ప్రపంచ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజున్న మార్వెల్ సూపర్ హీరో కేరక్టర్స్లో ‘థోర్’ (Thor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ మూడు చిత్రాలొచ్చాయి. అవన్నీ ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపేశాయి. అయితే అభిమానులు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న సిరీస్‌లో నాలుగో చిత్రానికిప్పుడు సమయం ఆసన్నమైంది. ‘థోర్ : లవ్ అండ్ థండర్’ (Thor : Love and Thunder) పేరుతో నాలుగో చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది జూలై 8న విడుదల కాబోతోంది. ఇందులో కూడా థోర్‌గా క్రిస్ హేమ్స్ వర్త్ (Chris Hemsworth) అలరించబోతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ అవగా.. వాటికి విపరీతమైన స్పందన లభించింది. ఇక లేటెస్ట్ గా మార్వెల్ స్టూడియోస్ ‘థోర్ : లవ్ అండ్ థండర్’ ట్రైలర్ విడుదల చేసింది. కళ్ళుచెదిరే గ్రాఫిక్స్ మాయాజాలంతో ఈ ట్రైలర్‌లోని విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘పిల్లకాయలూ.. ఇప్పుడు మీరు పాప్ కార్న్ తింటూ కూర్చోండి. మీకిప్పుడు అంతరిక్ష యోధుడు థోర్ ఓడిన్సన్ కథ చెబుతాను’ అనే వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇందులో థోర్ (Thor)కి తోడుగా అతడి మాజీ ప్రేయసి జేన్ పోస్టర్ (నటాలీ పోర్ట్మేన్)(Nataly portman) లేడీ థోర్‌గా అలరించింది. థోర్ గాడ్ ఆఫ్ థండర్ (God of Thunder) కవచాన్ని వదిలేసి మళ్ళీ ఎప్పటిలా తనను తాను మార్చుకొనేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే గోర్ ది గాడ్ బుచ్చేర్ (Gor the god butcher) గెలాక్సీ కిల్లర్ దేవుళ్లను అంతం చేయాలని అనుకోవడంతో థోర్కు మళ్ళీ ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఆద్యంతం ఆకట్టుకున్న ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఈ సినిమాకి ఆస్కార్ విజేత తైకా వైటీటీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని మనదేశంలో ఇంగ్లీష్, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.