ఏది గ్రాఫిక్స్‌? ఏది నిజం? మూడేళ్లలో పరిస్థితి ఇదీ!

ABN , First Publish Date - 2022-05-16T16:41:15+05:30 IST

డిగ్రీ, ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థులు, యువతలో నైపుణ్యాలు పెంపొందించి, ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య కళాశాలలు, నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కారు వచ్చిన కొత్తలో నిర్ణయించింది. 25 పార్లమెంటు..

ఏది గ్రాఫిక్స్‌? ఏది నిజం? మూడేళ్లలో పరిస్థితి ఇదీ!

నిర్మిస్తామన్న 30 స్కిల్‌ కాలేజీలు, 1 వర్సిటీ ఏవీ?

వైసీపీ సర్కారు వచ్చిన కొత్తలో భారీ ప్రచారం

సీఎం, మంత్రి, అధికారులు కలసి 100 సమీక్షలు 

మూడేళ్లవుతున్నా ఎక్కడా ఇటుక కూడా పడని వైనం 

మూడుసార్లు టెండర్లు పిలిచినా ఒక్కరూ రాని దుస్థితి

విపక్షంలో ఉన్నప్పుడు రాజధానిపై విష ప్రచారం 

ఇప్పుడు పాలిస్తున్న భవనాలను గ్రాఫిక్స్‌ అని ఎగతాళి

టీడీపీ చివరి మూడేళ్లలో రాజధానికి రూపురేఖలు

వైసీసీ మూడేళ్లలో కాలేజీలూ కట్టలేని దౌర్భాగ్యం


నాడు: అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, డీజీపీ కార్యాలయం, 14 అంతస్థుల ఏపీఐఐసీ భవనం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, ఉద్యోగులకు క్వార్టర్స్‌ నిర్మాణాలు.. అనేక రోడ్లు, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు.. టీడీపీ హయాంలో చివరి మూడేళ్లలో రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన అభివృద్ధి ఇది. కంటికి కనిపిస్తున్న దృశ్యం ఇది. అప్పుడు విపక్షంలో ఉన్న వైసీపీ నేతలు ఇదంతా గ్రాఫిక్స్‌ అని ఎగతాళి చేశారు. అధికారంలోకి వచ్చాక అమరావతిని అటకెక్కించారు.  


నేడు:  ‘రాష్ట్రంలో 30 నైపుణ్య కళాశాలలు, ఒక నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం’.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో పెద్దఎత్తున చేసిన ప్రచారమిది. ఇందుకోసం 100 సమావేశాలు నిర్వహించారు. ఏకంగా సీఎం జగన్‌ 30 సమీక్షల్లో పాల్గొన్నారు. దాదాపు మూడేళ్లు గడిచిపోయింది. సీన్‌ కట్‌ చేస్తే.. ఒక్క ఇటుక కూడా పడలేదు. ‘వైఎస్సార్‌ సెంటర్స్‌’గా పేరు పెట్టిన ఈ కాలేజీలు కేవలం గ్రాఫిక్స్‌లోనే మిగిలిపోయాయి. జగన్‌ సర్కారు చెప్పిన నైపుణ్య కాలేజీల నిర్మాణ పరిస్థితి ఇదీ. వైసీపీ నేతలు చెప్పినట్టు ఏది గ్రాఫిక్స్‌? ఏది నిజం?


