వెండితెరను చెంగుచెంగున ఆడించిన శివశంకర్‌ మాస్టర్‌ చరిత్ర

చెన్నపట్నం చిన్నోడు.. వెండితెరను చెంగుచెంగున ఆడించిన శివశంకర్‌ మాస్టర్‌ (72) ఇక లేరన్న వార్తతో అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్ విషాదంలో మునిగిపోయాయి. భారత దేశ చలన చిత్ర చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్న ఆయనని కరోనా వైరస్‌ మింగేసింది. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన కన్నుమూశారు. ఒక్కసారి ఆయన చరిత్రలోకి వెళితే.. 

పలు భాషా చిత్రాలకు నృత్య దర్శకత్వం

తమిళం, తెలుగు సహా 10కి పైగా భాషల సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల సినిమాలకు కూడా ఆయన కొరియోగ్రఫీ చేశారు. దాదాపు 800కు పైగా సినిమాలకు నృత్య దర్శకత్వం చేసిన శివశంకర్‌ మాస్టర్‌ 1996లో ‘పూవే ఉనక్కాగ’ అనే చిత్రానికి తమిళ రాష్ట్ర ప్రభుత్వ బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌ అవార్డు అందుకుని, 2008లో దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రంలోని ‘ధీర ధీర..’ పాటకు జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా 2003లో ధనుష్‌ హీరోగా వచ్చిన ‘తిరుడా తిరుడి’ చిత్రంలోని ‘మన్మథ రాసా’ అనే పాటకు ఆయన సమకూర్చిన సూపర్‌ ఫాస్ట్‌ నృత్యం సినీ ప్రేక్షకలోకాన్ని ఉర్రూతలూగించింది.

సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకుగాను బెంగుళూరులోని న్యూ ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఈయన కేవలం నృత్య దర్శకుడిగానే కాకుండా పలు చిత్రాల్లో నటించారు. ఈయనకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాలుగు అవార్డులు వరించాయి. 1996లో (పూవే ఉనక్కాగ), 2004లో (విశ్వతులసి), 2006లో (వరలారు), 2008లో (ఉలియిన్‌ ఓసై) తదితర చిత్రాలకు ఈయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నారు. అసిస్టెంట్‌గా చేరిన శివశంకర్‌ 1975లో వచ్చిన ‘పాట్టుం భరతముమ్‌’ అనే చిత్రానికి తొలిసారిగా నృత్య దర్శకుడు సలీం వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1980లో వచ్చిన ‘కురువికూడు’ అనే చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్‌గా మారారు. 


అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. కొరియోగ్రాఫర్‌గా 1983లో ప్రారంభమైన శివశంకర్‌ సినీ కెరీర్‌ 2013లో వచ్చిన ‘బాహుబలి’ వరకు కొనసాగింది. ఒక్క కొరియోగ్రాఫర్‌గానే కాకుండా, 2003 నుంచి ఆయన నటనపై కూడా దృష్టిసారించారు. వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులు కోకుండా, పాత్ర నిడివితో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా నటించారు. 2021లో వచ్చిన ‘ఎంగ ఇరుందీంగ ఇవ్వలవు నాలా’ అనే చిత్రంలో మాస్టర్‌ పాత్రను పోషించారు. తమిళంలో శివశంకర్‌ నటించిన చివరి చిత్రం ఇదే కావడం గమనార్హం. 


ప్యారీస్‌ బుడ్డోడు..

1948 సంవత్సరం డిసెంబరు 7వ తేదీన చెన్నైలోని గోవిందప్ప నాయకన్‌ వీధిలో తెలుగువారైన కళ్యాణ సుందరం, కోమల అమ్మాళ్‌ దంపతులకు శివశంకర్‌ జన్మించారు. ఈయన తల్లిదండ్రులు కొత్వాల్‌ చావడి మార్కెట్‌లో పండ్ల వ్యాపారం చేసే వారు. శివశంకర్‌ బాల్యమంతా వాళ్ళ పెద్దమ్మ వద్దనే సాగింది. ప్యారీస్‌లోని ప్రతి వీధీ తనకు పరిచయమేనని, అటువైపు వెళ్తే తన బాల్యమే గుర్తుకు వస్తుందని శివశంకర్‌ మాస్టర్‌ పలుమార్లు బహిరంగ వేదికలపై చెప్పారు. శివశంకర్‌ మాస్టర్‌కు చిన్న వయసులో వెన్నెముకకు దెబ్బతగిలింది. 


