Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 16 Aug 2022 00:19:21 IST

ఈ ఏడాది గుర్తుండిపోతుంది

twitter-iconwatsapp-iconfb-icon

‘‘కథ వినేటప్పుడు జయాపజయాల గురించి నేను ఆలోచించను. నాకు నచ్చితే చాలు. ‘కార్తికేయ 2’ ఐదేళ్ల పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ నచ్చుతుంది. కచ్చితంగా మంచి సినిమా అవుతుందనుకున్నాను’’ అని అనుపమా పరమేశ్వరన్‌ అన్నారు. నిఖిల్‌ సరసన ఆమె కథానాయికగా నటించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా అనుపమ సినిమా విశేషాలు, కెరీర్‌ గురించి మాట్లాడారు. 


ముగ్ధ పాత్ర కోసం ఎలా సన్నద్ధమయ్యారు? 

ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలకు ముగ్ధ భిన్నంగా ఉంటుంది. ఆమె ఆలోచనా ధోరణి, వస్త్రధారణ రెండూ కూడా నా నిజజీవితాన్ని ప్రతిఫలిస్తాయి. ‘బయట ఎలా ఉంటావో సినిమాలోనూ అలానే సహజంగా నటించు’ అని నిఖిల్‌ చెప్పారు. ‘టామ్‌బాయ్‌లా అనిపించారు, ఆ పాత్రకు బాగా సూటయ్యారు’ అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. 


కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశం?

నేను 2020లో కథ విన్నాను. అప్పటికే డిఫరెంట్‌ పాత్రలు, ప్రయోగాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాను. కొత్త తరహా పాత్రల కోసం చూస్తున్నా. ఆ టైమ్‌లో చందు ఈ కథ చెప్పారు. చిన్నప్పటి నుంచి నాకు ఆధ్యాత్మికతకు సంబంధించిన పలు సందేహాలు కథ వింటున్నప్పుడు నివృత్తి అయ్యాయి. వెంటనే సినిమా అంగీకరించాను. 


నటనలో హీరోను డామినేట్‌ చేశారనే ప్రశంసను ఎలా స్వీకరిస్తారు?

అలాంటిదేం లేదు. నా పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఆ క్రెడిట్‌ నిఖిల్‌, చందు, కాలభైరవకు దక్కుతుంది. వాళ్ల సహకారం వల్లే నా పాత్ర ఎలివేట్‌ అయ్యింది.


‘కార్తికేయ 3’లో మీ పాత్ర ఉంటుందా?

ఏమో తెలియదు. అది నా పరిధిలోని విషయం కాదు. దాని గురించి నేను ఎవరినీ అడగను. ఏదైనా కథ డిమాండ్‌ మేరకే ఉంటుంది. 


నటిగా మీ పూర్తి సామర్థ్యాన్ని వెలికితెచ్చే పాత్ర  దక్కిందనుకుంటున్నారా? 

లేదు. ఈ ఏడాది అది నెరవేరవచ్చు. కచ్చితంగా ఈ ఏడాది కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రలు పడతాయి. 


ఈ సినిమా మేకింగ్‌లో సవాల్‌గా అనిపించిన సందర్భాలు ఉన్నాయా?

కచ్‌లో 55 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్‌ చేసి మరుసటి రోజు మనాలీ వెళ్లిపోయాం. అక్కడ మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌. చలికి కొయ్యబారిపోయాం. చాలా భయానక పరిస్థితుల్లో పనిచేశాం. యూనిట్‌ అంతా చాలా కష్టపడింది. వరుసగా ఒక్కో ప్రాంతంలో షూటింగ్‌ చేసుకుంటూ వెళ్లేవాళ్లం. ఫస్ట్‌ షెడ్యూల్‌లో 22 రోజులు షూటింగ్‌ చేస్తే 10 హోటళ్లు మారాం. మానిటర్‌లో చూసుకున్నప్పుడు ఆ కష్టం తేలిపోయేది. మనాలీ, ద్వారకా, కచ్‌లాంటి ప్రదేశాలు తిరగడం, ఛేజింగ్‌ సీక్వెన్స్‌లు బాగా ఎంజాయ్‌ చేశాను. నేను ఈ ప్రాజెక్ట్‌లోకి రావడానికి రెండేళ్ల ముందునుంచే పనులు ప్రారంభమయ్యాయంటేనే ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. 


