Abn logo
Mar 2 2021 @ 23:34PM

దొంగలు హల్‌చల్‌

ఒంగోలుతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలు 

పట్టపగలే దొంగ తనాలు 

 గ్రూపులుగా విడిపోయిన సీసీఎస్‌ సిబ్బంది 

నిఘా అంతంతమాత్రమే  

పోలీసుల మధ్య వర్గ విబేధాలు.. ఆధిపత్యపోరుతోపాటు సమన్వయం లేకపోతే దొంగలు ఒంటి కాలి మీద తెగబడతారు.!!! ఒంగోలు నగరంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగలు చెలరేగిపోతున్నారు. కేవలం గత నెలక్కొటి గమనిస్తే దొంగలు పట్టని పగ్గాలు లేకుండా చెలరేగిపోయారనే విషయం ఇట్టే అర్థమవుతోంది. నడి వీధుల్లో వేలాది మంది ప్రజలు సంచరిస్తున్నా మిట్టమధ్యాహ్నం నిర్భయంగా ఇళ్లలో చొరబడి దోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. ఇదిలా ఉంటే, గస్తీ తిరగాల్సిన రక్షక్‌ వాహనాలు మూలనపడడం, బ్లూకోట్స్‌ సిబ్బంది గస్తీ కొరవడడంతో దొంగలు రెచ్చిపోతున్నారు.

ఒంగోలు(క్రైం), మార్చి 2 : జిల్లాలో దొంగల బెడద అధికమైంది. పట్టపగలే స్వైర విహారం చేస్తున్నారు. వరుస చోరీలను పరశీలిస్తే కనీసం పగలు కూడా పోలీసుల గస్తీ కరువైందని చెప్పవచ్చు. దొంగతనాలు అదుపుచేయడం, దొంగలను పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ సిబ్బంది గ్రూపులుగా ఏర్పడి దొంగతనం కేసుల దర్యాప్తు నత్తనడక నడిచే విధంగా చేస్తున్నారు. అంతే కాకుండా  ఒంగోలు నగరంలో గస్తీ తిరగాల్సిన రక్షక్‌ వాహనాలు సైతం మూలనపడటం వాటిని పట్టించుకునే వారు లేక పోవడంతో పదిరోజులలో ఒంగోలు వన్‌టౌన్‌ పరిధిలో వరుసుగా మూడు దొంగతనాలు పట్టపగలు జరగడం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది. రక్షక్‌, బ్లూకోట్సు సిబ్బంది గస్తీ కొరవడింది. అదే క్రమంలో సీసీఎస్‌ పోలీసులు అవగాహన లేకుండా ఉన్నారు. ముఖ్యమైన ప్రాంతాలలో సైతం సిబ్బంది గస్తీ తిరుగుతున్న దాఖలాలు లేవు. ఒక నేరస్థుడిని పట్టుకునే విషయంలో సీసీఎ్‌సలో ఉన్న గ్రూపుల కారణంగా దొంగ దొరకకుండా పరారీ అయ్యాడు. 

ఓ దొంగ పారిపోయిందిలా...

నగరంలోని ఇందిరమ్మ కాలనీలోని ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటూ ఓ దొంగ చోరీలకు పాల్పడుతున్నట్లు సీసీఎస్‌ పోలీసులు కొందరు గుర్తించారు. అదే వ్యక్తి కోసం ఇంకొంతమంది సీసీఎస్‌ పోలీసులు అతని సొంతూరు వెళ్లి కుటుంబ సభ్యులను వాకబు చేశారు. తన కోసం పోలీసులు తిరుగుతున్నారని సమాచారం తెలుసుకొని దొంగ పరారీ అయ్యాడు. సీసీఎస్‌ పోలీసుల మధ్య సమన్వయం లేకపోవడం వలనే దొంగ పరారీ అవ్వడానికి కారణంగా చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినట్లు సమాచారం. అందుకు వారి మధ్య గ్రూపులు ఉన్నాయని అనేందుకు ఈ సంఘటన తార్కణంగా చెప్పవచ్చు. ఇదే క్రమంలో ఒంగోలు వన్‌టౌన్‌ సంబంధించిన రక్షక్‌ వాహనం మర్మమతులకు గురై నాలుగు రోజులు అవుతున్నా కనీసం పట్టించుకోలేదు.

పది రోజులలో వరుస దొంగతనాలు

గత నెల 20న లాయర్‌పేట ఎక్ష్‌టెన్షన్‌లో నివాసం ఉండే పట్నం సుధాకర్‌ తన కుటుంబ సభ్యులతో గుడూరు వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో దొంగలు ఇంటి తలుపు పగలకొట్టి లోపలకు చొరబడి ఏడు సవర్ల బంగారం, రూ.35 వేలు నగదు అపహరించుకెళ్లారు.

27న పట్టపగలు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద శ్మశాన వాటిక సమీపంలో 60 ఏళ్ల వృద్ధురాలిని బురిడీకొట్టి మూడు సవర్ల బంగారం గొలుసు అపహరించుకెళ్లారు.

28న పట్టపగలు మిట్టమధ్యాహ్నం నగరం నడిబొడ్డులో ఉ న్న బండ్లమిట్టలో చక్కా మల్లికార్జునరావు ఇంట్లో సుమారు 30 సవర్ల బంగారు ఆభరణాలు, కిలో వెండితోపాటు సుమారు నా లుగున్నర లక్షల రూపాయల విలువ చేసే వస్తువులను మూ టగట్టుకుని  దర్జాగా మోటర్‌సైకిల్‌పై వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షుల సమాచారం. వరస మూడు ఘటనలు పట్టపగలే చోటుచేసుకోవడం గమనార్హం.

దొంగలను పట్టుకునేందుకు చర్యలు తీసుకున్నాం

ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌

నగరంలో ఇటీవల వరుస దొంగతనాలు జరిగాయి.  సిబ్బంది ఎన్నికల బందోబస్తులో నిమగ్నమయ్యారు. ఇటీవల జరిగిన బండ్లమిట్ట దొంగతనం కేసులో సీసీ ఫుటేజి పరిశీలిస్తున్నాం. అంతే కాకుండా ఈ తరహా నేరస్థులు ఎవరు, అలాంటి వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అనే విషయాలను సేకరిస్తున్నాం. 


కందుకూరులో పట్టపగలే మరో దొంగతనం

కందుకూరు, మార్చి 2: పట్టణంలో పట్టపగలే మరో దొంగతనం జరిగింది.దొంగలు 10 సవర్ల బంగారం, 10వేల నగదు అపహరించుకుపోయారు. పోలీసుల వివరాల ప్రకారం కనిగిరి రోడ్డులో మార్కెట్‌ యార్డు సమీపంలోని శ్రీనివాసనగర్‌లో శ్రీకంఠం నాగరాజు కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగులగొట్టారు. అందులోని బంగారం, నగదు అపహరించుకుపోయారు. సాయంత్రం ఇంటికొచ్చి చూసుకున్న నాగరాజు కుటుంబీకులు దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి లబోదిబోమన్నారు. ఇటీవలే పట్టణ ంలోని సాయినగర్‌లో నాలుగు ఇళ్లలో దొంగలుపడి అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఇలాగే ఇంట్లో ఎవరూ లేని ఇళ్లను గుర్తించి ఈ దొంగతనాలకు తెగబడ్డారు. దొంగతనం జరిగిన ఇంటిని కందుకూరు డియ్‌సపి కండే శ్రీనివాసరావు, సీఐ విజయకుమార్‌, పట్టణ  ఎస్సై కేకే తిరుపతిరావులు సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చోరీ జరిగిన ఇంట్లో పరిశీలన చేస్తున్న సీఐ విజయకుమార్‌


Advertisement
Advertisement
Advertisement