ఆ ఇద్దరే... నా ఇలవేల్పులు

ABN , First Publish Date - 2022-05-29T07:24:22+05:30 IST

కొవిడ్‌ వల్ల ఎంతో మంది ఆత్మీయులను కోల్పోయాం. నేను ఎంతగానో ప్రేమించే బాలుగారిలాంటి వ్యక్తిని కొవిడ్‌ బలి తీసుకుంది.

ఆ ఇద్దరే...   నా ఇలవేల్పులు

సంగీత ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు శివమణి. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై డ్రమ్మర్స్‌కు ఒక గౌరవం కల్పించిన శివమణిని భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది. మీడియాకు దూరంగా ఉండే శివమణి- టెంపుల్‌ బెల్స్‌, ఎలెవెన్‌ పాయింట్‌ టూ నిర్వహిస్తున్న కాన్సర్ట్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఆ సందర్భంగా శివమణిని ‘నవ్య’ పలకరించింది.


కొవిడ్‌ వల్ల రెండేళ్లుగా అందరికీ దూరంగా ఉన్నారు కదా... కొవిడ్‌ మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది? 

కొవిడ్‌ వల్ల ఎంతో మంది ఆత్మీయులను కోల్పోయాం. నేను ఎంతగానో ప్రేమించే బాలుగారిలాంటి వ్యక్తిని కొవిడ్‌ బలి తీసుకుంది. ఆయన లేకపోవటం నాకు పెద్ద లోటు. ఇక నేను ఎక్కువ సేపు ఇంట్లోనే గడిపా. నా పూర్తి సమయాన్ని నా మూడో కూతురు మిలానాతో గడపగలిగా. నేను ఎక్కువగా టూర్స్‌లో ఉంటా. అందువల్ల ఎక్కువ సమయం ఇంట్లో ఉండను. మొదటి ఇద్దరి పిల్లల విషయంలో అదే జరిగింది. కానీ మిలానా పెరుగుతుంటే చూడటం ఒక గొప్ప అనుభూతి. 


కె.వి.మహదేవన్‌, చక్రవర్తి, రమేష్‌నాయుడు, సత్యం.. ఇలా  చాలా మంది సంగీత దిగ్గజాలతో మీరు పనిచేశారు. వారితో మీ అనుభవాలేమిటి?

మాతా, పిత, గురు, దైవం అంటారు. మా అమ్మ అశ్వినీ, నాన్న ఆనంద్‌ ఆశీర్వచనాలే నన్ను ఇంతవాడిని చేశాయి. నా ఈ సంగీత ప్రయాణంలో బాలుగారు, సుశీలమ్మ, జానకమ్మ, జేసుదాస్‌ సార్‌.. ఇలాంటి దిగ్గజాలతో కలిసి పనిచేశా. మహదేవన్‌, చక్రవర్తి, రమే్‌షనాయుడు, సత్యం, ఇళయరాజా, రెహమాన్‌, తమన్‌.. ఇలా అనేక మంది సంగీత దర్శకులు నన్ను ప్రోత్సహించారు. అడవి రాముడు, ప్రేమాభిషేకం, రోజా, దూకుడు.. చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు. అన్నీ నాకు తృప్తినిచ్చినవే!


బాలుగారు మిమల్ని ఎలా ప్రభావితం చేశారు?

బాలు గారు నా గాడ్‌ఫాదర్‌. ‘శివమణిని కచేరీలకి తీసుకెళతాను’ అని బాలుగారు మా నాన్నను అడిగారు. మద్రాసులో షోలు చేసేటప్పుడు తెలుగు ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఇలా 35 ఏళ్లపాటు వారితో కలసి పనిచేశాను. ఆయనకు గురుసేవ చేశాను. బాలుగారికి కాళ్లు పట్టేవాడిని.  రైలు ప్రయాణాల్లో ఆయన పెట్టే ఆవకాయ అన్నం తినడానికి ఎదురుచూసేవాణ్ణి. ఇలా మరచిపోలేని అనుభవాలెన్నో! ఆయన చివరిపాట రికార్డింగ్‌లో కూడా నేను ఆయనతోనే ఉన్నాను.  బాలుగారు  ఒక యూనివర్సిటీ. ఆయన దగ్గర నేర్చుకోదగ్గ విషయాలెన్నో ఉన్నాయి. నేను ఆ యూనివర్సిటీ నుంచి వచ్చానని గర్వంగా చెప్పగలను. ‘పడమటి సంధ్యారాగం’ సినిమాలో నటించటం మరచిపోలేని అనుభవం. జంధ్యాల గారికి నా గురించి చెప్పింది ఆయనే! 


