ఈ ఏడాది వృద్ధి 5.7 శాతమే

ABN , First Publish Date - 2022-10-04T09:10:39+05:30 IST

భారత ఆర్థిక వృద్ధిరేటును ఐక్యరాజ్య సమితి అనుబంధ వాణిజ్య, అభివృద్ధి సంస్థ (అంక్టాడ్‌) భారీగా కుదించింది.

ఈ ఏడాది వృద్ధి 5.7 శాతమే

అంక్టాడ్‌ తాజా అంచనా


ఐక్యరాజ్యసమితి : భారత ఆర్థిక వృద్ధిరేటును ఐక్యరాజ్య సమితి అనుబంధ వాణిజ్య, అభివృద్ధి సంస్థ (అంక్టాడ్‌) భారీగా కుదించింది. ఈ ఏడాది వృద్ధిరేటు 5.7 శాతానికే పరిమితం అవుతుందని తేల్చి చెప్పింది.  ఫైనాన్సింగ్‌ వ్యయాల పెరుగుదల, ప్రభుత్వ వ్యయాల్లో బలహీనత ప్రభావంతో  ఆర్థిక కార్యకలాపాలు మందగించడమే ఇందుకు కారణమని తెలిపింది. 2023 సంవత్సరం వృద్ధిరేటును కూడా 4.7 శాతంగా అంచనా వేసింది. 2021లో ఇది 8.2 శాతం ఉంది. జి-20 దేశాల్లోనే ఇది బలమైన వృద్ధిరేటు. కార్పొరేట్‌ పెట్టుబడుల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం ప్రారంభించినప్పటికీ ఇంధన దిగుమతులు పెరగడం, పెరిగిన వాణిజ్య లోటు, తగ్గుతున్న విదేశీ మారకం నిల్వలు సవాలు విసురుతున్నట్టు తాజా నివేదికలో ప్రకటించింది.


అలాగే రోడ్లు, రైల్వే విభాగాల్లో పెట్టుబడి వ్యయ ప్రణాళికలు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనతల వల్ల విధానకర్తలు ఒత్తిడి ఎదుర్కొనాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాదికి వృద్ధిరేటును 5.7 శాతానికి కుదించడంతో పాటు 2023 సంవత్సరం వృద్ధిరేటును 4.7 శాతంగా అంచనా వేసినట్టు వివరించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, రష్యన్‌ చమురు దిగుమతులపై అమెరికా నిషేధం వంటి చర్యలన్నీ ప్రపంచ ఆయిల్‌ మార్కెట్‌పై ఒత్తిడిని పెంచి వర్థమాన దేశాల వృద్ధిని ప్రభావితం చేసినట్టు ఆ నివేదిక తెలిపింది. 


సెప్టెంబరు ఎగుమతుల్లో క్షీణత

భారత ఎగుమతుల రంగం సెప్టెంబరు నెలలో నిరాశావహమైన పనితీరు ప్రదర్శించింది. ఎగుమతులు 3.52 శాతం క్షీణించి 3262 కోట్ల డాలర్లకే పరిమితం అయ్యాయి. గత ఏడాది సెప్టెంబరు ఎగుమతుల విలువ 3381 కోట్ల డాలర్లు. కాగా వాణిజ్య లోటు 2672 కోట్ల డాలర్లకు పెరిగినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇదే నెలలో దిగుమతులు 5.44 శాతం పెరిగి 5935 కోట్ల డాలర్లకు చేరాయి. ఏప్రిల్‌-సెప్టెంబరు నెలల మధ్య కాలంలో ఎగుమతులు 15.54 శాతం పెరిగి 22,905 కోట్ల డాలర్లకు చేరగా దిగుమతులు 37.89 శాతం పెరిగి 37,853 కోట్ల డాలర్లకు చేరాయి. తొమ్మిది నెలల మొత్తం వాణిజ్య లోటు 14,947 కోట్ల డాలర్లయింది. 


తగ్గిన తయారీ కార్యకలాపాలు

దేశంలో తయారీ రంగం కార్యకలాపాలు సెప్టెంబరులో స్వల్పంగా తగ్గాయి. ఆగస్టుతో పోల్చితే తయారీ రంగం పీఎంఐ 56.2 పాయింట్ల నుంచి 55.1 పాయింట్లకు తగ్గింది. అయితే వరుసగా 15వ నెలలో కూడా వృద్ధిపథంలోనే ఉన్నట్టు ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ తెలిపింది. ధరల ఒత్తిడులు తగ్గడంతో కంపెనీలు అధికంగా కొత్త ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయని సర్వేలో తేలింది. 

Updated Date - 2022-10-04T09:10:39+05:30 IST