కరోనా సెకండ్ వేవ్ : వర్క్‌ ఫ్రం హోం పొడిగించడంతో వీటికి భారీ డిమాండ్

ABN , First Publish Date - 2021-05-06T13:46:36+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని సమూలంగా మార్చివేసింది. ఐటీ రంగానికి సంబంధించిన

కరోనా సెకండ్ వేవ్ : వర్క్‌ ఫ్రం హోం పొడిగించడంతో వీటికి భారీ డిమాండ్

  • కరోనా.. తీరు మార్చింది
  • ఫర్నిచర్‌ రెంట్‌ సైట్లకు పెరిగిన తాకిడి
  • వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ఫర్నిచర్‌కే డిమాండ్‌
  • ఒకేసారి పెట్టుబడి పెట్టే అవకాశాలు 
  • లేకపోవడమే కారణమంటున్న ఉద్యోగులు
  • ప్యాకేజీలపై ప్రత్యేక రాయితీలనూ అందిస్తున్న సంస్థలు


కరోనా మహమ్మారి ప్రపంచాన్ని సమూలంగా మార్చివేసింది. ఐటీ రంగానికి సంబంధించిన వారే కాకుండా సాధారణ ఉద్యోగులు కూడా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. గత ఏడాది లాక్‌డౌన్‌ విధించినప్పుడు కొంతమంది మాత్రమే ఇంటి నుంచి పనిచేశారు. సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండడంతో చాలామంది వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. ఎప్పటికి సాధారణ పరిస్థితులు వస్తాయో తెలియకపోవడంతో అధిక శాతం మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇంటి నుంచి పనిచేయడంలో సౌకర్యం కోసమూ ఆరాటపడుతున్నారు. అలాంటి వారికి కావాల్సిన అవసరాలను తీరుస్తున్నాయి ఫర్నిచర్‌ ఆన్‌ రెంట్‌ వెబ్‌సైట్లు. ఆఫీసులో పనిచేసే రీతిలో సౌకర్యవంతమైన టేబుల్‌, వెన్నునొప్పి రాకుండా కుర్చీ, స్టడీ టేబుల్‌, ఆఫీస్‌ క్యుబికల్‌.. ఇలా విభిన్నమైన ఫర్నిచర్‌ను నేటి కాలపు యువత అవసరాలను తీరుస్తూ అందిస్తున్నాయి. ఖర్చుకు వెనుకాడని వారు నచ్చినంతకాలం వాడుకుని తర్వాత తిరిగి ఇచ్చేద్దామంటూ రెంట్‌ సైట్లకు క్యూ కడుతున్నారు. ఒక కుర్చీ కోసమే రూ. 8 వేలు వెచ్చించాల్సిన చోట నెలకు రూ. 800 ఖర్చుతో కుర్చీతోపాటు టేబుల్‌ కూడా వాడుకుంటూ ఆనందిస్తున్నారు.


హైదరాబాద్‌ సిటీ : కరోనా కారణంగా వర్క్‌ ఫ్రం హోం మరి కొంతకాలంపాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆఫీసు ఫర్నిచర్‌కు డిమాండ్‌ పెరిగిందని పలువురు చెబుతున్నారు. ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టా‌ప్‌లను అద్దెకు తీసుకుంటున్న వారెంత మంది ఉంటున్నారో అంతకు రెట్టింపు సంఖ్యలో కస్టమైజ్డ్‌ డెస్క్‌, కూచె్‌సను తీసుకుంటున్నారని ఫాబ్‌ రెంట్‌ ప్రతినిధులు అంటున్నారు. ఫర్‌లెంకో సంస్ధ ప్రతినిధులు కూడా ఇదే చెబుతున్నారు. వర్క్‌స్టేషన్‌లను కోరుకుంటున్న వారి సంఖ్య పెరిగిందని, అలాగే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాలంలో వెన్నునొప్పి రాకుండా ఆఫీస్‌ కుర్చీలను అద్దెకు తీసుకోవడం నగరంలో ఎక్కువగానే కనిపిస్తోందన్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పరంగా ఆఫీస్‌ ఫర్నిచర్‌కు డిమాండ్‌ పెరిగిందన్నది ఎంత వాస్తవమో, సౌకర్యవంతమైన ఫర్నిచర్‌ కోరుకునే వారు కూడా అంతే పెరిగారంటున్నారు రెంటికల్‌ సంస్థ ప్రతినిధులు. ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతుండడంతో సోఫాసెట్లు, బెడ్స్‌కు కూడా డిమాండ్‌ పెరిగిందంటున్నారు.


