వానలే వానలు..!

ABN , First Publish Date - 2020-10-01T09:23:29+05:30 IST

దేశ ఆర్థిక, వ్యవసాయ రంగాలకు ఊతమిచ్చే నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిశాయి. నాలుగు నెలల సీజన్‌లో ఒక్క జూలైలో స్వల్ప లోటు తప్ప మిగిలిన 3నెలల్లో మిగులు వర్షపాతం నమోదైంది...

వానలే వానలు..!

  • ‘నైరుతి’లో పుష్కలంగా వర్షాలు
  • ముగిసిన రుతుపవనాల సీజన్‌
  • ఒక్క జూలైలోనే స్వల్ప లోటు 
  • 3 నెలల్లో మిగులు వర్షపాతం 
  • ఏపీలో 44 శాతం అధికం
  • కడపలో 110 శాతం ఎక్కువ 
  • సీమలో రికార్డు స్థాయిలో మిగులు 
  • శ్రీకాకుళంలో 25శాతం లోటు 

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

దేశ ఆర్థిక, వ్యవసాయ రంగాలకు ఊతమిచ్చే నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిశాయి. నాలుగు నెలల సీజన్‌లో ఒక్క జూలైలో స్వల్ప లోటు తప్ప మిగిలిన 3నెలల్లో మిగులు వర్షపాతం నమోదైంది. ఆగస్టులో కురిసిన వర్షాలకు దేశంలో అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న భారత వాతావరణ శాఖ అంచనా నిజమైంది. ఐఎండీ లెక్కల ప్రకారం నైరుతి సీజన్‌ జూన్‌ 1న ప్రారంభమై సెప్టెంబరు 30తో ముగుస్తుంది. బుధవారంతో ముగిసిన సీజన్‌లో దేశంలో 880.6 మి.మీ.కు గాను 957.6 మి.మీ. వర్షపాతం (సాధారణం కంటే 9ు ఎక్కువ) నమోదైంది. తూర్పు/ఈశాన్య భారతంలో 1,410.4 మి.మీ.కు 1,500.3 మి.మీ. (6ు ఎక్కువ), మధ్య భారతంలో 976.6 మి.మీ.కు 1,123.8 మి.మీ. (15ు ఎక్కువ), దక్షిణాదిన 726.2 మి.మీ.కు 939.9 మి.మీ. (29ు ఎక్కువ), వాయవ్య భారతంలో 599.5 మి.మీ.కు 505.3 మి.మీ. (16ు తక్కువ) వర్షపాతం నమోదైంది. అంటే ఒక్క వాయవ్య భారతంలో మాత్రమే తక్కువగా వర్షాలు కురిశాయు. 




ఏపీలో మిగులు వర్షపాతం 

నైరుతి సీజన్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు తప్ప రాష్ట్రంలో మిగులు వర్షాలు కురిశాయి. రాయలసీమ, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాలను వానలు ముంచెత్తాయు. వాతావరణ శాఖ లెక్కల మేరకు విజయనగరం, విశాఖ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనా పలు మండలాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. బుధవారంతో ముగిసిన సీజన్‌లో రాష్ట్రంలో 514.4కి 738.2 మి.మీ. (44 శాతం ఎక్కువ)తో మిగు లు వర్షపాతం నమోదైంది. కోస్తాలో 586.9 మి.మీ.కు 725.3 మి.మీ. (24శాతం ఎక్కువ), రాయలసీమలో 411.6కి 756.1 మి.మీ.(84శాతం ఎక్కువ) నమోదైంది. అత్యధికంగా కడపలో 110ు, అనంతలో 84, కర్నూలులో 74, చిత్తూరులో 70, నెల్లూరులో 58 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంలో 25 శాతం, విశాఖలో 8, విజయనగరంలో 6శాతం తక్కువగా నమోదైంది. 



‘ఈశాన్యం’లోనూ మంచి వర్షాలు

రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల సీజన్‌లోనూ సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షాలు కురవనున్నాయి. కోస్తాలోని ఎక్కువ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా, రాయలసీమ, కోస్తాల్లోని కొద్దిప్రాంతాల్లో మాత్రం సాధారణ వర్షాలు కురుస్తాయి. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు 3నెలలకు గాను ప్రపంచ వాతావరణ సంస్థ ముందస్తు వాతావరణ అంచనా నివేదిక విడుదల చేసింది. అక్టోబరు 15నుంచి ప్రారంభం కానున్న ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో దక్షిణాదిన కర్ణాటక, ఏపీ, కేరళలలో 332.1 మి.మీ., తమిళనాడులో 438.2 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కాగా, ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో వర్షాలు, ఇతర అంశాలపై ఐఎండీ త్వరలో బులెటిన్‌ విడుదల చేయనుంది. 


Updated Date - 2020-10-01T09:23:29+05:30 IST