ఆ రోజులు మళ్లీ! మహా జోష్‌

ABN , First Publish Date - 2022-05-29T08:06:12+05:30 IST

ఆ రోజులు మళ్లీ! మహా జోష్‌

ఆ రోజులు మళ్లీ! మహా జోష్‌

ఎన్టీఆర్‌ కాలం నాటి మాదిరిగా కార్యకర్తల్లో మహోత్సాహం

టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్న కసి

రాష్ట్రం నలుమూలల నుంచీ వెల్లువ.. తెలంగాణ నుంచీ భారీగా

సభా వేదికకు ఎంతో దూరానే అడ్డుకున్న పోలీసులు

కార్లు, బైకుల టైర్లలో గాలి తీసేసి ఆటంకాలు 

అయినా వాహనాలు వదిలి.. కిలోమీటర్ల మేర కాలినడక

మహిళలు, యువత జోరు.. సభ దిగ్విజయమంటున్న నేతలు

చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు కితాబు

మహానాడుకు ఉప్పొంగిన జనతరంగం!


(ఒంగోలు-ఆంధ్రజ్యోతి)

మళ్లీ అన్న ఎన్టీఆర్‌ రోజులు గుర్తుకొచ్చాయి.. ఆయన జమానాలో మహానాడు నిర్వహిస్తే ఇసుకేస్తే రాలనంతగా జనం వచ్చేవారు. పార్టీ పండగలో పాల్గొనేందుకు టీడీపీ నేతలు, శ్రేణులే కాదు.. సాధారణ ప్రజలు సైతం ఉత్సాహంతో ఉరకలు వేసేవారు. కిలోమీటర్ల మేర రోడ్లపై ఉరుకులు పరుగులు పెట్టేవారు. ఈసారి ఒంగోలులో జరిగిన మహానాడు ఆ స్థాయిలో జరిగిందని.. తరలివచ్చిన జనసందోహాన్ని చూసి చెప్పక తప్పదు. అంతే కాదు.. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడేళ్లుగా దాడులు, కేసులతో టీడీపీ కార్యకర్తలు ఊపిరాడలేదు. గట్టిగా ఏడాదిన్నర క్రితం వరకు చాలా మంది నేతలు ఇంటి నుంచి బయటకు అడుగే పెట్టలేని పరిస్థితి. ఆర్థికంగా, భౌతికంగా అష్టదిగ్బంధం చేయడంతో విలవిలలాడారు. ఏ కార్యక్రమం చేపట్టినా కరోనా పేరిట అధికార యంత్రాంగం అడ్డుకోవడం, కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారింది. ఆ కష్టాలు, ఇబ్బందుల నుంచి బయటపడాలంటే టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురాక తప్పదని కార్యకర్తలకు అర్థమైంది.  మహానాడు రూపంలో వారి ఆకాంక్ష ప్రస్ఫుటంగా బయటపడింది. శనివారంనాటి బహిరంగ సభకు జనం ఉప్పొంగడం చూశాక.. మూడేళ్లుగా పార్టీ శ్రేణుల్లో నెలకొన్న స్తబ్ధత మటుమాయమెనట్లు తెలిసిపోతోంది. వారిలో కొత్త ఉత్సాహం, కసి ఉరకలేస్తున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి.. తెలంగాణ నుంచి కూడా జనం భారీగా.. అందునా స్వచ్ఛందంగా తరలిరావడం.. ముఖ్యంగా మహిళలు, యువత కదం తొక్కడం పార్టీ అధినేత చంద్రబాబును, నేతలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. లక్షలాదిగా వచ్చిన ప్రజలను చూసి.. ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని ఆనందోత్సాహాలతో చంద్రబాబు కితాబిచ్చారు. 


స్వచ్ఛందంగా..

