ఇది ప్రజాస్వామ్య జయకేతనం

ABN , First Publish Date - 2021-11-20T07:18:31+05:30 IST

సాగుచట్టాలను రూపొందించిన తీరు మన సమాఖ్య విధాన స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం.వాటిని ఆమోదింప చేసుకున్న తీరు పార్లమెంటు పవిత్రతను ధిక్కరించింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సత్యాగ్రహుల పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి మన సమున్నత గణతంత్ర రాజ్య సంస్థాపక ఆదర్శాలను ఉల్లంఘించింది....

ఇది ప్రజాస్వామ్య జయకేతనం

సాగుచట్టాలను రూపొందించిన తీరు మన సమాఖ్య విధాన స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం.వాటిని ఆమోదింప చేసుకున్న తీరు పార్లమెంటు పవిత్రతను ధిక్కరించింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సత్యాగ్రహుల పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి మన సమున్నత గణతంత్ర రాజ్య సంస్థాపక ఆదర్శాలను ఉల్లంఘించింది. కనుక సాగుచట్టాల ఉపసంహరణ సత్యానికి, సత్యాగ్రహ సమరానికి విజయం. నిరంకుశ పాలకుల దురహంకారంపై విజయం. ఇది అరుదైన గెలుపు. నియంతృత్వ పాలనపై ఇది ఘన విజయం.

మోదీ ప్రభుత్వం రద్దు చేసిన మూడు సాగుచట్టాలకు స్వేచ్ఛావిపణి ఆర్థికవేత్తలు మద్దతు నిచ్చారు. అవి రైతుల ఆదాయాన్ని, వ్యవసాయ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని వారు విశ్వసించారు. రైతులు కార్పొరేట్ కంపెనీల దోపిడీకి గురవుతారనే భయంతో వామపక్ష ఆర్థికవేత్తలు వాటిని వ్యతిరేకించారు అయితే నా దృష్టిలో, ఆ సాగుచట్టాలతో అసలు సమస్య వాటిలోని అంశాలతో ముడిపడి ఉన్నది కాదు. ఆ చట్టాలను రూపొందించి, పార్లమెంటులో ఆమోదింప చేసుకున్న తీరుతెన్నులే అసలు సమస్య అని నేను భావిస్తున్నాను ఆ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజ్వరిల్లిన రైతుల నిరసనోద్యమం పట్ల పాలకులు వ్యవహరించిన తీరు కూడా ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధంగా ఉంది. 


వ్యవసాయాన్ని రాష్ట్రాల జాబితాలోని అంశంగా భారత రాజ్యాంగం నిర్దేశించింది. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించకుండా ఆ చట్టాలను రూపొందించింది. చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాలను కూడా సంప్రదించలేదు! ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో తెలిసిన విషయమే కనుక ఆ చట్టాలను ప్రధానమంత్రి కార్యాలయమే రూపొందించి ఉంటుంది. ఈ ప్రక్రియలో కేంద్ర వ్యవసాయ మంత్రిని కూడా సంప్రదించి ఉండరనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోట్లాది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకోవడమనేది మొదటి నుంచీ మోదీ ప్రభుత్వ ప్రత్యేకత. అయితే మన దేశంలో పర్యావరణ వైవిధ్యం అపారంగా ఉన్న దృష్ట్యా వ్యవసాయ రంగానికి సంబంధించిన చట్టాల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడం వివేకవంతమైన చర్య కాదు, కాబోదు. నేల రకాలు, నీటి పారుదల వ్యవస్థలు, పంటసాగు పద్ధతులు మొదలైనవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధంగా ఉంటాయి. మరి అటువంటప్పుడు రాష్ట్రాలతో ఎలాంటి చర్చలు జరపకుండా కొత్త సాగు చట్టాలను ఎలా రూపొందించారు? 


సరే, ఆ చట్టాలకు సంబంధించిన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు సైతం సువ్యవస్థిత పద్ధతులకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించలేదు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను తూష్ణీంభావంతో చూసింది. వాటిని పార్లమెంటరీ కమిటీకి నివేదించి ఉండవలసింది. అలా చేసినట్టయితే ఆ కమిటీ వ్యవసాయ రంగ నిపుణులతో విస్తృతంగా చర్చించి ఆ బిల్లులను మరింత మెరుగుపరిచి ఉండేది. ఈ బిల్లుల విషయంలోనే కాదు, కోట్లాది ప్రజల జీవితాలలో మౌలిక మార్పులకు దోహదం చేసే ఏ బిల్లు విషయంలోనైనా పార్లమెంటరీ కమిటీలకు నివేదించడం లాంటి ముందు జాగ్రత్తచర్యలతో వ్యవహరించవలసి ఉంది. అటువంటి రీతిలో వ్యవహరించకపోవడమనేది మోదీ సర్కార్ స్వతస్సిద్ధ లక్షణం.


