Abn logo
Feb 1 2020 @ 21:47PM

విజయనిర్మల జడ్జిమెంట్‌.. లేడీ అమితాబ్ ఎంట్రీ...

సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో సూపర్‌స్టార్ కృష్ణ, విజయ నిర్మల అందరికన్నా ముందుంటారు. ఇక విజయనిర్మల జడ్జిమెంట్ గురించి చెప్పాలంటే, ఆమె దూరదృష్టి చాలా కచ్చితమని చాలాసార్లు రుజువైంది. ‘లేడీ అమితాబ్’గా పేరు తెచ్చుకున్న విజయశాంతి విషయంలో కూడా విజయ నిర్మల జడ్జిమెంట్ నూటికి నూరుశాతం వాస్తవమైంది.

 

సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా, స్వప్న హీరోయిన్‌గా ‘కిలాడీ కృష్ణుడు’ కొంత షూటింగ్ జరిగింది. ఈ చిత్రానికి దర్శకురాలు విజయ నిర్మల. కృష్ణకు గిరిబాబు అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఓ రోజు కృష్ణతో గిరిబాబు మాట్లాడుతూ ‘స్వప్న మీ పక్కన బాగుండదండి’ అన్నారు. ఆమెకు బదులు విజయశాంతి అయితే కృష్ణకు జోడీగా బాగుంటుందని సలహా ఇచ్చారు. వెంటనే ఆమెను పిలిపించమని గిరిబాబుకు కృష్ణ, విజయనిర్మల చెప్పారు.

 

విజయశాంతిని చూసిన కృష్ణ, ఆమె మరీ చిన్న పిల్లలా ఉందన్నారు. కానీ విజయనిర్మల మాత్రం ఆమెలో ఓ భావి నటీమణిని చూశారు. తనకు కాస్త సమయం ఇస్తే అందరికీ నచ్చేటట్లు, మెచ్చుకునేటట్లు విజయశాంతిని తయారు చేస్తానని కృష్ణకు చెప్పారు. చెప్పినట్లుగానే విజయ నిర్మల చేశారు. విజయశాంతికి డ్రెస్ మీద డ్రెస్ వేసి, కాస్త లావుగా కనిపించేలా చేసి, స్టిల్స్ తీయించారు. ఆ స్టిల్స్‌ చూసిన కృష్ణ మెచ్చుకున్నారు. ఆమెను ‘కిలాడీ కృష్ణుడు’లో హీరోయిన్‌గా అంగీకరించారు.

 

విజయనిర్మల జడ్జిమెంట్ తప్పలేదు. కిలాడీ కృష్ణుడి కోసం తాను ఎంపిక చేసిన విజయశాంతి 'లేడీ అమితాబ్' అని ప్రశంసలు పొంది గొప్ప నటిగా తెలుగు తెరపై వెలుగొందారు.

 

(యు.వినాయక రావు రాసిన ‘దేవుడులాంటి మనిషి’ సౌజన్యంతో...)

Advertisement
Advertisement
Advertisement