కిరణ్ అబ్బవరపు కథానాయకుడిగా మైత్రీ మూవీస్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఓ చిత్రానికి శ్రీకారం చుట్టాయి. రమేష్ కాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మాతలు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ క్లాప్‌నిచ్చారు. కె.ఎస్.రవీంద్ర స్విచ్చాన్ చేశారు. గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, చెర్రీలు దర్శకుడికి స్ర్కిప్టు అందించారు. ‘‘ఇదో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. కిరణ్ కి కొత్త ఇమేజ్ తీసుకొచ్చే సినిమా అవుతుంది. కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తామ’’న్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంభాషణలు: రమేష్ కాదూరి.