ఆ నలుగురు

ABN , First Publish Date - 2020-08-14T10:14:09+05:30 IST

ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం.. నడుమ ఈ నాటకం విధిలీల.. వెంట ఏ బంధమూ రక్త సం

ఆ నలుగురు

కరోనా మృతులకు ఆత్మబంధువులు
అనాథ శవాల అంత్యక్రియలకు ముందడుగు
చిన్న ఉద్యోగుల పెద్ద సాయం

ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం.. నడుమ ఈ నాటకం విధిలీల.. వెంట ఏ బంధమూ రక్త సంబంధమూ రాదుగా తుదివేళ.. మరణమనేది కాయమని.. మిగిలిన కీర్తి కాయమని.. నీ బరువు.. నీ పరువు మోసేది ఆ.. నలుగురు..  ఆ నలుగురు.. ఇదీ ఒక సినిమా పాట.. కరోనా వేళ అటువంటి నలుగురే కరువయ్యారు.. ఎందుకంటే కరోనా వైరస్‌ అంటేనే కంగారు పడిపోతున్నారు.


ఎవరైనా వైరస్‌ బారిన పడ్డారంటే దగ్గరకు వెళ్లడానికి కూడా సాహసిం చడం లేదు. కరోనాతో మరణించారంటే కుటుంబ సభ్యులు సైతం భయంతో బెంబే లెత్తిపోతున్నారు. అంత్యక్రియలు చేయడానికి సైతం కుటుంబ సభ్యులు ముందుకురావడం లేదు. కన్న తల్లిదండ్రులు కరోనాతో మరణిస్తే వారెవరో తమకు తెలియదన్నట్టు ఆ మృత దేహాలను మార్చురీల్లోనే వదిలేసి వెళ్లి పోతున్నారు. మరో పక్క మార్చురీలో రోజుల తరబడి ఉండడంతో మృతదేహాలు కుళ్లిపోతు న్నాయి.

బంధువులున్నా చివరికి ఆ నలుగురు లేక  అనాథ శవాలుగా మిగిలిపోతున్నాయి.. అటువంటి శవాలకు మేమున్నామంటూ ఆసుపత్రికి చెందిన ముగ్గురు ఉద్యోగులు, మరో ఫొటోగ్రాఫర్‌ ముందు కొచ్చారు.తమ ప్రాణాలు తెగించి మృతదేహాలకు ఆ నలుగురు అంత్య క్రియలు చేస్తున్నారు. ఎవరో తెలియని వారిని తమవారిగా చేసుకుంటున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా చివరి సమయంలో అత్మబంధువులగా మిగిలిపోతున్నారు.


- ఏలూరు క్రైం
అయ్యో పాపం అనిపించింది  : కృష్ణారెడ్డి, మహా ప్రస్థానం వాహన డ్రైవర్‌
గత మూడు నెలలగా చాలా మృతదేహాలను శ్మశానాలకు తీసుకెళ్లాను. కొన్ని మృతదేహాలను బంధువులు వచ్చి చూసి మళ్లీ వస్తామంటూ వెళ్లిపోయేవారు. మార్చురీలో రోజుల తరబడి ఉండడం వల్ల కుళ్లిపోయేవి. అయ్యో పాపం అనిపించేది. కన్న పిల్లలే తల్లిదండ్రుల మృతదేహాలను వదిలివేసి వెళ్లిపోయేవారు. ఆసుపత్రి అధికారుల ఆదేశాలతో వాటిని తీసుకువెళ్లి శ్మశానాలకు అప్పగించేవాళ్ళం. ఆసుపత్రి అధికారులు దహనం చేసే ఖర్చును ఇచ్చేవారు.

మనం ఏం చేయలేమా అనిపించింది.. అందుకే నా వంతుగా ప్రస్తుతం కరోనా మృతదేహాలను తరలిస్తున్నా..ఇది సేవగానే భావిస్తున్నాం. నాకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి మహాప్రస్థానం వాహనం డ్రైవర్‌గా మూడేళ్లగా పనిచేస్తున్నా.


కొత్తలో భయపడ్డాం : తాడి కృష్ణారెడ్డి, మహా ప్రస్థానం వాహన డ్రైవర్‌
జూన్‌లో మహా ప్రస్థానం వాహన డ్రైవర్‌గా వచ్చా. మొదటి కేసే కరోనా మృతదేహాన్ని తీసుకువెళ్లాలన్నారు. కొంత భయం వేసింది. అయితే వైద్యులు, ఆసుపత్రి అధికారులు సూచనలతో పీపీఈ కిట్లను ధరించి తోటి సిబ్బందితో మృత దేహాలను శ్మశానానికి తీసుకువెళ్ళాను. తాడేపల్లిగూడెంలో నా భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. ప్రస్తుతం నేను ఏలూరులో విడిగా ఉంటూ ఉద్యోగం చేస్తున్నా. 


కళ్లెదుటే కుళ్లిపోవడం బాధేసింది..  కె రమేష్‌ బాబు, ఫొటోగ్రాఫర్‌, ఏలూరు 
వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్‌ని. ఆసుపత్రి మార్చురీలోని మృతదేహాల ఫొటోలు తీస్తూ ఉంటా. ఆ సమయంలో కరోనా మృతదేహాలు కుళ్లిపోవడాన్ని కళ్ళారా చూశా. వాటిని తరలించడానికి మహా ప్రస్థానం డ్రైవర్లు ఇద్దరు, బసవరాజు ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఆ సమయంలో సహాయకారిగా చేయి వేశాను. అంతే ఆ క్షణం నుంచి వారితో కలిసి ఉచితంగా సేవలందిస్తున్నా.
  

నాకెలాంటి భయం లేదు : డి.బసవరాజు, పారిశుధ్య కార్మికుడు 
 కరోనా మృత దేహాల దగ్గరకు వెళ్లడానికి అందరూ భయపడ్డారు. కానీ ఆసుపత్రి అధికారులు, వైద్యుల సూచనలతో పీపీఈ కిట్లు ధరించి మృతదేహాలను తరలించే పనిచేపట్టా. జిల్లాలో కరోనా మృతదేహాలన్నింటిని శ్మశానాలకు తరలించాం.పారిశుధ్య కార్మికుడిగా ఐదేళ్ళ కిందట ఆసుపత్రిలో చేరా.  నాకు ఎలాంటి భయం లేదు.

వీరికి గుర్తింపు ఇచ్చేనా : 
 కరోనా వైరస్‌తో మరణిస్తే రక్త సంబంధీకులు సైతం మృతదేహాలను  తమకు తెలియదన్నట్టుగా వదిలేస్తున్నారు. ఇలాంటి మృతదేహాలకు ఆ నలుగురు మేమున్నామంటూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందిస్తున్నారు. వీరి సేవలకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తే.. వారు చేస్తున్న సేవకు గౌరవం ఇచ్చినట్లు అవుతుంది.

Updated Date - 2020-08-14T10:14:09+05:30 IST