మామ మహదేవన్‌ గారితో  మీ అనుభవాలేమిటి.. 

కె.వి.మహదేవన్‌, బాలుగారు.. ఇద్దరూ నా ఇంటి ఇలవేల్పులు. వాళ్లిద్దరే పరిశ్రమకు నన్ను పరిచయం చేసింది. నా కెరీర్‌కు బలమైన పునాది వేశారు. వారి ఆశీస్సులే నన్ను ఇంతవాణ్ణి చేశాయి. మా నాన్న ఆనంద్‌ మహదేవన్‌గారి వద్ద డ్రమ్మర్‌గా పనిచేసేవారు. ఒక రోజు ఆయన రికార్డింగ్‌కు వెళ్లటానికి కుదరలేదు. అప్పటికే నేను డ్రమ్స్‌ వాయించేవాడిని. నాన్న బదులుగా నన్ను రికార్డింగ్‌కి పిలిచారు. అదే నా తొలి రికార్డింగ్‌.  


మంచి ఆదరణే!

ప్రస్తుతం డ్రమ్మర్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. రంజిత్‌.. నాగేశ్వరరావు.. ఇలా అనేక మంది మంచి డ్రమర్స్‌ ఉన్నారు. ప్రతి వాయిద్య పరికరానికి ఒక గొప్పదనం ఉంటుంది. దానిని గమనించి.. గౌరవిస్తే చాలు. నా ఉద్దేశంలో ప్రతి వ్యక్తికి జన్మతః సంగీత జ్ఞానం ఉంటుంది. కొందరు పాడగలుగుతారు. కొందరు వాయించగలుగుతారు. చిన్నప్పుడే ఈ ప్రతిభను గుర్తిస్తే అందరూ మంచి సంగీతకారులు అవుతారు. 


ఇల్లే రికార్డింగ్‌ థియేటర్‌

ఒకప్పుడు రికార్డింగ్‌ థియేటర్లు ఉండేవి. వందల మంది వాయిద్యకారులు కలిసి సాధన చేసేవారు. రికార్డింగ్‌ చేసేవారు. ఇప్పుడు ఇళ్లే రికార్డింగ్‌ థియేటర్లుగా మారిపోయాయి. మేమందరం ఇంట్లోనే రికార్డింగ్‌ చేసి పంపుతున్నాం. దీని వల్ల అందరితో కలిసి పనిచేసే అవకాశం పోతోంది. 


విభన్నశైలి..

శంకర్‌ మహదేవన్‌ ఒక అపురూపమైన గాయకుడు. ప్రతి పాటా విభిన్నంగా ఉంటుంది. ప్రేక్షకుల నాడిని పసిగట్టడంలో తనను మించిన వారు ఎవరూ లేరు. అందుకే ఆయన కచేరీలకు అంత ఆదరణ లభిస్తుంది. 


రంగుల క్యాప్‌లు..

మా నాన్నగారు కాలం చేశాక గుండు చేయించుకున్నా. ఆ సమయంలో నాకు రెహమాన్‌ ఒక కలర్‌ఫుల్‌ క్యాప్‌ను బహుమతిగా ఇచ్చాడు. అది పెట్టుకుంటే చాలా బావుంది. ఆ తర్వాత అమెరికాకు వెళ్లినప్పుడు నా ఫ్రెండ్‌ ప్రభాకర్‌ మరి కొన్ని క్యాప్స్‌ కొని ఇచ్చాడు. అప్పటి నుంచి రకరకాల క్యాప్‌లు ధరించటం మొదలుపెట్టా. నా దగ్గర చాలా పెద్ద కలెక్షనే ఉంది.


ఇళయరాజా దయే!

నాకు రాజా అన్నయ్య చిన్నప్పటి నుంచి తెలుసు. రజనీకాంత్‌ సినిమా ఒకదానికి రికార్డింగ్‌ జరుగుతున్నప్పుడు నా టైమింగ్‌ తనకు చాలా నచ్చింది. చాలా సినిమాల్లో అవకాశాలు ఇచ్చాడు. ఒక రోజు- ‘నువ్వు కొడంబాకానికే పరిమిత మయిపోకు.. ముంబయి వెళ్లు’’ అని సలహా ఇచ్చారు. ఆయన సలహా మేరకే నేను ముంబయి వెళ్లా. అక్కడ లూయిస్‌బ్యాంక్స్‌తో కలిపి బ్యాండ్‌ను ప్రారంభించా. ఈ రోజు శివమణిని ప్రపంచం గుర్తించిందంటే దానికి కారణం రాజా అన్నయ్యే! ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అంతే కాదు. నాకు ఆధ్యాత్మికతను పరిచయం చేసింది కూడా రాజా అన్నయ్యే. ఇప్పటికీ చెన్నై వెళ్లిన ప్రతి సారీ అన్నయ్యను కలుస్తా. 


