‘అన్నమయ్య’ నిండేనా..అలంకారప్రాయంగా ప్రాజెక్టు

ABN , First Publish Date - 2020-08-07T05:30:00+05:30 IST

రాజంపేట, పుల్లంపేట వాసులకు వరప్రసాదిని అయిన అన్నమయ్య ప్రాజెక్టు ఈసారైనా నిండుతుందా అని ఆయకట్టు రైతులు ఎంతో

‘అన్నమయ్య’ నిండేనా..అలంకారప్రాయంగా ప్రాజెక్టు

ఈ ఏడాదైనా నిండుతుందని రైతుల ఆశ


రాజంపేట, ఆగస్టు 6 : రాజంపేట, పుల్లంపేట వాసులకు వరప్రసాదిని అయిన అన్నమయ్య ప్రాజెక్టు ఈసారైనా నిండుతుందా అని ఆయకట్టు రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి నేటి వరకు ఒక్క ఏడాది మినహా మిగిలిన అన్ని సంవత్సరాల్లో పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిండకపోవడంతో మొత్తం ఆయకట్టుకు ఇంతవరకు నీరందలేదు. ఈసారైనా ఈ ప్రాజెక్టు నిండి మొత్తం ఆయకట్టు ప్రాంతానికి నీరందుతుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. రాజంపేట మండలం చెయ్యేటిలో సుమారు 60 కోట్ల రూపాయల ఖర్చుతో 2002లో 2.24 టీఎంసీల సామర్థ్యంతో అన్నమయ్య ప్రాజెక్టును నిర్మించారు. రాజంపేట, పుల్లంపేట మండలాల్లోని 22,500 ఎకరాలకు ఖరీఫ్‌, రబీ సీజన్‌లో మొత్తం ఆయకట్టుకు నీరందించాలని ఈ ప్రాంతంలోని ఏడు చెరువులను నింపి నీరందించాలన్న లక్ష్యంతో ఆనాడు ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. 2017లో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టాన్ని నింపారు.  అప్పటి నుంచి ఇంతవరకు పూర్తిస్థాయిలో ప్రాజెక్టులోకి నీరు రాలేదు.


గత ఏడాది వర్షాలు లేకపోవడం వల్ల ప్రస్తుతం ప్రాజెక్టులో 0.9 టీఎంసీల నీరు ఉంది. ఖరీ్‌ఫలో 12,500 ఎకరాలు, రబీలో 10 వేల ఎకరాలు నీరందించాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టు కట్టిన ఆరంభం నుంచి ఒకసారి గేట్లు తెగిపోవడం, వరుసగా వర్షాలు కురవకపోవడం, తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల వల్ల ఒక ఏడాది మినహా మిగిలిన అన్ని సంవత్సరాల్లో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించలేదు. ఈ ప్రాజెక్టును ఆధారంగా చేసుకుని వత్తలూరు, మన్నూరు, ఎర్రజెరువు, ఊటుకూరు చెరువు, కిచ్చమ్మ చెరువు, బావికాడపల్లె చెరువులకు నీరందించాల్సి ఉంది. పుల్లంపేట మండలంలో వత్తలూరు, రాజంపేట మండలంలోని మిట్టమీదపల్లె, మేకావారిపల్లె, కొల్లావారిపల్లె తదితర గ్రామాల చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరందించాల్సి ఉంది. రాజంపేట పట్టణానికి ఈ ప్రాజెక్టు నుంచే మంచినీటిని అందిస్తున్నారు.


ప్రస్తుతం అన్నమయ్య ప్రాజెక్టే రాజంపేట పట్టణానికి ప్రధాన తాగునీటి వనరు. రూ.100 కోట్లతో సుండుపల్లె మండలానికి నీరందించడానికి ప్రత్యేక నీటి పథకాన్ని శరవేగంగా ఏర్పాటు చేస్తున్నారు. వీరబల్లి వాసులకు ఇక్కడి నుంచే ప్రత్యేక తాగునీటి పథకం ఏర్పాటు చేసి కరువు పీడిత ప్రాంతీయులకు తాగునీటిని అందిస్తున్నారు. ఒక రకంగా సాగునీటి ప్రాజెక్టు అయిన ఈ అన్నమయ్య మరో రకంగా తాగునీటి ప్రాజెక్టుగా మారిపోయింది. ఇదే ప్రాజెక్టు నుంచి పుల్లంపేట మండలానికి తాగునీరు అందించడానికి ప్రత్యేక నీటి పథకాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే అది అసంపూర్తిగా ఉంది. ఈ విధంగా అటు తాగునీటికి, సాగునీటికి రాజంపేట, పుల్లంపేట మండలాలకు పూర్తి స్థాయి నీరందించే ఆ ప్రాజెక్టు ఈ ఏడాదైనా పూర్తి స్థాయిలో నిండి ఆయకట్టు సాగవుతుందని రైతులు ఆశిస్తున్నారు. 


ప్రాజెక్టు నిండుతుందని ఆశిస్తున్నాం 

ఈసారి అన్నమయ్య ప్రాజెక్టు ఖచ్చితంగా నిండి పూర్తి స్థాయిలో నీరందుతుందని ఆశిస్తున్నాం. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆశాజనంగా వర్షాలు పడుతున్నాయి. డిసెంబరు వరకు వర్షాలు కురుస్తూనే ఉంటాయి గనుక ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నిండుతుందనుకుంటున్నాం. దీనివల్ల మొత్తం ఆయకట్టుకు నీరు చేరుతుంది. 

- ప్రసాద్‌రెడ్డి, రైతు, హస్తవరం, రాజంపేట మండలం.


వర్షాలు బాగా పడితే నిండుతుంది- రవికిరణ్‌, ప్రాజెక్టు ఈఈ 

ప్రాజెక్టు సామర్థ్యం 2.24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.9 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. వర్షాలు కురుస్తూ ఉండటం వల్ల పాయింట్‌ 25 టీఎంసీల స్వల్పంగా నీరు చేరింది. వర్షాలు భారీగా పడితే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. 

Updated Date - 2020-08-07T05:30:00+05:30 IST