ఈ ఏడాది... వారి సంపాదన ఎంతంటే ...

ABN , First Publish Date - 2021-12-26T22:53:57+05:30 IST

కరోనా మహమ్మారి సమయంలో కూడా... పలువురు ప్రపంచ, భారత కుబేరులు భారీగానే ఆర్జించారు.

ఈ ఏడాది...  వారి సంపాదన ఎంతంటే ...

ముంబై : కరోనా మహమ్మారి సమయంలో కూడా... పలువురు  ప్రపంచ, భారత కుబేరులు భారీగానే ఆర్జించారు. ఈ(2021) సంవత్సరంలో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ మొదలుకుని భారత్‌కు చెందిన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వరకు సంపదను పెద్దఎత్తున కూడబెట్టారు. కాగా... ఫోర్బ్స్ ఇండియా ధనికుల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నారు. సావిత్రి జిందాల్ రిచ్చెస్ట్ ఇండియన్ వుమెన్‌గా నిలిచారు. ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ కూడా 2021 లో భారీగానే ఆర్జించారు. 


ప్రపంచ కుబేరుల సంపద జంప్... కరోనా నేపధ్యంలో ఆయా దేశాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, కుబేరుల సంపద మాత్రం భారీగా పెరిగిపోయింది. నిరుడు(2020) కరోనా కష్టకాలంలోరూ  1.9 ట్రిలియన్ డాలర్లు(దాదాపు రూ.1.42 కోట్ల కోట్లు) ఆర్జించిన బిలియనీర్లు, 2021 లో కూడా అదే జోరును కొనసాగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2600 కంటే ఎక్కువ బిలియనీర్లకు ఈ ఏడాది 1.6 ట్రిలియన్ డాలర్ల(రూ. 1.20 కోట్ల కోట్లు) సంపద వచ్చిపడింది.


భారత కుబేరుల విషయానికొస్తే... 92.7 బిలియన్ డాలర్ల నెట్ వర్త్‌తో ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. జియోలో వాటాను ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థలకు విక్రయించడం ద్వారా 20 బిలియన్ డాలర్లను ఆర్జించారు. అతను వరుసగా పదో  సంవత్సరం మొదటి స్థానంలో ఉన్నారు. ఇక... దేశంలో అత్యంత కుబేరుల సంపద 50 శాతం పెరిగినట్లు అక్టోబరు నెలలో ఫోర్బ్స్ వెల్లడించింది. దేశంలోని మొత్తం ధనవంతుల సంపద దాదాపు 730 బిలియన్ డాలర్ల(రూ. 54.77 లక్షల కోట్లు)కు చేరింది. వీరి సంపద విలువ... 2020 కంటే 50 శాతం పెరిగేందుకు భారత ఆర్థిక వ్యవస్థ మూలాల పటిష్ఠతే కారణమని ఫోర్బ్స్ పేర్కొంది.


టాప్ టెన్ ఇండియన్స్ జాబితాలో... 74.8 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. ఇన్ఫ్రా వ్యాపారంతో పాటు పవర్ జనరేషన్, ట్రాన్స్‌మిషన్, ఎడిబుల్ ఆయిల్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. ముంబై విమానాశ్రయంలో ఆయనకు 74 శాతం వాటా ఉంది. హెచ్‌సీఎల్ శివనాడర్ 31 బిలియన్ డాల్రలతో మూడో స్థానంలో నిలిచారు. శివనాడర్ ఫౌండేషన్ ద్వారా ఆయన... 662 మిలియన్ డాలర్లను దాతృత్వ కార్యకలాపాలకు వినియోగించడం గమనార్హం. ఇక... 29.4 బిలియన్ డాలర్లతో రాధాకిషన్ ధమానీ నాలుగో స్థానంలో నిలిచారు. ఈయనకు... దేశవ్యాప్తంగా 214 డిమార్ట్ స్టోర్లున్నాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫౌండర్ పూనావాలా 19 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో, 18.8 బిలియన్ డాలర్లతో ఆర్సెలార్ మిట్టల్ ఆరవ స్థానంలో, 18 బిలియన్ డాలర్లతో సావిత్రి జిందాల్ ఏడవవ స్థానంలో, 16.5 బిలియన్ డాలర్లతో ఉదయ్ కొటక్ ఎనిమిదో స్థానంలో, షాపూర్‌జీ పల్లోంజీ 16.4 బిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానంలో, 15.8 బిలియన్ డాలర్లతో కుమార్ బిర్లా పదో స్థానంలో నిలిచారు.ఇక... ప్రపంచవ్యాప్తంగా చూస్తే ముఖేష్ అంబానీ 12, అదానీ 15, శివ్ నాడర్ 49, రాధాకిషన్ ధమానీ 81, లక్ష్మీ మిట్టల్ 101 వ స్థానంలో ఉన్నారు.

Updated Date - 2021-12-26T22:53:57+05:30 IST