జగన్‌ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఒంగోలు సమీపంలో టీడీపీ శనివారం నిర్వహించిన మహానాడు బహిరంగసభ దిగ్విజయమైంది. రవాణా ఏర్పాట్లు లేకపోయినా.. బస్సులు, వాహనాలను ఏర్పాటు చేయకపోయినా.. ఆ పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు, సాధారణ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. బహిరంగసభ వేదికకు ఆమడ దూరంలోనే పోలీసు యంత్రాంగం వాహనాలను నిలిపివేసినా.. ట్రాఫిక్‌ అడ్డంకులు ఏర్పడినా.. మండుటెండలోనూ జనం వెనక్కి మళ్లలేదు. వాహనాలను రోడ్లు పక్కనే వదిలేసి.. కిలోమీటర్ల దూరం కాలినడకన, పరుగులు తీస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నా లెక్కచేయకుండా మధ్యాహ్నం 12 గంటలకే వేల సంఖ్యలో వేదిక వద్దకు చేరుకున్నారు. సాయంత్రానికి సంఖ్య లక్షలు దాటింది. సుమారు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన ప్రజలు అక్కడే గుమికూడి నిలబడి జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్‌, కాబోయే సీఎం చంద్రబాబు అంటూ నినదించడం గమనార్హం. చంద్రబాబు ప్రసంగం ముగించే సమయానికి కూడా ప్రజలు బహిరంగసభ వేదిక వద్దకు వస్తూనే ఉన్నారు.


అడ్డంకులను అధిగమించి..

ఒంగోలు మహానాడుకు వచ్చేందుకు టీడీపీ కార్యకర్తలకు వాహనాలు ఇవ్వకుండా జగన్‌ ప్రభుత్వం అడ్డుపడిన సంగతి తెలిసిందే. అయినా భారీగా వచ్చిన వాహనశ్రేణిని అడ్డుకునేందుకు పోలీసులు కార్ల టైర్లలో గాలితీయడం, ద్విచక్ర వాహనదారులపై కేసులు రాయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అయినా జనం వాహనాలు దిగి నినాదాలతో సభావేదిక వద్దకు రావడం నిజంగానే అద్భుత సన్నివేశంలా కనిపించింది. దీంతో పోలీసులు, నిఘావర్గాలు కంగు తిని ఇక అడ్డుకుని లాభం లేదని గ్రహించి చేతులెత్తేశారు. శుక్రవారం నాటి ప్రతినిధుల సభకే కార్యకర్తలు వేలల్లో వెల్లువెత్తగా.. రెండో రోజు బహిరంగ సభకు జనం లక్షల్లో పోటెత్తడంతో తెలుగుదేశం నేతల ఆనందోత్సవాలకు అవధుల్లేవు. మండువారిపాలెం రైతులు 175 ఎకరాలు ఇవ్వగా.. అందులో 60-70 ఎకరాల వరకు పార్కింగ్‌కు కేటాయించారు. 100 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. అయితే వేలాది వాహనాలను దూరంలోనే ఆపేయడంతో చివరకు పార్కింగ్‌ స్థలం కూడా ప్రజలతో కిక్కిరిసిపోయింది. 


యువత, మహిళలదే అగ్రభాగం..

సభకు తరలివచ్చిన లక్షల మందిలో మహిళలు, యువతదే అగ్రభాగం. చంద్రబాబు ప్రసంగానికి యువత కేరింతలు కొడుతూ స్పందించిన తీరు కూడా నాయకులను మంత్రముగ్ధులను చేసింది. తొలుత ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నాయకులందరూ ఆ తర్వాత టీడీపీ రాష్ట్రనాయకుల్లో ముఖ్యులు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, సినీనటుడు బాలకృష్ణ, రెండు రాష్ర్టాల అధ్యక్షులు ప్రసంగించారు. 


ఎక్కడికక్కడ భోజనాలు..

సభ నుంచి వెళ్లే వారికోసం జిల్లాలోని రోడ్లపైనే నాయకులు భోజన వసతి కల్పించారు. మేదరమెట్ల వద్ద అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్‌, మార్టూరు వద్ద పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, కొండపి నియోజకవర్గ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే స్వామి, దామచర్ల సత్య, చీమకుర్తి వద్ద విజయ్‌కుమార్‌, కనిగిరివైపు ఉగ్ర నరసింహారెడ్డి భోజన ఏర్పాట్లు చేశారు.


