ఇళ్ల పట్టాల కోసం ఇదేమి విధ్వంసం

ABN , First Publish Date - 2020-02-20T10:58:56+05:30 IST

జిల్లాలో పేదలకు ఇళ్ళ పట్టాలిచ్చే పేరిట అధికార యంత్రాంగం నిబంధనలకు పాతర వేస్తోంది. పలుచోట్ల పేదలకు గతంలో ఇచ్చిన వ్యవసాయ భూములను ఇళ్ళ స్థలాల కోసం తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు.

ఇళ్ల పట్టాల కోసం  ఇదేమి విధ్వంసం

జిల్లాలో అస్తవ్యస్తంగా ఇళ్ళ స్థలాల ఎంపిక


 (ఆంధ్రజ్యోతి,తిరుపతి):  జిల్లాలో పేదలకు ఇళ్ళ పట్టాలిచ్చే పేరిట అధికార యంత్రాంగం నిబంధనలకు పాతర వేస్తోంది.  పలుచోట్ల పేదలకు గతంలో ఇచ్చిన వ్యవసాయ భూములను ఇళ్ళ స్థలాల కోసం తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ క్రమంలో నిబంధనలు పాటించడం లేదు. పేదల సౌకర్యాన్నీ పట్టించుకోవడం లేదు. అటవీ భూములను, కొండ గుట్టలను, నీటి కుంటలను లే అవుట్లుగా మార్చేస్తుండడం ద్వారా పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేస్తున్నారు. 1.07 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలివ్వడానికి 2291 ఎకరాల భూమి కావాల్సి వుండగా ఇప్పటివరకూ 1927 ఎకరాలు గుర్తించారు. ఈ భూములు 1146 ప్రాంతాల్లో విస్తరించి వున్నాయి. వీటిలో ఐదువందలకు పైగా ప్రాంతాలు కొండగుట్టలే. వీటిని కనుమరుగు చేస్తుండడంతో పర్యావరణ విధ్వంసం సాగుతోంది. మరోవైపు భూముల చదును పేరిట రూ. కోట్లల్లో ప్రజా ధనం దుర్వినియోగం జరుగుతోందన్న విమర్శలూ వస్తున్నాయి.


చదళ్ళ గ్రామంలో సాగునీటి కుంట ఖతం! 

పుంగనూరు మండలం చదళ్ళ గ్రామంలో పేదలకు ఇళ్ళ పట్టాలిచ్చేందుకు రెవిన్యూ అధికారులు ఆ గ్రామ సర్వే నంబరు 273-5లో మొత్తం 2.42 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. ఆ భూమిని గ్రామస్తులు చెత్త దిబ్బలు వేసేందుకు తరతరాలుగా వాడుతున్నారు. ఇళ్ళస్థలాలకు ఆ భూమిని ఇచ్చేది లేదని ఊరి జనం అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల సాయంతో రెవిన్యూ అధికారులు యంత్రాలు వినియోగించి చదును చేశారు. పట్టు వదలని గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో దాన్ని వదలిపెట్టిన అధికారులు గ్రామంలోని నీటి ఆధారమైన చదళ్ళ కుంటకు ఎసరు పెట్టారు. కుంటను చదును చేసి ఇళ్ళ స్థలాలిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.


హైకోర్టు తలుపు తట్టిన గుర్రంకొండ బాధితులు


గుర్రంకొండలో 315మందికి ఇళ్ళ స్థలాల కోసం ఐదెకరాల భూమిని గుర్తించారు. ఇందులో ఆదెమ్మ, శ్రీనివాసులు అనే  రైతుల కుటుంబాలు గత 40 ఏళ్ళుగా పంటలు సాగు చేసుకుంటున్నాయి. వ్యవసాయ బోరు బావులే కాదు చివరికి వారి కుటుంబీకుల సమాధులు కూడా ఆ భూమిలో వున్నాయి. వారికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే రెవిన్యూ అధికారులు భూమిని చదును చేసేశారు. కడుపు మండిన రైతుల కుటుంబాలు తమ భూమిని దక్కించుకునేందుకు హైకోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాలతో తాత్కాలికంగా వారి భూములు లే అవుట్లు కాకుండా ఆగాయి.


