దటీజ్ మునుమున్ దేబ్.. కోవిడ్‌పై పోరుకు ప్రజలను తట్టిలేపిన టీచర్!

ABN , First Publish Date - 2020-03-30T03:52:42+05:30 IST

త్రిపురకు చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయురాలు మున్‌మున్ దేబ్ పేరు దేశంలో ఇప్పుడు మార్మోగుతోంది.

దటీజ్ మునుమున్ దేబ్.. కోవిడ్‌పై పోరుకు ప్రజలను తట్టిలేపిన టీచర్!

గువాహటి: త్రిపురకు చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయురాలు మున్‌మున్ దేబ్ పేరు దేశంలో ఇప్పుడు మార్మోగుతోంది. కోవిడ్-19పై పోరాడుతున్న ప్రభుత్వానికి సహకరించడంలో రాష్ట్రంలోని ఎంతోమందికి ఆమె స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. దేశంలో లాక్‌డౌన్ అమలు కావడానికి ముందే రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించాలంటూ ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్ దేబ్‌కు మున్‌మున్ సూచించారు. అంతేకాదు, ముఖ్యమంత్రి సహాయనిధి లింకును ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేయాలని సీఎంకు సూచించారు. అది చూసిన సీఎం వెంటనే స్పందించారు. తన ఫేస్‌బుక్ ఖాతాలో సీఎం సహాయనిధికి సంబంధించిన లింకును షేర్ చేశారు.


ఆ వెంటనే మున్‌మున్‌తోపాటు టీచర్ అయిన తన సోదరి జుయిలు కలిసి ఒక్కొక్కరు రూ. 5 వేల చొప్పున విరాళం అందించారు. వారి ప్రయత్నం ఎందరికో ప్రేరణ ఇచ్చింది. చాలామంది వారిని అనుసరించి విరాళాలు ప్రకటించారు. ‘‘రాష్ట్రాన్ని లాక్‌డౌన్ చేయాల్సిందిగా ఫేస్‌బుక్ ద్వారా సీఎంను కోరాను. నా తర్వాతి నెల వేతనంలో 25 శాతాన్ని విరాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పాను. నా ఫేస్‌బుక్ పోస్టును ఎందరో షేర్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి స్పందించారు. ఇది చాలా మంచి కార్యక్రమమని ప్రశంసించారు’’ అని మున్‌మున్ తెలిపారు. లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రజలు అభినందిస్తున్నారని, పేదలు, దినసరి కూలీలను ఆదుకోవడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.


మనం అన్నీ ప్రభుత్వానికే వదిలివేయకూడదని మున్‌మున్ అభిప్రాయపడ్డారు. మనకి మన హక్కుల గురించి బాగా తెలుసని, కానీ సామాజిక బాధ్యతల గురించి మాత్రం చాలా తక్కువ తెలుసని అన్నారు. తమ తండ్రే తమకు స్ఫూర్తి అని జుయి పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండేవారని, అప్పట్లో ఆయన తన వేతనంలో కొంత భాగాన్ని ప్రభుత్వ సహాయనిధికి ప్రకటించారని ఆమె గుర్తు చేశారు. మనకున్న దాంట్లో కొంతమందికైనా సాయం చేస్తే మనం సంతోషంగా ఉంటామని ఆమె అన్నారు.  


త్రిపురలోని ధలై జిల్లాలోని కమల్పూర్‌లో వీరి కుటుంబం నివసిస్తోంది. మున్‌మున్ కమల్‌పూర్ క్లాస్ 12 స్కూల్లో బెంగాలీ బోధిస్తుండగా, జుయి కమల్‌పూర్ మదర్సా క్లాస్ 12 స్కూల్‌లో ఇంగ్లిష్ టీచర్. వారి తల్లి అనిమా దేబ్ త్రిపుర సామాజిక విద్య విభాగంలో రిటైర్డ్ ఉద్యోగి.

Updated Date - 2020-03-30T03:52:42+05:30 IST