లోక్‌సభలో బీజేపీకి మెజారిటీ ఉన్నందున అక్కడ ఆ బిల్లులకు సులువుగా ఆమోదం లభించింది. అయితే ప్రతిపక్షాలకు గణనీయమైన ప్రాతినిధ్యమున్న రాజ్యసభలో పరిస్థితి వేరు. ఆ కారణంగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఆ బిల్లులపై చర్చే జరగకుండా చూశారు. మూజువాణీ ఓటుతో బిల్లులు ఆమోదం పొందాయని ప్రకటించారు. ఇలా అప్రజాస్వామికంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన పదవీగౌరవాన్ని కళంకపరిచారని చెప్పక తప్పదు. 


సాగుబిల్లులను ఎవరినీ సంప్రదించకుండా రూపొందించి, పార్లమెంటులో హడావిడిగా ఆమోదింప చేసుకోవడం పట్ల ఉత్తరాది రైతులలో తీవ్ర నిరసన వ్యక్తమయింది. రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతోను, వ్యవసాయరంగ ప్రముఖులతోను చర్చలు జరిపి సాగుబిల్లులను రూపొందించి, పార్లమెంటులో సమగ్రచర్చలతో ఆమోదించి ఉన్నట్టయితే రైతుల స్పందన భిన్నంగా ఉండేందుకు ఆవకాశముండేది. దీనికి తోడు అంబానీలు, అదానీలు వ్యవసాయ వాణిజ్యరంగంలో ప్రవేశించడం రైతులను భయాందోళనలకు గురి చేసింది. 


సాగుచట్టాలను ఆమోదించిన తీరు సమాఖ్య పాలనావిధానం, పార్లమెంటు పట్ల మోదీ ప్రభుత్వ తిరస్కార వైఖరికి అద్దం పట్టింది. దీంతో రైతులు సత్యాగ్రహ సమరానికి పూనుకోవడం అనివార్యమయింది. దేశ రాజధాని శివార్లలో తిష్ఠ వేశారు. అహింసాపద్ధతులలో వారు తమ నిరసనోద్యమాన్ని కొనసాగించారు. అయినా ప్రభుత్వం వారిపై తీవ్ర అణచివేతకు పూనుకున్నది. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన విధేయ మీడియా ఆ ఉద్యమకారులు ఖలిస్తానీవాదులని దుష్ప్రచారం చేసింది! సత్యాగ్రహులు ఏమీ చలించలేదు. చలిగాడ్పులను, వడగాడ్పులను ఓపిగ్గా భరించారు. ఈ క్రమంలో చాలామంది ఆరోగ్యాన్ని కోల్పోయి మరణించారు. అయిప్పటికీ ప్రభుత్వం మానవతాదృక్పథంతో స్పందించలేదు. కేంద్ర మంత్రులు రైతులతో పలుమార్లు సమావేశమై చర్చలు జరిపినా ఎటువంటి సత్ఫలితాలు సమకూరలేదు.


అన్నదాతలు అలా నెలల తరబడి అష్టకష్టాలకు లోనవుతూ నిరసనోద్యమాన్ని కొనసాగిస్తున్నా నరేంద్ర మోదీ బహిరంగంగా వారి గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. వారి సమస్యలను పూర్తిగా ఉపేక్షించారు. పైగా పార్లమెంటులో వారిని ‘ఆందోళన్‌జీవులు’ అని అపహసించారు. రైతుల నిరసన క్రమంగా దానికదే చల్లారిపోతుందని ఆయన ఆశించారు కానీ, అలా జరగలేదు. ఇంతలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో మోదీ ప్రభుత్వం మేల్కొంది. 


నవంబర్ 19 ఉదయం జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ కొత్త సాగుచట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. 75 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో 15వ నిమిషాన సాగుచట్టాల రద్దు ప్రకటన వెలువడింది. తన ఐదు దశాబ్దాల ప్రజాజీవితంలో రైతుల శ్రేయస్సుకు తాను ఏవిధంగా కృషి చేసిందీ ఆయన చెప్పుకొచ్చారు. ఏమైనా సాగుచట్టాల ఉపసంహరణ చాలా ప్రాధాన్యమున్న నిర్ణయమని చెప్పవచ్చు. ఎందుకంటే మోదీ అనేకసార్లు తన చర్యల ద్వారా అసంఖ్యాక ప్రజలను ఎనలేని కష్టనష్టాలకు గురి చేశారు. తన చర్యలు, నిర్ణయాలతో అసంఖ్యాకమైన అన్నదాతలు నానా అవస్థలకు గురి కావడం పట్ల ఆయన తన ప్రసంగంలో పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మోదీ ఇలా విచారం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి.