బాబు కాన్వాయ్‌కు ట్రాఫిక్‌ కష్టాలు..

చంద్రబాబు, ముఖ్యనాయకులు సైతం వేదిక వద్దకు చేరడానికి ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు కాన్వాయ్‌కూ ట్రాఫిక్‌ కష్టాలు ఎదురయ్యాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు, ప్రజలతో కలిసి వచ్చిన ముఖ్యనాయకులు వేదిక వద్దకు వెళ్లలేకపోయారు. సభకు తరలివచ్చిన ప్రజలను పరిశీలిస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా కన్పించారు. ఉత్తరాంద్ర జిల్లాల నుంచి నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అనూహ్యంగా తెలంగాణ నుంచి కూడా గణనీయ సంఖ్యలోనే అభిమానులు తరలివచ్చారు. 


3 లక్షల దాకా..

మధ్యాహ్నం 12 గంటలకు 50 వేల మంది ప్రాంగణంలో కన్పించగా చివరకు ఆ సంఖ్య రెండున్నర లక్షలు దాటిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మరో 50 వేల మంది ప్రాంగణం బయటే ఉన్నారు. మొత్తం పరిస్థితిని గమనించిన రాజకీయ విశ్లేషకులు సభ దిగ్విజయవంతమైందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏరికోరి పంపిన నిఘా వర్గాలు కూడా.. హాజరు 2 లక్షలు దాటిందని, అందులో ప్రకాశం జిల్లావారే లక్ష వరకు ఉన్నారని నివేదించినట్లు సమాచారం. 


పాతరోజులు గుర్తుతెచ్చిన ట్రాక్టర్లు, లారీలు

ప్రభుత్వం బస్సులు ఇవ్వకుండా అడ్డుకోవడంతో ప్రజలు అందుబాటులో ఉన్న ట్రాక్టర్లు, లారీలు, బైకులపై స్వచ్ఛందంగా తరలివచ్చారు. చూసినవారంతా 15 ఏళ్ల క్రితం నాటి వాహన శ్రేణి కన్పించిందని వ్యాఖ్యానించారు. రోడ్లపైనే, పార్కింగ్‌ స్థలాల్లో వేల సంఖ్యలు ట్రాక్టర్లు, లారీలు, బైకులు కనిపించాయి. చంద్రబాబు కూడా తన ప్రసంగంలో ప్రజలు తరలివచ్చిన వాహనాలు చూస్తుంటే పాతరోజులు గుర్తుకొచ్చాయని వ్యాఖ్యానించారు. వీటితో పాటు కార్లు, పెద్దఆటోలు, మినీ బస్సులు ఇతర వాహనాలు కూడా వేల సంఖ్యలో కనిపించాయి. ఒంగోలు చుట్టుపక్కల ఆగిపోయిన వాహనాలు 50 వేలకుపైనే ఉంటాయి.


బాబు ప్రసంగానికి భారీ స్పందన

చంద్రబాబు వేదికపైకి రాగానే సభికులు విశేషంగా స్పందించారు. దాదాపు ఐదు నిమిషాల పాటు జేజేలు, జిందాబాద్‌లు, ఈలలు, కాబోయే సీఎం అంటూ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. ఇలాంటి స్పందన గత మహానాడుల్లో ఎప్పుడూ కనిపించలేదని సీనియర్‌ నాయకులు అన్నారు. మూడేళ్లుగా నిద్రాణంగా ఉన్న కసి, పార్టీని మళ్లీ ఎలాగైనా అధికారంలోకి తేవాలన్న ఉత్సాహం శ్రేణుల్లో కనిపించిందని చెప్పారు.

Updated Date - 2022-05-29T08:06:12+05:30 IST