ఎగువ పాలకూరులో హైస్కూలు ఆట స్థలం కనుమరుగు

పూతలపట్టు మండలం ఎగువ పాలకూరులో పేదలకు ఇళ్ళ స్థలాలిచ్చేందుకు అధికారులకు అక్కడి జడ్పీ హైస్కూలు ఆటస్థలం తప్ప మరేమీ కనిపించలేదు. స్కూలు ఆట స్థలాన్ని రెవిన్యూ అధికారులు పేదలకు ఇళ్ళ స్థలాల కోసం ఎంపిక చేశారు. అదే తడవుగా స్థానిక అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగి ఆ భూమిలోని విలువైన టేకు, చింత చెట్లకు నిప్పు పెట్టి కాల్చేశారు. వేళ్ళతో సహా వాటిని పెకలించేశారు. అధికారులు భూమిని చదును చేసి పట్టాలిచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న వారు లేరు.


లింగాపురం స్కూలు ఆటస్థలానికీ అదే గతి!

వి.కోట మండలం బోయచిన్నాగనపల్లె పంచాయతీ లింగాపురంలో పేదలకు ఇళ్ళ పట్టాలిచ్చేందుకు స్కూలు స్థలం తప్ప అధికారులకు ప్రత్యామ్నాయం కనిపించలేదు. ప్రభుత్వ ఒత్తిడితో విచక్షణ మరిచిన అధికారులు జడ్పీ హైస్కూలు ఆటస్థలంలో ఇళ్ళ స్థలాలకు లే అవుట్‌ వేశారు.   పూర్వ విద్యార్థులు మొదలుకుని గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వరకూ అందరూ అభ్యంతరం చెబుతున్నా అధికారులు వినిపించుకోవడం లేదు.


ఊరిక్కడ.... లే అవుట్‌ ఎక్కడో !

మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని పేదలకు ఇళ్ళ స్థలాలిచ్చేందుకు అధికారులు వలసపల్లె పంచాయతీలో పదెకరాలు గుర్తించారు. ఆ భూమిలో వలసపల్లెవాసుల సమాధులున్నాయి.వాటిని మినహాయించి మిగిలిన భూమిని లే అవుట్‌ గా మార్చేశారు.అంతా బాగానే వుంది కానీ కొత్తపల్లె పేదలకు ప్రతిపాదిత ఇళ్ళస్థలాల దూరం కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే. ఉన్న ఊరిని, పంట పొలాలను విడిచిపెట్టి అంతదూరం పోవడానికి లబ్ధిదారులు ససేమిరా అంటున్నారు.


మంగళంలో అటవీ భూమి గతేమవుతుందో!

తిరుపతి నగరంలోని పేదలకు ఇళ్ళ స్థలాలిచ్చేందుకు రెవిన్యూ అధికారులకు ఎక్కడా భూములు దొరకలేదేమో మంగళంలోని అటవీ శాఖ భూములపై పడ్డారు. 50 ఎకరాల భూమిని ఆ శాఖకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా స్వాధీనం చేసుకున్నారు. రికార్డుల్లో భూమి తమ శాఖ పేరిట వుందని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఎవరూ వినిపించుకోవడం లేదు. ఆ భూమిలో ఎర్రచందనం సహా విలువైన ఇతర వృక్షాలెన్నో వున్నాయి. ఇపుడు వాటితో పాటు ఆ భూమి భవితవ్యం అధికార పార్టీ నేతల చేతుల్లో వుంది.


ములకలచెరువు పేదల సౌకర్యం పట్టించుకునేదెవరు?

ములకలచెరువు మండల కేంద్రంలోని పేదలకు ఇళ్ళ స్థలాల కోసం రెండున్నర కిలోమీటర్ల దూరంలో దండుదారిపల్లె గుట్టను చదును చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇళ్ళ స్థలాలు తీసుకోవడానికి, ఇళ్ళు కట్టిస్తే నివాసముండడానికి లబ్ధిదారులు ఇష్టపడడం లేదు. ప్రభుత్వమిచ్చే ఒకటిన్నర సెంటు స్థలం కోసం ఉన్న ఊరిని విడిచిపెట్టి అంతదూరం పోవడానికి లబ్ధిదారులు సిద్ధంగా లేరు. కానీ వారి సౌకర్యం గురించి ఆలోచించే పరిస్థితుల్లో రెవిన్యూ అధికారులు లేరక్కడ.


Updated Date - 2020-02-20T10:58:56+05:30 IST