(అమరావతి-ఆంధ్రజ్యోతి): డిగ్రీ, ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థులు(Engineering‌ college students), యువతలో నైపుణ్యాలు పెంపొందించి, ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య కళాశాలలు, నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కారు(YCP Government) వచ్చిన కొత్తలో నిర్ణయించింది. 25 పార్లమెంటు నియోజకవర్గ స్థానాల్లో  25 నైపుణ్య కళాశాలలు, 4 ఐఐఐటీల వద్ద 4 కళాశాలలు, పులివెందులలో ఒకటి.. మొత్తం 30 నిర్మించాలని ప్రతిపాదించింది. అదేవిధంగా తిరుపతిలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో కేవలం 4-5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి, మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వం పని. ఈ మొత్తం ప్రాజెక్టుకు సుమారు రూ.460 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఆ మొత్తం బ్యాంకుల నుంచి రుణాల రూపంలో తీసుకోవాలని నిర్ణయించారు. ప్రభు త్వం భూమి, మౌలిక సదుపాయాలు కల్పించనుండటం.. ఒక్కో నైపుణ్య కళాశాల ఒక్కో దిగ్గజ పరిశ్రమతో కలిసి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది కాబట్టి రుణం తేలిగ్గానే లభించాలి. పైగా ఇవి స్వయం సమృద్ధితో నడిచేలా ఏర్పాటు చేయాలని భావించారు. దీంతో ఈ కాలేజీలను ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదు. ఇందుకోసం అధికారులు పదుల కొద్దీ సమావేశాలు నిర్వహించారు. సంబంధిత మంత్రి 30 సమావేశాలు పెట్టుంటారు. సీఎం కూడా దీనిపై ఒక 30 సమావేశాల్లో పాల్గొన్నారు. అదిగో, ఇదిగో అన్నారు. 2021 నాటికి ప్రారంభిస్తామన్నారు. ఆ తర్వాత 2022లో అన్నారు. చిత్రం ఏంటంటే.. ఇప్పటికి కనీసం నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాలేదు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే పలు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో స్కిల్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేశారు. ఈ నైపుణ్య కళాశాలల నిర్మాణానికి ప్రభుత్వం మూడుసార్లు టెండర్లు పిలిచింది. ఒక్కరంటే ఒక్క కాంట్రాక్టరు కూడా ముందుకు రాలేదు. రుణాల కోసం దేశంలో ఎన్ని బ్యాంకులున్నాయో అన్నిటితోనూ మాట్లాడారు. కొన్ని బ్యాంకులు అంగీకరిస్తే, మరికొన్ని ఇవ్వనన్నాయి. ముందుకొచ్చిన బ్యాం కర్లను ఎంపిక చేశారు. బ్యాంకర్లతో సమావేశాలు, కలెక్టర్లతో సదస్సులు, పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు.. ఇలా ఏవేవో చేశామని భారీగా ప్రకటనలిచ్చారు. సీఎం కూడా స్వయం గా ప్రకటించారు. కాలేజీలన్నింటినీ 2021లోనే ప్రారంభిస్తామన్నారు. ఫలితం ఎక్కడేసిన గొం గళి అక్కడే అన్నట్టుగా ఉంది. టెండర్లు పిలిస్తే ఎవరూ రానందున, ప్రత్యామ్నాయ పద్ధతిలో వెళ్తామని చెబుతున్నారు. మూడేళ్లకాలంలో అక ్కడక్కడా కట్టాల్సిన నైపుణ్య కళాశాలలకు పునాది కూడా పడని దుస్థితి. ఈ నైపుణ్య కళాశాలలకు వైఎస్సార్‌ సెంటర్స్‌ అని పేరు పెట్టారు. అంటే యూత్‌ స్కిల్‌ రిజువనేషన్‌ కేంద్రాలట. ఆ పేరుతో ఒక భవనం, ఒక గ్రాఫిక్స్‌ కూడా సిద్ధం చేశారు. మూడేళ్లవుతున్నా నైపుణ్య కళాశాలలు గ్రాఫిక్స్‌లోనే మిగిలాయి. 


రాజధానిలో అభివృద్ధి ఇదీ..: 

టీడీపీ హయాంలో రాజధాని నిర్ణయం, రైతుల నుంచి భూసమీకరణ ప్రక్రియకు రెండేళ్లు పట్టింది. మిగిలిన మూడేళ్లలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యేలకు ఇళ్లు, న్యాయమూర్తులకు ఇళ్లు, ఉద్యోగుల క్వార్టర్స్‌కు సంబంధించిన భారీ నిర్మాణాలు చేపట్టారు. రాజధాని ప్రాంతంలోనే అద్భుతమైన డీజీపీ కార్యాలయం, 14 అంతస్థుల ఏపీఐఐసీ భవనం నిర్మించారు. అప్పుడు పూర్తిచేసిన సచివాలయ బ్లాకుల్లోనే రాజధాని నడుస్తోంది. అసెంబ్లీసమావేశాలు జరుగుతున్నాయి. ఏపీఐఐసీ కార్యాలయంలో 10 కార్యాలయాలు సౌకర్యవంతంగా పనిచేస్తున్నాయి. అంతేకాదు.. రాజధానిలో రోడ్ల నిర్మాణం ప్రారంభమైంది. 1690 ఎకరాల్లో స్టార్టప్‌ ప్రాజెక్టు కోసం సింగపూర్‌ దేశంతో కన్సార్షియం ఏర్పాటు చేసి ముందుకెళ్లేందుకు ఒప్పందం చేసుకున్నారు. కానీ, వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించారు. టీడీపీ హయాంలో చివరి మూడేళ్ల కాలంలో రాజధానిలో ఇంత అభివృద్ధి జరిగితే వైసీపీ నేతలు గతంలో అంతా గ్రాఫిక్స్‌ అన్నారు. ఇప్పుడు అదే మూడేళ్లలో అక్కడొకటి అక్కడొకటి కట్టాల్సిన నైపుణ్య కళాశాలలకు ఒక్క ఇటుకా వేయలేదు. చిన్నపని కూడా చేయలేని వాళ్లు రాజధానిపై మాట్లాడతారా? అని వైసీపీ నేతలపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-05-16T16:41:15+05:30 IST