ఈసారి వేసవి సెలవులు 18 రోజులే

ABN , First Publish Date - 2021-01-24T07:59:32+05:30 IST

ఈసారి పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు 18 రోజులు మాత్రమే ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు.. వచ్చే విద్యా సంవత్సరం (2021-22) యథాతథంగా ప్రారంభం అవుతుందని పేర్కొంది. గత విద్యాసంవత్సరం జూన్‌ 12న మొదలవగా..

ఈసారి వేసవి సెలవులు 18 రోజులే

వచ్చే విద్యాసంవత్సరం యథాతథం

మే 17 నుంచి 26 దాకా పది పరీక్షలు

పరీక్షలకు హాజరుశాతం తప్పనిసరి కాదు

ఏప్రిల్‌ నెలాఖరుకు సిలబస్‌ అంతా పూర్తి 

మే 1 నుంచి రివిజన్‌.. ప్రీ ఫైనల్స్‌ రద్దు 

మే 27 నుంచి జూన్‌ 13 దాకా సెలవులు

జూన్‌ 14 నుంచి కొత్త విద్యాసంవత్సరం

రానున్న 4 నెలలు రెండో శనివారమూ బడులు

అకడమిక్‌ కేలెండర్‌ను ప్రకటించిన సర్కారు

ఆన్‌లైన్‌లో బస్‌పాస్‌లు

28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఫిబ్రవరి 1 నుంచి విద్యార్థులకు బస్‌పాస్‌లు 

విద్యా సంస్థలకు కోడ్‌  నంబర్లు.. ఆర్టీసీ చర్యలు


హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఈసారి పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు 18 రోజులు మాత్రమే ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు.. వచ్చే విద్యా సంవత్సరం (2021-22) యథాతథంగా ప్రారంభం అవుతుందని పేర్కొంది. గత విద్యాసంవత్సరం జూన్‌ 12న మొదలవగా.. కొత్త విద్యా సంవత్సరం రెండు రోజులు ఆలస్యంగా అంటే ఈ ఏడాది జూన్‌ 14న ప్రారంభం అవుతుందని తెలిపింది. పదో తరగతి పరీక్షలను మే 17 నుంచే నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే పదోతరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్‌ పరీక్షలను రద్దు చేశారు. ఇక వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులకు నిబంధనల వేసవి సెలవులు 18 రోజులే మేరకు ఉండాల్సిన హాజరు శాతం ఈసారి తప్పనిసరి కాదని సర్కారు పేర్కొంది.


హాజరు శాతం లేనికారణంగా ఒక్క విద్యార్థిని కూడా వార్షిక పరీక్షలకు దూరం పెట్టకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అకడమిక్‌ కేలండర్‌ను శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి కరోనా నేపథ్యంలో ఏటా బడుల ప్రారంభానికి ముందు జూన్‌ మొదటివారంలో చేసే ప్రకటనకు భిన్నంగా ఎనిమిది నెలలు ఆలస్యంగా కేలండర్‌ను ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి ఉన్నత పాఠశాలల్లో 9, 10వ తరగతులకు పాఠాలు బోధించాలని సర్కారు ఆదేశించడంతో ఈ రెండు తరగతుల విద్యార్థులకే ఈ అకాడమిక్‌ కేలెండర్‌ వర్తించనుంది.


సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో తరగతులు మొదలవగా జనవరి 30 వరకు 115 తరగతులు పూర్తవుతాయి. తాజాగా అకడమిక్‌ కేలండర్‌ మేరకు 89 రోజులపాటు పాఠశాలలు కొనసాగనున్నాయి. దీంతో మొత్తంగా ఆన్‌లైన్‌ తరగతులు, ప్రత్యక్ష బోధనా తరగతులను కలుపుకొని ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 204 పనిదినాలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ఏప్రిల్‌ చివరి వరకు సిలబస్‌ పూర్తిచేసి, మే నెల 1వ తేదీ నుంచి క్లాసులు రివిజన్‌ చేయనున్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటికే సెలవులు ఎక్కువగా ఉండటంతో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో జరగనున్న తరగతుల్లో రెండోశనివారం కూడా పాఠశాలలు కొనసాగనున్నాయి.

  

30 శాతం సిలబ్‌సకు ప్రాజెక్ట్‌ వర్క్‌ 

ఈసారి అన్ని తరగతుల పాఠ్యాంశాలను 30శాతం తగ్గించిన విషయం తెలిసిందే. తరగతులవారీగా ఈ పాఠాలను విద్యాశాఖ ఇప్పటికే వెల్లడించింది. ఇందులో నుంచి విద్యార్థులకు ప్రాజెక్ట్‌వర్క్‌, అసైన్‌మెంట్లు ఇవ్వాలి. వీటిని విద్యార్థులు పూర్తిగా వదిలేయకూడదన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఎఫ్‌ఏ, ఎస్‌ఏ, వార్షిక పరీక్షల్లో ప్రశ్నలు మాత్రం 70 శాతం పాఠ్యాంశాల నుంచే ఉంటాయి. ఇక పాఠశాలల ప్రారంభానికి ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఉండే స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ) సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలి. ఇందులో కరోనా గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. పాఠశాలలు ప్రారంభమయ్యాక రోగనిరోదక శక్తి పెంపొందించుకోవడం, మానసిక ఆరోగ్యం, పరిశుభత్ర, సామాజిక దూరం లాంటి అంశాలు, ఇతర జాగ్రత్త చర్యలను తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించాలి. స్మార్ట్‌ఫోన్‌ ఉన్నవారు ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 


తరగతుల్లో డ్యాన్స్‌, మ్యూజిక్‌, యోగా

తరగతులు ప్రారంభించాక విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. మానసిక ఉల్లాసాన్ని కలిగించే మేథమేటిక్స్‌ గేమ్స్‌, అంత్యాక్షరి లాంటివి నిర్వహించాలి. సబ్జెక్టుతో అనుసంధానంగా మ్యూజిక్‌, డ్యాన్స్‌ లాంటి కార్యక్రమాలను చేపట్టవచ్చు. సామాజిక దూరం పాటిస్తూ కొన్ని సులువైన ఆసనాలు ప్రాక్టీస్‌ చేయించాలని ఆదేశించింది. 


అకడమిక్‌ కేలండర్‌ ఇదీ 

తరగతుల ప్రారంభం : ఫిబ్రవరి-1 

పాఠశాల సమయం : 9:30 నుంచి 4:45 

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో : 8:45 -4:00 దాకా

మొత్తం పనిదినాలు : 89 


పరీక్షలు.. 

ఫార్మెటివ్‌ అసెస్మెంట్‌ (ఎఫ్‌ఎ-1) : మార్చి-15 లోపు 

ఫార్మెటివ్‌ అసెస్మెంట్‌ (ఎఫ్‌ఎ-2) : ఏప్రిల్‌-15 లోపు 

సమ్మెటివ్‌ అసెస్మెంట్‌  (ఎస్‌ఎ-) : మే 5-13 వరకు 

వార్షిక పరీక్షలు : మే 17-26 వరకు. 

చివరి పనిదినం: మే-26 

వేసవి సెలవులు : మే-27 నుంచి జూన్‌-13 

Updated Date - 2021-01-24T07:59:32+05:30 IST