిజానికి రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడూ బలంగా లేదు. ఇటీవలి కాలంలో ఆ పార్టీకి ఒక శాతం ఓట్లు కూడా లభించకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోకుండా కేంద్రంలో ప్రభుత్వం ఉంది కదా అని రాష్ట్రంలో విర్రవీగితే వచ్చేదేమీ ఉండదు. వీర్రాజు అండ్‌ కో పార్టీని అధికార వైసీపీకి అనుబంధ సంస్థగా మార్చేశారని బీజేపీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. విష్ణువర్ధన్‌‌ రెడ్డిపై డాక్టర్‌ శ్రీనివాసరావు భౌతికదాడికి పాల్పడటాన్ని పలువురు బీజేపీ నాయకులు అంతర్గతంగా స్వాగతించినట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ ప్రయోజనాలను గాలికి వదిలేసి, ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యంగా వీర్రాజు, విష్ణువర్ధన్‌‌ రెడ్డి, జి.వి.ఎల్‌ నరసింహారావు, సునీల్‌ దేవధర్‌ పని చేస్తున్నారని బీజేపీ నాయకులే అంటున్నారు. చర్యకు ప్రతిచర్య ఉంటుంది అన్నట్టుగా వీర్రాజు అండ్‌ కో నిర్ణయం తర్వాత సోషల్‌ మీడియా వేదికగా వారికి పలువురు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై అమరావతి రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులని నిందిస్తే ప్రజలే బాహాటంగా తిరగబడతారని హెచ్చరికలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలతో బీజేపీ చెలగాటమాడుతోందన్న అభిప్రాయం ఈ సందర్భంగా ప్రబలంగా వినిపించింది. అమరావతి, పోలవరంతో పాటు ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలో ఆ పార్టీ వైఖరిని ప్రజలు తూర్పారబడుతున్నారు. 2014లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి హరిబాబు నెగ్గారు. ఇప్పుడా పరిస్థితి ఉందా? పంచాయతీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ పట్టుమని పది స్థానాలు కూడా గెలుచుకోలేకపోయారు. బీజేపీని నమ్ముకుంటే లాభం లేదని గమనించిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల తెలుగుదేశం పార్టీతో అవగాహన కుదుర్చుకున్న విషయం వాస్తవం కాదా? ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా అధికారం ఉందన్న అహంభావంతో వ్యవహరించినంతకాలం ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలపడే అవకాశమే లేదు. అసలే అంతంత మాత్రంగానే ఉన్న తమ పరిస్థితి ఆ నలుగురి కారణంగా మరింత అధ్వాన్నంగా తయారవుతోందని పలువురు బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జనసేన కూడా సందర్భం కోసం ఎదురుచూస్తోంది. వీలుచూసుకుని బీజేపీకి చెల్లుచీటీ ఇవ్వడానికి జనసేనాని సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌పై పార్టీ నాయకుల నుంచి ఈ మేరకు ఒత్తిడి పెరుగుతోంది. అయినా వచ్చే ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలుకుతూ బతికేయడానికి అలవాటుపడిన వారికి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవడం ఇష్టం ఉండదు.


రిజర్వేషన్లకూ మోదీ ఎసరు!

దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు వంద కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను అమ్మి తీరుతామని ప్రధాని నరేంద్ర మోదీ దాచుకోకుండా చెప్పేశారు. ఈ విషయమై ఆయన చెబుతున్న సిద్ధాంతంలో పస ఉందనే అనుకుందాం. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ పోవడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతినడం అటుంచి ఈ చర్య వల్ల ప్రధానంగా నష్టపోయేది ఎవరో తెలుసా? ఏడు దశాబ్దాలుగా ఈ దేశంలో రిజర్వేషన్‌ ఫలాలు అనుభవిస్తున్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు మోదీ ప్రభుత్వ నిర్ణయం వల్ల రిజర్వేషన్లకు దూరమవుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలోని సంస్థలలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. విశాఖ ఉక్కు వంటి వాటిని ప్రైవేటుపరం చేస్తే రిజర్వేషన్లు పొందుతున్న వారి పరిస్థితి ఏమిటి? ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలంటే పెట్టుబడిదారులు ఇష్టపడరు. ప్రభుత్వాలు కూడా కొన్నేళ్లుగా తమకు అవసరమైన ఉద్యోగులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన తీసుకుంటున్నాయి. ఇప్పుడు ప్రభుత్వరంగ సంస్థలను గంపగుత్తగా అమ్మిపారేస్తే ఈ దేశంలో రిజర్వేషన్ల గురించి మర్చిపోవచ్చు. అంటే రిజర్వేషన్లు ఎత్తివేయకుండానే ఆయా వర్గాలను రిజర్వేషన్లకు దూరం చేస్తున్నారన్న మాట! ఈ పరిణామం దేశంలో ఎటువంటి పర్యవసానాలకు దారితీస్తుందో తెలియదు. అధికారబలంతో ప్రజా ఉద్యమాలనే కాకుండా ప్రతిపక్షాలనూ, ప్రగతిశీల శక్తులనూ నోరెత్తకుండా చేస్తున్న నరేంద్ర మోదీ సర్కార్‌కు ఎక్కడో ఒక దగ్గర చెక్‌ పడకపోతే దేశంలో నియంతృత్వ పోకడలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమం బలహీనపడుతున్నందున తమకు తిరుగే ఉండదని పాలకులలో ధీమా ఏర్పడి ఉండవచ్చు. అందుకే పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను అడ్డగోలుగా పెంచుతూ కూడా తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతున్నామని మోదీ మద్దతుదారులు వాదిస్తున్నారు. పెట్రోల్‌ ధరలు పెరగడానికి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వమే కారణమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిందించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పుడు మాత్రం అంతర్జాతీయ ధరలు పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోందని సమర్థించుకుంటున్నారు.