తక్కువ పెట్టుబడి.. ఎక్కువ సౌకర్యం

రెంటల్స్‌ వైపు అధికంగా దృష్టి సారిస్తున్నది యువతరమే. ఇప్పటికే చాలామంది తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. కొంతమంది మాత్రం ఆఫీసు నుంచి ఎప్పుడు కాల్‌ వస్తుందో తెలియదంటూ నగరంలోనే ఉండిపోయారు. ఇలాంటి వారితోపాటు నగరానికి చెందిన, ఆఫీస్‌ ఫర్నిచర్‌ కోసం పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేని నవతరం రెంటల్స్‌ వైపు చూస్తోంది. ఓ అంచనా ప్రకారం 35 సంవత్సరాల లోపు యువత ఈ తరహా ఫర్నిచర్‌ కోసం చూస్తుందంటున్నారు పలు సంస్థల ప్రతినిధులు. వాస్తవానికి ఈ రెంటల్స్‌లో ఉన్న సౌకర్యమే దీనిపట్ల ఆదరణ పెరగడానికి ప్రధాన కారణమంటున్నారు ఫర్‌లెంకో ప్రతినిధులు. వాస్తవం కూడా అదే అంటున్నారు ఓ ప్రైవేట్‌ సంస్థలో కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ ప్రతినిధిగా చేస్తోన్న అనుకృతి. ఆమె మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కారణంగా ఇంటి నుంచి /పనిచేయడం తాత్కాలిక పరిస్థితి. 


ప్రస్తుత పరిస్థితుల్లో రూ. 20-30 వేలు పెట్టుబడి పెట్టడం కష్టం. హోమ్‌ ఐసొలేషన్‌ పరిస్థితులు ఎదురైనప్పుడు సొంత ఫర్నిచర్‌ అధికంగా ఉంటే ఇబ్బందులూ ఎదురవుతుంటాయి. రెండు మూడు నెలలు అవసరం తీరిన తర్వాత ఆ ఫర్నిచర్‌ తిరిగి ఇచ్చేయవచ్చు. నగదు కూడా ఆదా అవుతుంది. అన్నిటికీ మించి ఎవరికీ ఇబ్బంది ఉండదు అని అన్నారు. ఎక్కువ మంది ఆలోచన కూడా ఇదే! ఇంట్లో సౌందర్యం కన్నా మన సౌకర్యమే ఇప్పుడు మిన్నగా తోస్తుంది. రోజూ ఏడెనిమిది గంటలు కుర్చీకి అతుక్కుపోవాల్సి వచ్చినప్పుడు సోఫాలు లేదంటే గెస్ట్‌ చైర్‌లలో కూర్చుని పనిచేయడం వల్ల వెన్ను సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అందుకే తాను ఆఫీస్‌ చైర్‌ తీసుకున్నానన్నారు ఓ ఐటీ కంపెనీ ఉద్యోగి రమణ.


ఫర్నిచర్‌ రెంట్‌కు తీసుకోవడానికి తొలి దశ కరోనా అనుభవాలు కారణమంటున్నారు కొంతమంది ఉద్యోగుల.  తొలి దశ లాక్‌డౌన్‌ కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారని, ఇప్పుడున్న పరిస్థితులు కూడా అంత అనుకూలంగా లేకపోవడంతో రిస్క్‌ తీసుకోవడం ఇష్టం లేని వారు రెంటల్స్‌పై మక్కువ చూపుతున్నారన్నారంటున్నారు. డిపాజిట్లు తక్కువగా, అద్దె కూడా అందుబాటులో ఉండటం, ఎక్కువ నెలలు అద్దెకు తీసుకుంటే అందుబాటులో ఉన్న ఆఫర్లు, వీలున్నప్పుడల్లా ఫర్నిచర్‌ మార్చుకునే అవకాశాలు కూడా ఈ రెంటల్స్‌ పట్ల మక్కువ పెరగడానికి కారణమని ఈ రంగంలోని నిపుణుల మాట. 

Updated Date - 2021-05-06T13:46:36+05:30 IST