2002 గుజరాత్ మారణకాండను గుర్తుచేసుకోండి. మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఘోరం సంభవించింది. అయితే ఆయన ఎన్నడూ ఆ విషయమై ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదు. సంవత్సరాల అనంతరం ఒక విదేశీ పాత్రికేయడు ఆ మారణకాండ గురించి ప్రశ్నించినప్పుడు ఆ అల్లర్లలో మరణించిన వారి ప్రారబ్ధాన్ని ప్రమాదవశాత్తు కారు కింద పడి నలిగిపోయిన ఒక కుక్కపిల్ల దురవస్థతో పోల్చారు! ముఖ్యమంత్రిగాను, ప్రధానమంత్రిగాను తన నిర్ణయాలకు బాధితులయిన వారి విషయమై మోదీ ఎప్పుడూ ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదు, ఒక్క సానుభూతి వాక్యమూ మాట్లాడలేదు. 2016లో దేశ ఆర్థికవ్యవస్థను అతలాకుతలం చేసిన పెద్ద నోట్ల రద్దు విషయంలో గానీ, వలస కార్మికులను అంతులేని విషాదాలకు గురి చేసిన 2020లో లాక్‌డౌన్ విషయంలో గానీ మోదీ ఎప్పుడూ కించిత్ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. పెద్దనోట్ల రద్దుతో లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఆర్థికవ్యవస్థ తలకిందులై లక్షలాది కార్మికులు, ఉద్యోగులు వీధి పాలయ్యారు. అయినా మోదీ ఈ వాస్తవాన్ని గుర్తించడానికి నిరాకరిస్తూ వచ్చారు. పెద్దనోట్ల రద్దు దేశ ఆర్థికవ్యవస్థకు పెద్ద మేలు చేసిందని మోదీ, ఆయన మద్దతుదారులు ఇప్పటికీ వాదిస్తూనే ఉన్నారు. లాక్‌డౌన్ కాలంలో వలసకార్మికుల వెతలు ఇంకా దేశప్రజల స్మృతిలో పచ్చిగానే ఉన్నాయి. ఈ వాస్తవాలను గుర్తించినందువల్లే కాబోలు ప్రధాని మోదీ ఎట్టకేలకు తన పాత వైఖరులకు భిన్నంగా వ్యవహరించారు. జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో రైతులకు క్షమాపణలు చెప్పారు.


ఐదు సంవత్సరాల క్రితం ఇదే నవంబర్ మాసంలో ఒకరోజు రాత్రి ప్రధాని మోదీ ఆకాశవాణి, దూరదర్శన్ లో జాతి నుద్దేశించి ప్రసంగిస్తూ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పట్లో ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పెద్దనోట్ల రద్దుకు మోదీ పూనుకున్నారని పరిశీలకులు భావించారు. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రత్యర్థి పార్టీల ఆర్థికవనరులు నిర్వీర్యమైపోతాయనే భావనతోనే ఆయన అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారని భావించారు. ఈ నవంబర్‌లో కూడా అంతే నాటకీయరీతిలో సాగుచట్టాల ఉపసంహరణ నిర్ణయాన్ని యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే తీసుకున్నారనే భావన వ్యక్తమవుతోంది. రైతుల నిరసనోద్యమంలో పశ్చిమ యూపీకి చెందిన రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయానికి వారి మద్దతు తప్పనిసరి గనుకనే మోదీ సాగుచట్టాలను రద్దుచేశారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 


సాగుచట్టాల రద్దును నిరసిస్తున్నవారూ లేకపోలేదు. అయితే మంచి లక్ష్యాలను ఉత్తమమార్గాలలో సాధించాలన్న సత్యాన్ని మనం విస్మరించకూడదు. సాగుచట్టాలను రూపొందించిన తీరు మన సమాఖ్య విధాన స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. వాటిని ఆమోదింప చేసుకున్న తీరు పార్లమెంటు పవిత్రతను ధిక్కరించింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సత్యాగ్రహుల పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి మన సమున్నత గణతంత్ర రాజ్య సంస్థాపక ఆదర్శాలను ఉల్లంఘించింది. కనుక సాగుచట్టాల ఉపసంహరణ సత్యానికి, సత్యాగ్రహ సమరానికి విజయం. నిరంకుశ పాలకుల దురహంకారంపై విజయం. ఇది అరుదైన గెలుపు. నియంతృత్వ పాలనపై ప్రజాస్వామ్యానికి ఇది ఘన విజయం. బహుశా ఈ ప్రజాస్వామ్య విజయాన్ని తలకిందులు చేయవచ్చునేమో కాని అది ప్రజాసామ్యానికి ఒక విజయం అనడంలో సందేహం లేదు.



రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2021-11-20T07:18:31+05:30 IST