పెట్రోలియం ఉత్పత్తులపై యూరప్‌ దేశాలలో 65 శాతం వరకు పన్నులు వేస్తుండగా మన దేశంలో 260శాతం వరకు పన్ను విధించడాన్ని ఎలా సమర్థించుకుంటారు? సామాన్యుల ప్రయాణ సాధనమైన రైలు చార్జీలను కూడా అమాంతంగా పెంచడమే కాకుండా ఆ చర్యను సమర్థించుకుంటున్న తీరు వింతగా ఉంది. అనవసర ప్రయాణాలను తగ్గించడానికే చార్జీలను పెంచుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ఉత్తరాదిన రైళ్లలో ప్రయాణించే వారిలో అత్యధికులు టికెట్‌ కూడా కొనరు. ఈ కారణంగా చార్జీలు పెంచినా వారికి ఫరక్‌ పడదు. చట్టాలు, నిబంధనలకు లోబడి నడుచుకోడానికి దక్షిణాది వారు ప్రాధాన్యం ఇస్తారు. ఈ కారణంగా చార్జీల భారాన్ని మోయాల్సి వచ్చేది దక్షిణాది వారే. కేంద్రప్రభుత్వ చర్యలను సమర్థిస్తున్న వారి వాదనలు వింటూ ఉంటే, అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నాయకులు చేసిన ప్రకటనలు గుర్తుకొస్తున్నాయి. తమ విధానాలనే కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని అప్పట్లో వారు చెప్పుకునేవారు. ఇప్పుడు నిజమేనని అనిపిస్తోంది. మద్యపానాన్ని నియంత్రించడానికి నాసిరకం మద్యాన్ని కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నామని జగన్‌ రెడ్డి ప్రభుత్వం పత్రికల్లో ఫుల్‌ పేజీ ప్రకటనలు జారీ చేసి మరీ చెప్పుకొంది. అప్పుడే విద్యుత్‌ చార్జీలు, బస్సు చార్జీలు, పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులను జగన్‌ రెడ్డి ప్రభుత్వం పెంచేసింది. అదేమంటే, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం కదా అని బుకాయించారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం మద్దతుదారులు కూడా ఇదేరకంగా దబాయిస్తున్నారు. పన్నులు, సెస్‌లు పెంచుకుంటూ పోతున్నారు కదా, ఆ డబ్బంతా ఏమవుతోందని ఎవరైనా ప్రశ్నిస్తే దేశరక్షణ కోసం యుద్ధవిమానాలూ, ఇతర ఆయుధాలూ కొనుగోలు చేశారు కదా అని సమాధానం ఇస్తున్నారు. అంటే, ఇప్పటిదాకా దేశాన్ని పాలించిన పార్టీలు, నాయకులు దేశరక్షణ గురించి పట్టించుకోలేదా? దేశంలో ఇక ప్రైవేటురంగానికే పెద్ద పీట అని నరేంద్ర మోదీ ప్రభుత్వం కుండబద్దలు కొడుతోంది. అలాంటప్పుడు కేంద్రం వద్ద ఉన్న నిధులన్నీ గుజరాత్‌లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకే ఎందుకు తరలిస్తున్నారో? కూలి పనులకు వెళ్లకుండా క్రికెట్‌ చూసే పరిస్థితులలో ఈ దేశంలోని పేద ప్రజలు లేరు. అయినా, ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంను గుజరాత్‌లో నిర్మించి, జీవించి ఉండగానే ఆ స్టేడియంకు తన పేరు పెట్టుకున్న నరేంద్ర మోదీ, తన చర్యను ఎలా సమర్థించుకుంటారు? ప్రజల పోరాటాలు, ప్రాణత్యాగాల పునాదుల మీద నిర్మితమైన విశాఖ ఉక్కు వంటి వాటిని విక్రయించే విషయంలో సెంటిమెంటుకు తావు ఉండకూడదని ప్రధాని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు గుజరాత్‌కు బుల్లెట్‌ ట్రైన్‌ ఎందుకు? రైల్వేను కూడా ప్రైవేటీకరించబోతున్న మోదీ ప్రభుత్వం బుల్లెట్‌ ట్రైన్‌ను కూడా అదానీకో, అంబానీకో కట్టబెడితే సరిపోయేది కదా! సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని నాటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడేలా చేసి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ అండ్‌ కో ఇప్పుడు అదే సోషల్‌ మీడియాపై ఆంక్షలు పెట్టడంలోని ఔచిత్యం ఏమిటి? తమను సమర్థించేవారు మాత్రమే దేశ భక్తులు, వ్యతిరేకించే వారంతా దేశద్రోహులు అన్నట్టుగా బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ దేశభక్తి ముసుగులో నియంతృత్వ పోకడలకు తెరలేపుతున్నారు. ఒకప్పుడు దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. తిరుగుబాటు చేశారు. ఇప్పుడు దేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులే ఉన్నాయన్న భావన ఉంది. అయినా ఎవరూ నోరెత్తలేని పరిస్థితి. పర్యావరణ కార్యకర్త దిశా రవి వంటి వారు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని నమ్మినందుకు దేశద్రోహం కేసులను ఎదుర్కోవలసి వస్తున్నది. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు తనను చూసి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ను బెంగాలీలు గుర్తుకుతెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ జుట్టు, గడ్డం పెంచుకున్నారని నెటిజన్లు పెడుతున్న కామెంట్లను తీసిపారేయలేం. అటల్‌ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు దేశాన్ని ఈ మూల నుంచి ఆ మూలకు కలిపే విధంగా జాతీయ రహదారులను అభివృద్ధి చేశారు. అలాంటి ఒక్క ప్రాజెక్టు అయినా నరేంద్ర మోదీ ఏడేళ్ల పాలనలో చేపట్టారా? అంటే చెప్పుకోలేని పరిస్థితి! ప్రతిపక్షం బలహీనంగా ఉన్నందున నరేంద్ర మోదీకి ప్రస్తుతానికి ఎదురుండకపోవచ్చు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓడలు బళ్లూ, బళ్లు ఓడలూ అవుతుంటాయి. కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకులను జాతీయం చేస్తే ప్రస్తుత కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరిస్తోంది. దీంతో బ్యాంకులలో కూడా రిజర్వేషన్లు ఉండవన్న మాట. సమాజంలో అసమానతలను తొలగించకుండా తీసుకునే ఇటువంటి నిర్ణయాల వల్ల తలెత్తే ఉపద్రవాలకు మోదీనే బాధ్యత వహించవలసి ఉంటుంది!

ఆర్కే

జగన్‌ సేవలో ఆ నలుగురు

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.