దీని నుంచి ఆయన సంపూర్ణంగా కోలుకునేందుకు కొన్ని సంవత్సరాలు పట్టింది. దీంతో ఎనిమిదేళ్ళపాటు ఆయన మంచానికే పరిమితమయ్యారు. ఏడాదిన్నర వయస్సున్న శివశంకర్‌ను ఒక రోజు పెద్దమ్మ ఒడిలో కూర్చొనివున్న సమయంలో ఒక ఆవు తాడు తెంపుకుని రోడ్లపైకి వచ్చింది. అది తమమీదికి వస్తుందన్న భయంతో శివ శంకర్‌ పెద్దమ్మ ఇంట్లోకి పరుగెత్తుతూ గుమ్మం వద్ద పడిపోయింది. ఆ సమయంలో శివశంకర్‌ కూడా కింద పడిపోయారు. అప్పుడే అతని వెన్నుపూసకు దెబ్బ తగిలింది. దీన్ని సరిచేసేందుకు ఎంతో మంది వైద్యులకు చూపించినా ఫలితం లేకుండా పోయింది. 


నయం చేసిన అయ్యర్‌ డాక్టర్

ఎంతో మంది వైద్యుల వద్దకు తీసుకెళ్ళినా శివశంకర్‌కు నయం కాలేదు. ఒక రోజున విదేశాల్లో చదివి.. వైద్యుడిగా చెన్నై వచ్చిన నరసింహ అయ్యర్‌ అనే వైద్యుడి దగ్గరకు శివ శంకర్‌ను అతని తల్లిదండ్రులు తీసుకెళ్ళారు. అపుడు ఆ బాలుడిని చూసిన డాక్టర్‌.. ఒక సలహా ఇచ్చారు. ఈ పిల్లాడిని మరో వైద్యుడి వద్దకు తీసుకెళ్ళకుండా తన వద్దే వదిలిపెడితే నయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఆ వైద్యుడి మాటలపై నమ్మకంతో శివశంకర్‌ను అక్కడ వదిలి వెళ్ళిపోయారు. అతని వద్దే శివశంకర్‌ దాదాపు ఎనిమిది సంవత్సరాలు మంచానికి పరిమిత మయ్యారు. చివరకు ఆ వైద్యుడు శివశంకర్‌ను నడిపించారు.


అతికష్టంమ్మీద ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాస్‌... 

శివశంకర్‌కు చదువు చెప్పించడానికి ఆయన తండ్రి కళ్యాణ సుందరం చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రత్యేకంగా ట్యూషన్లు కూడా పెట్టించారు. అయితే, వెన్నెముక గాయం కారణంగా ఇతర పిల్లలతో ఆడుకోవడానికి అవకాశం ఉండేది కాదు. శివశంకర్‌ ప్రాథమిక విద్యాభ్యాసం ఇంట్లోనే పూర్తయినా మాధ్యమిక విద్య మాత్రం స్థానిక షావుకారుపేటలోని హిందూ థియోలాజికల్‌ హయ్యర్‌ సెకండరీ స్కూలులో సాగింది. ఆ సమయంలోనే ‘సభ’ అనే సాంస్కతిక సంస్థ నిర్వహించే పలు కార్యక్రమాలపట్ల శివశంకర్‌ ఆకర్షితులయ్యారు.  

ఆ సంస్థ నిర్వహించే నాటకాలు, డ్యాన్సులు చేసేందుకు శివశంకర్‌ వెళ్ళేవారు. తమ కుటుంబానిది వ్యాపార రంగమైనప్పటికీ శివశంకర్‌ మాత్రం డ్యాన్స్‌ వైపే మొగ్గు చూపారు. ఒంటరిగా నృత్య సాధన చేస్తుండేవారు. అద్దం కనిపిస్తే చాలు.. దాని ముందు నిల్చొని డ్యాన్సులు చేస్తూ హావభావాలు పలికిస్తుండేవారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తయ్యాక మద్రాస్‌లోని నటరాజ శకుంతల అనే నృత్యకారుడి వద్ద శిష్యుడిగా చేరి శిక్షణ పొందారు. ఆ తర్వాత సినిమా డ్యాన్స్‌ మాస్టర్‌ సలీం వద్ద అసిస్టెంట్‌ గా చేరి, తదనంతరం పూర్తిస్థాయి కొరియోగ్రాఫర్‌గా మారారు. వెండితెరపై తన చిందును, నటనలో తన పసందును చిరస్థాయిగా చేసి కానరాని లోకాలకు పయనమైపోయారు. ఇదిలా వుండగా శివశంకర్‌ మృతిపట్ల టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన అనేక మంది ప్రముఖులు, హీరోలు, నృత్యదర్శకులు, నిర్మాతలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

Advertisement