 రెహమాన్‌ వీక్‌నెస్‌ అదే!

ప్రతి వ్యక్తికి ఒక వీక్‌నెస్‌ ఉంటుంది. కొందరికి అదే బలమవుతుంది కూడా! రహమాన్‌కు సంగీతం ఒక వీక్‌నెస్‌. తను పుట్టుకతోనే జీనియస్‌. చిన్నప్పటి నుంచి తను నాకు తెలుసు. మంచి మిత్రుడు కూడా! ప్రస్తుతం తను న్యూయార్క్‌, లండన్‌లలో ఎక్కువగా ఉంటున్నాడు. నేను అక్కడికి వెళ్లినప్పుడు కలుస్తా. ఇద్దరం కలిసి మ్యూజిక్‌ షాప్‌లకు వెళ్తాం. ఎంత బిజీగా ఉన్నా ఫోన్‌లో తరచూ మాట్లాడుకుంటూనే ఉంటాం. తను ఏదైనా కొత్తది క్రియేట్‌ చేస్తే నాకు వెంటనే వినిపిస్తాడు. నాకు ఏదైనా ఎక్సైటింగ్‌ అనిపిస్తే వెంటనే తనకు చెబుతా!


తమన్‌ టాలెంటే వేరు!

తమన్‌ వాళ్ల నాన్నగారు డ్రమ్మర్‌. నేను.. ఆయన కలిసి వాయించేవాళ్లం. ఏడేళ్ల వయస్సుకే తమన్‌ డ్రమ్స్‌ అద్భుతంగా వాయించేవాడు. 16 ఏళ్ల వయస్సుకే బాలు గారి ట్రూప్‌లో అమెరికాకు వెళ్లి కచేరీలు చేసేవాడు. తను డ్రమ్మరే కాదు.. మంచి ప్రోగ్రామర్‌ కూడా. మణిశర్మగారి దగ్గర ప్రోగ్రామర్‌గా పనిచేసేవాడు. చాలా మంది సౌండ్‌ను రికార్డు చేస్తారు. తను సౌండ్‌ను క్రియేట్‌ చేస్తాడు. దూకుడు.. అల వైకుంఠపురం.. సర్కారువారి పాట.. ఇలా అనేక చిత్రాలకు తనతో కలిసి పనిచేశా. 


మీరు అనేక మంది సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు కదా.. వీరిలో ఎవరితో పనిచేయటం కష్టం?

ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఒక్కొక్కరితో పనిచేయడం ఒక్కో అనుభవం. సత్యంగారు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఆయనకు కావాల్సింది స్పష్టంగా చెబుతారు. రమే్‌షనాయుడు గారికి స్పష్టత ఉంటుంది. కానీ తనకు కావాల్సిన రిథమ్‌ గురించి ఎలా చెప్పాలో తెలియదు. అందుకని ఆయనకు వాయించి చూపించేవాడిని. గట్టిగా వాయిస్తే చాలా ఆనంద పడేవారు. ‘ఇలాంటి ఎనర్జీనే నాకు కావాలి’ అనేవారు. 


ప్రస్తుత నేపథ్య సంగీతంలో వచ్చిన మార్పులేమిటి?

అవే సరిగమపదనిసలు. గడియారంలో ముల్లు మాదిరిగా తిరుగుతూ ఉంటాయి. శబ్ద వేగంలో.. రచనలో మాత్రమే మార్పు వస్తుంది. 


ఇప్పటి పాట ల్లో పక్కవాద్యాల ఘోష.. ప్రోగ్రామింగ్‌ ఎక్కువ అనే విమర్శ ఉంది కదా?

సినిమాకు ఎలాంటి సంగీతం కావాలనే విషయాన్ని నిర్మాత, దర్శకుడు నిర్ణయిస్తారు. ఇప్పుడు ప్రోగ్రామింగ్‌ అనేది సర్వసాధారణమయింది. కొందరు నిర్మాతలు కొత్తదనం కావాలంటారు. రిఫరెన్స్‌ను ఇస్తారు. వాటి వల్ల కూడా నేపేథ్య సంగీతం మారిపోతుంది. ఇమేమి లేకుండా కూడా మంచి సంగీతం అందించవచ్చు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం కీరవాణి ఎంత వినసొంపైన సంగీతం అందించారో గమనించండి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. సంగీతం ఎప్పుడూ సరైన దిశలోనే వెళుతోంది. కొత్త శైలి కోసం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాలమే అన్ని రంగాల్లోను మార్పులను తీసుకువస్తుంది.     

            - సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2022-05-29T07:24:22+05:30 IST