చాణక్య నీతి: మనిషి ఓటమి ఇదే కారణం... ఈ ఒక్క లక్షణం మీలో ఉంటే విజయానికి చిరునామాగా మారుతారు!

ABN , First Publish Date - 2021-11-24T12:02:39+05:30 IST

కౌటిల్యునిగా ప్రసిద్ధి చెందిన ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రాన్ని రచించారు.

చాణక్య నీతి: మనిషి ఓటమి ఇదే కారణం... ఈ ఒక్క లక్షణం మీలో ఉంటే విజయానికి చిరునామాగా మారుతారు!

కౌటిల్యునిగా ప్రసిద్ధి చెందిన ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రాన్ని రచించారు. ఇందులో సమాజానికి మార్గనిర్దేశం చేయడానికి అనేక జీవన విధానాలను అందించారు. ఆచార్య చాణక్యుడు, గొప్ప ఆర్థికవేత్త, రాజకీయవేత్త, జ్ఞాన సంపన్నుడు, తన జీవన విధానాల బలంతో నంద వంశాన్ని నాశనం చేసి, సాధారణ బాలుడైన చంద్రగుప్త మౌర్యుని.. మగధ చక్రవర్తిగా చేశాడు. చాణక్యునికి సమాజంలోని దాదాపు అన్ని విషయాలపై లోతైన అవగాహన ఉంది. చాణక్యుని విధానాలు నేటి కాలంలో కూడా చాలా సందర్భోచితంగా ఉండడానికి ఇదే ప్రధాన కారణం. ఆచార్య చాణక్యుని విధానాలు వినడానికి కష్టంగా అనిపించినప్పటికీ, వాటిని ఆచరించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఓటమిని ఎదుర్కోడని చెబుతారు.  


చాణక్య నీతిలో ఆచార్య చాణక్య విజయానికి సంబంధించి అత్యంత కీలకమైన ఒక విషయాన్ని ప్రస్తావించాడు. ఓటమి అనేదానికి సరైన అర్థాన్ని అందించాడు. 'ఓటమి అంటే పడిపోవడం కాదు, లేవడానికి నిరాకరించినప్పుడే అది ఓటమి' అని చాణక్య స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్య ద్వారా ఆచార్య చాణక్య.. మనిషి ఓటమికి నిజమైన అర్థాన్ని వివరించాడు. ప్రతిమనిషి జీవితంలో కొన్నిసార్లయినా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. వీటిని చూసి కొందరు తమ ప్రయత్నాలను మధ్యలోనే విరమిస్తారు. ఇలాంటివారు ఎప్పుడూ తమ జీవితంలో విజయం సాధించలేరని, పడిపోయిన ప్రతీసారీ అటువంటి పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రయత్నించాలని చాణక్య చెబుతారు. అన్ని పరిస్థితులలోనూ మనిషి సానుకూల ఆలోచనలతో ఉండాలని, అన్ని కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని చాణక్య చెబుతారు. నిరంతరం ప్రయత్నాలు చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి నుంచి తప్పుకోకుండా ఉంటే, ఎప్పటికైనా మనిషి తన లక్ష్యాన్ని సాధిస్తాడని చాణక్య తన అనుభవం ద్వారా తెలియజేశారు. చాలామంది తమ పనిలో మొదటిసారి విజయం సాధించలేరు. వెంటనే నిరుత్సాహపడకుండా, మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. పడిపోయిన తర్వాత కూడా లేవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ధైర్యాన్ని వీడకుండా ప్రయత్నం సాగిస్తూనే ఉండాలని చాణక్య తెలిపారు. అప్పుడే విజయం సొంతమవుతుందని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-11-24T12:02:39+05:30 IST