Woman fired: ఆ ఒక్క కామెంట్‌తో ఉద్యోగం పోగొట్టుకున్న మహిళ.. టెక్ రంగానికి స్త్రీలు దూరమవుతోంది ఇందుకేనా..?

ABN , First Publish Date - 2022-07-23T02:01:55+05:30 IST

ఈ ప్రపంచంలో అనేక రంగాల్లో పురుషులదే ఆధిపత్యం..! ఇందులో ఎటువంటి సందేహం లేదు..! అయితే.. ఈ క్రమంలో పురుషాధిక్యతకు మహిళలు బలవుతున్నారనేది స్త్రీవాదుల ఆరోపణ..! ఈ ఆరోపణ నిజమని నిరూపించే మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Woman fired: ఆ ఒక్క కామెంట్‌తో ఉద్యోగం పోగొట్టుకున్న మహిళ.. టెక్ రంగానికి స్త్రీలు దూరమవుతోంది ఇందుకేనా..?

ఇంటర్నెట్ డెస్క్: ఈ ప్రపంచంలో అనేక రంగాల్లో పురుషులదే ఆధిపత్యం..! ఇందులో ఎటువంటి సందేహం లేదు..! అయితే.. ఈ క్రమంలో పురుషాధిక్యతకు మహిళలు బలవుతున్నారనేది స్త్రీవాదుల ఆరోపణ..! ఈ ఆరోపణ నిజమని నిరూపించే మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పని ప్రదేశంలో పురుషాధిక్యాన్ని ప్రశ్నించిన తను చివరికి ఉద్యోగం పోగొట్టుకున్నానంటూ(fired) జాన్నెకీ పారిష్ అనే మహిళ ఇటీవల ట్విటర్ వేదికగా వాపోయింది. మహిళలు టెక్ రంగానికి దూరమవడానికి కారణం ఇదేనంటూ తేల్చి చెప్పింది. 


కొద్ది వారాల క్రితం తాను ఉద్యోగం ఎలా కోల్పోయిందీ వివరిస్తూ జాన్నెకీ వరుస ట్వీట్లు చేసింది. ‘‘నా తోటి ఉద్యోగి ఒకరు నా ప్రాజెక్టులో కొన్ని మార్పులు చేశాడు. అప్పటికి నేను ఆఫీసుకు సెలవు పెట్టడంతో అతడు నాకు ఆ విషయం చెప్పలేదు. అయితే.. అతడు చేసిన మార్పుల కారణంగా ప్రాజెక్టుపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో.. ఈ విషయాన్ని అతడితో ప్రస్తావించా. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పమంటూ అతడి సూచనలు కోరాను. అయితే.. ఈ చర్చల సందర్భంగా అతడు తరచూ నా మాటలకు అడ్డుపడ్డాడు. నేను నా వివరణ ఇస్తున్న నమయంలోనే అతడు కల్పించుకుని తాను మాట్లాడటం ప్రారంభించాడు. దీంతో.. నేను మాట్లాడటం పూర్తయ్యాక మీరు చెప్పేది చెప్పండి అని మర్యాదగానే సూచించా..! ఈ మీటింగ్ జరిగిన తరువాత ఓ రోజు నాకు హెచ్ ఆర్ విభాగం నుంచి ఫోన్ వచ్చింది. నా కమ్యూనికేషన్ స్కిల్స్ దారుణంగా ఉన్నాయంటూ వారు ఉద్యోగం నుంచి తొలగించారు. నన్ను తక్కువ చేసే ప్రయత్నం చేసిన ఓ పురుష ఉద్యోగి తీరును ప్రశ్నించడంతోనే నా ఉద్యోగం పోయింది. టెక్ రంగంలోని మహిళలూ తరచూ ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటారు. ఇది చాలా దారుణమైన, విషపూరితమైన పరిస్థితులు.’’ అని ఆమె వాపోయింది.


జాన్నెకీ పారిష్ స్థితిని చూసి నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆమెకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నత స్థానాల్లోని పురుష ఉద్యోగులు అప్పుడప్పుడూ చిరాకు ప్రదర్శిస్తే ఎవరూ పట్టించుకోరని కొందరు చెప్పుకొచ్చారు. అదే ఓ మహిళ కాస్తంత గొంతు పెంచి మాట్లాడితే చాలు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించేందుకు కంపెనీలో ప్రయత్నాలు మొదలవుతాయని చెప్పుకొచ్చారు. టెక్ రంగంలోనే కాకుండా అనేక చోట్లు స్త్రీలు వివక్ష ఎదుర్కొంటున్నారని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. కొందరు మాత్రం కాస్త ఆచితూచి స్పందించారు. బడా కంపెనీలు.. స్త్రీపురుష సమానత్వం విషయంలో చాలా ఉదారంగా ఉంటాయని వారు వ్యాఖ్యానించారు. ఇంత చిన్న కారణానికే ఉద్యోగం పోయిందంటే.. అసలు ఆ మీటింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలని వ్యాఖ్యానించారు.





Updated Date - 2022-07-23T02:01:55+05:30 IST