ఈ ఏడాదీ ఖరీఫ్‌ కష్టాలేనా?

ABN , First Publish Date - 2022-07-04T06:35:06+05:30 IST

రాజవొమ్మంగి మండలంలో ప్రతి ఏడాది ఖరీఫ్‌ రైతులకు నిరాశే మిగుల్చుతోంది.

ఈ ఏడాదీ ఖరీఫ్‌ కష్టాలేనా?
వట్టిగెడ్డ రిజర్వాయర్‌ కాలువ దుస్థితి

  • పూడుకుపోయిన పంట కాలువలు.. పనులకు కాంట్రాక్టర్లు నో 

రాజవొమ్మంగి జూలై 3: రాజవొమ్మంగి మండలంలో ప్రతి ఏడాది ఖరీఫ్‌ రైతులకు నిరాశే మిగుల్చుతోంది. పంట పొలాలు పూడికపోవడంతో ప్రతి ఏటా రైతులు, ప్రజాప్రతినిధులు సొంతంగా డబ్బులు వేసుకుని పంట కాలువ పూడికతీత, ఇతర పనులు నిర్వహిస్తున్నారు. చిన్ననీటిపారుదల శాఖ అధికారులు మండలంలోని పొలాలకు సాగునీరు అందించే పరిస్థితిలో లేరని రైతులు మండిపడుతున్నారు. అప్పలరాజుపేట గ్రామంలో ఉన్న వట్టి గెడ్డ రిజర్వాయర్‌ ద్వారా సుమరు 5 కిలోమీటర్ల మేర రాజవొమ్మంగి, దూసరపాము, తంటికొండ, వట్టిగెడ్డ, డి.మల్లవరం గ్రామాల్లో ఉన్న పొలాలకు సాగునీరు అందాల్సి ఉంది. ఈ ఐదు గ్రామాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 1400 ఎకరాల్లో సాగు జరుగుతోందని సుమారు 3000 ఎకరాల్లో పంట సాగవుతోందని రైతులు చెబుతున్నారు. అయితే వట్టిగెడ్డ రిజర్వాయర్‌ నుంచి పంట పొలాలకు వెళ్లే ప్రధాన కాలువ ప్రారంభంలోనే గండ్లు ఉండడం,సాగునీటి కాలువ గ్రామాల మధ్యలో ఉండడంతో వ్యర్థాలతో మూసుకుపోయింది. దీంతో సాగునీరు అందడం లేదు. గత ఏడాది ఇదే సమస్య వస్తే దూసరపాము, రాజవొమ్మంగి గ్రామస్థులు, సర్పంచ్‌లు చందాలు వేసుకుని పనులు చేయించుకున్నారు. ఈ సమస్యపై గత ఏడాది అప్పటి రంపచోడవరం ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్యకు రైతులు మోర పెట్టుకోగా వట్టిగెడ్డ రిజర్వాయర్‌ పంట కాలువను ఆయన పరిశీలించి  పంట కాలువకు తాత్కాలికంగా గండ్లు మూసేందుకు రూ.1 లక్ష 76 వేలు మంజూరు చేశారు.  అయితే పనులు చేసేందుకు మండలంలో ఎవరు ముందుకు రావట్లేదు. గతంలో చేసిన పనులకు బిల్లులవ్వక వట్టిగెడ్డ రిజర్వాయర్‌ పంట కాలువ గండ్లు పూడే ్చందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా రాజవొమ్మంగి మండలంపై ప్రభుత్వ అధికారులు దృష్టి సారించి  పంటకాలువ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రాజవొమ్మంగి సర్పంచ్‌ గొల్లపూడి రమణి కోరారు. 

Updated Date - 2022-07-04T06:35:06+05:30 IST