పాములతో నటించడం భయంగా అనిపించలేదా?

అవన్నీ గ్రాఫిక్స్‌ పాములు, రబ్బరు పాములే. కానీ పాములు చాలా అందంగా ఉంటాయి. అవి అంటే నాకు చాలా ఇష్టం. 


ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

‘బట్టర్‌ఫ్లై’ ఓటీటీలో రిలీజవుతుంది. ‘18 పేజీస్‌’ షూటింగ్‌ కొంచెం పెండింగ్‌ ఉంది. అదొక డిఫరెంట్‌ లవ్‌స్టోరీ. మరో రెండు తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ‘డీజే టిల్లు 2’ గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. 

కథల ఎంపిక ఎలా చేస్తారు?

నా దృష్టిలో మంచి కథకు మించింది లేదు. హీరో, దర్శకుడు ఇవన్నీ కథ తర్వాతే. ఒకే తరహా పాత్రలు చేయాలనుకోను. కంఫర్ట్‌ జోన్‌లో పని చేయడం నాకు బోర్‌గా ఉంటుంది. 


మహిళా సాధికారతపై మీ అభిప్రాయం?

అసలు అలాంటిదేమి లేదు అనుకుంటాను. మహిళలు ఎప్పుడో సాధికారత సాధించారు. ఎక్కడో మన ఆలోచనల్లోనే తేడా ఉంది. పదేపదే అలా చెప్పి మన మైండ్‌ను ట్యూన్‌ చేశారు. గతంలో పురుషుడు బయటకు వెళ్లి కాయకష్టం చేస్తే, స్త్రీ ఇంటిని చక్కబెట్టుకునేది. ఇప్పుడు దానికి అదనంగా ఉద్యోగం కూడా చేస్తున్నారు. ‘టీ పెట్టు’ అని చెప్పినంత మాత్రాన మగవాళ్లకు సాధికారత ఉందని, ఆడవాళ్లకు లేదని కాదు. మహిళలకు ఎప్పుడూ సాధికారత ఉంది. మన రాష్ట్రపతి కూడా మహిళే.


అనుపమ సినిమాలకు దక్షిణాది మొత్తంలో మార్కెట్‌ ఉంటుందని  నిర్మాతలు అనడం ఎలా అనిపిస్తుంది? 

చాలా సంతోషంగా ఉంది. వీలయినన్ని భాషల్లో నటించాలనే నా కోరిక. 


బాలీవుడ్‌ చిత్రాలు చేయాలనుకోవడం లేదా?

కొన్ని అవకాశాలు వ చ్చాయి. కానీ డేట్లు సర్దుబాటు కాలేదు. 


సినిమా ఇండస్ట్రీలో స్త్రీ, పురుష సమానత్వం ఉందా?

ఎందుకుండాలి? సినిమా అనేది ఒక పెద్ద మార్కెట్‌. కార్పొరేట్‌ ఆఫీసులో మగవాళ్లతో సమానంగా కష్టపడతారు. సమానంగా జీతం అందుకుంటారు. కానీ సినిమా అమ్ముడవాలంటే దానికి ఒక బ్రాండింగ్‌ కావాలి. ఇక్కడ సమానత్వం గురించి ఫిర్యాదు చేయడం కుదరదు. నయనతార సూపర్‌స్టార్‌. ఆమె తన స్థాయికి తగినట్టు పారితోషికం అందుకుంటారు. నా స్థాయికి తగ్గ ప్రతిఫలం నాకు ముడుతుంది. అయినా పరిస్థితిలో ఇప్పుడిప్పుడు కొంచెం మార్పు వస్తోంది. 


సడన్‌గా రూట్‌మార్చి గ్లామర్‌ డోస్‌ పెంచారనే కామెంట్‌ వినిపిస్తోంది?  

గ్లామర్‌ అంటే ఒళ్లు కనిపించేలా నటించడమా? ముద్దు సన్నివేశాల్లో నటించడమా? అయితే అలాంటి పాత్రలు చేయకూడదు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ‘రౌడీబాయ్స్‌’లో ముద్దు సన్నివేశం కథానుగుణంగా ఉందని అనిపించింది. చేశాను. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement