నమ్మండి.. ఇవి తుఫాను షెల్టర్లే..!

ABN , First Publish Date - 2022-05-15T06:06:11+05:30 IST

నమ్మండి.. ఇవి తుఫాను షెల్టర్లే..!

నమ్మండి.. ఇవి తుఫాను షెల్టర్లే..!
బర్రంకులలో తుఫాను షెల్టరును తొలగించిన ప్రాంతం

పడగొట్టిన షెల్టర్లు అక్కడే ఉన్నాయట..!

పదేపదే అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు కవరింగ్‌


‘బర్రంకుల తుఫాను షెల్టర్‌ అక్కడే ఉంది. దిండిలోని తుఫాను షెల్టరూ అక్కడే ఉంది. ఆ విషయం అక్కడి ఇంజనీర్లకు ఫోన్‌ చేస్తే చెప్పారు. కానీ, వాటిని కూల్చి పాత ఇనుమును ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌ అమ్ముకుంటున్నారని ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చింది. సీఎం జగన్మోహనరెడ్డిని ఏమీ అనలేకే వైసీపీ ఎమ్మెల్యేలందరినీ భ్రష్టు పట్టించేందుకే ఇలాంటి కథనాలు ప్రచురిస్తున్నారు. ’ 

- మత్స్యకార భరోసా సభలో ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌


అవనిగడ్డ టౌన్‌ : నాగాయలంక మండల పరిధిలోని బర్రంకుల, దిండి గ్రామాల్లో 1977 అనంతరం ప్రభుత్వం తుఫాను షెల్టర్లు ఏర్పాటుచేసింది. సంవత్సరం క్రితం వీటిని పడగొట్టి ఇనుము, కాంక్రీట్‌ తుక్కును కాంట్రాక్టర్‌ అమ్ముకోబోగా, బాగున్న షెల్టర్లను పడగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నంపై ‘ఆంధ్రజ్యోతి’ అప్పట్లోనే కథనాన్ని రాసింది. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అవనిగడ్డలో పత్రికా సమావేశం ఏర్పాటుచేసి పాత ఇనుమును అక్రమంగా అమ్ముకునేందుకు కూల్చివేత ప్రక్రియ జరుగుతోందని విమర్శించారు. దీంతో పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్‌ అనంతరం ప్రభుత్వ ఆదేశాలతో ఆ రెండు షెల్టర్లను పడగొట్టాడు. డిస్మాండిల్‌ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని మాత్రమే గుర్తుంచుకున్న ఎమ్మెల్యే వాటిని పడగొట్టిన విషయం తెలియకో ఏమో పదేపదే తుఫాను షెల్టర్ల విషయాన్ని నియోజకవర్గ, మండలస్థాయి సమావేశాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ అసత్య కథనాలు రాస్తోందని, తుఫాను షెల్టర్లు అలాగే ఉన్నాయని చెబుతూ వస్తున్నారు. శుక్రవారం జరిగిన వైఎస్సార్‌ మత్స్యకార భరోసా చెక్కు ఆవిష్కరణలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో ‘ఆంధ్రజ్యోతి’ శనివారం బర్రంకుల, దిండిలోని తుఫాను షెల్టర్ల ప్రాంతాన్ని పరిశీలించింది. సంవత్సరం క్రితమే పడగొట్టి ఇనుమును, కాంక్రీట్‌ తుక్కును తరలించారని, మరో భవనం కడతామని అప్పట్లో తమకు చెప్పారని, మొక్కలు మొలిచి చెట్లయ్యాయి గానీ, ఇంతవరకు అధికారులెవరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదని స్థానికులు తెలిపారు. 



Updated Date - 2022-05-15T06:06:11+05:30 IST