ఈ సారి పోటీనే..!

ABN , First Publish Date - 2021-01-19T06:07:32+05:30 IST

విజయ డెయిరీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి..

ఈ సారి పోటీనే..!

ఉత్కంఠ రేపుతున్న డెయిరీ ఎన్నికలు

బరిలో దిగిన టీడీపీ, వైసీపీ వర్గీయులు

మూడు పోస్టులకు ఎనిమిది నామినేషన్లు

విజయ డెయిరీ వద్ద భారీ బందోబస్తు


నంద్యాల(కర్నూలు): విజయ డెయిరీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి లిమిటెడ్‌ ఎన్నికలు ఇప్పటి వరకూ ఏకగ్రీవమే అయ్యాయి. పార్టీలకు అతీతంగా 26 సంవత్సరాలుగా ప్రస్తుత చైర్మన్‌ భూమా నారాయణరెడ్డి ఏకగ్రీవంగా చైర్మన్‌ అవుతూ వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చింది. చైర్మన్‌ పదవిపై ఆ పార్టీ నాయకులు దృష్టి సారించారు. దీంతో ఈసారి డైరెక్టర్ల ఎన్నికకు పోటీ తప్పేలా లేదని భావిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ సోమవారం మొదలైంది. మూడు డైరెక్టర్ల పోస్టులకు ఎనిమిది మంది నామినేషన్లు వేశారు. టీడీపీ, వైసీపీ వర్గీయులు వీరిలో ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 19వ తేదీ మంగళవారం సాయంత్రం వరకూ ఉపసంహరణకు గడువు ఉంది. 


ఎనిమిది నామినేషన్లు

విజయ డెయిరీ పరిపాలనా భవనంలో ఎన్నికల అధికారి హరిబాబు పర్యవేక్షణలో సోమవారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మూడు డైరెక్టర్ల స్థానాలకు ఎనిమిది మంది నామినేషన్లు వేశారు. అధికార వైసీపీ తరపున ఎస్‌వీ జగన్‌మోహన్‌రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి, ఎస్‌ రవికాంతరెడ్డి, లక్కా భాస్కర్‌ నామినేషన్లు వేశారు. టీడీపీ వర్గీయులు ఇండ్ల రమణారెడ్డి, యేలంపల్లి రంగారెడ్డి, వై మల్లికార్జున, ఎల్‌ జానకీదేవి నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. అధికార, ప్రతిపక్షాల తరపున ఎవరెవరు నామినేషన్లను ఉపసంహరించుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది. డెయిరీ డైరెక్టర్ల ఎన్నిక సందర్భంగా గత ఏడాది ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు నామినేషన్ల ప్రక్రియకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 


ఇన్నాళ్లూ ఏకగ్రీవమే..

విజయ డెయిరీకి పాలక వర్గంలో మొత్తం 15 మంది డైరెక్టర్లు ఉంటారు. మ్యాక్స్‌ చట్టం ప్రకారం ఏటా ముగ్గురు డైరెక్టర్ల పదవీ కాలం ముగిసిపోతుంది. ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. డెయిరీ పరిపాలనా వ్యవహారాలు మ్యాక్స్‌ చట్టం పరిధిలోకి వచ్చాక 2002 నుంచి 2019 వరకు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నిక అవుతూ వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 డిసెంబరులో విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్‌పై ఆ పార్టీ నాయకులు కోర్టుకు వెళ్లారు. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ఈ ఏడాదికి సంబం ధించిన ముగ్గురు డైరెక్టర్ల ఎన్నిక ప్రక్రియ మొదలైంది. దాఖలైన 8 నామినేషన్లను 19న పరిశీలిస్తారు. అదే రోజు వరకూ ఉపసంహరణ గడువు ఉంది. పోటీ తప్పదు అనుకుంటే 27వ తేదీన ఎన్నికలు జరుగుతాయి.


విజయ డెయిరీకి 1995 నుంచి 2021 వరకు చైర్మన్‌గా భూమా నారాయణరెడ్డి కొనసాగుతున్నారు. ఇన్నేళ్లూ ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా భూమా నారాయణరెడ్డి ఏకగ్రీవం కావడం రాష్ట్రంలో రికార్డు. కానీ ఇప్పుడు చైర్మన్‌ పదవిని అధికార పార్టీ నాయకులు ఆశిస్తుండటంతో పోటీ అనివార్యంగా కనిపిస్తోంది.


కుర్చీపై కన్ను

వైసీపీ నుంచి ఆళ్లగడ్డకు చెందిన ఎస్‌వీ జగన్‌మోహన్‌రెడ్డి చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నారు. ఆయన డైరెక్టర్‌ పదవికి నామినేషన్‌ వేశారు. ఎస్‌వీ జగన్‌కు మద్దతుగా ప్రభుత్వ విప్‌ గంగుల ప్రభాకర్‌ రెడ్డి, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి తదితరులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి అవకాశం ఇవ్వాలని కోరారు. గత ఏడాది జరిగిన డైరెక్టర్ల ఎన్నికల్లో చైర్మన్‌ పదవిని ఆశించి రంగంలోకి దిగిన గంగుల కుటుంబీకుడు గంగుల విజయసింహారెడ్డి కూడా నామినేషన్‌ వేశారు. 


చైర్మన్‌ పదవిని భూమా కుటుంబం కూడా ఆశిస్తోంది. ఆ దిశగా దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుమారుడు విఖ్యాత్‌రెడ్డి, అఖిలప్రియ భర్త భార్గవరామ్‌.. భూమా నారాయణరెడ్డి మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భూమా నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరిగిన ఓ కిడ్నాప్‌ వ్యవహారంలో భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులపై కేసులు నమోదు అయ్యాయి. వారి అరెస్టులు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో డెయిరీ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియలో భూమా నారాయణరెడ్డి ఎలా వ్యవహరిస్తారోనన్న చర్చ సాగుతోంది.



Updated Date - 2021-01-19T06:07:32+05:30 IST