ఏటా 10 లక్షల మంది ప్రాణాలు తీస్తున్న సమస్య ఇది

ABN , First Publish Date - 2021-10-14T21:52:43+05:30 IST

గాలి కాలుష్యం విషయంలో మన దేశ పరిస్థితి

ఏటా 10 లక్షల మంది ప్రాణాలు తీస్తున్న సమస్య ఇది

న్యూఢిల్లీ : గాలి కాలుష్యం విషయంలో మన దేశ పరిస్థితి గత ఏడాది కన్నా కాస్త మెరుగుపడింది. అయితే ప్రపంచంలో గాలి కాలుష్యం అత్యంత దయనీయ స్థితిలో ఉన్న 30 ప్రాంతీయ నగరాల్లో 22 నగరాలు మన దేశంలోనే ఉన్నాయి. ప్రపంచంలో 15 అత్యంత కాలుష్య ప్రాంతీయ నగరాల్లో 14 నగరాలు మన దేశానికి చెందినవే. రవాణా, విద్యుదుత్పత్తి, వంట చెరకు దహనం, పరిశ్రమలు, వ్యర్థాల దహనం, నిర్మాణ రంగం, వ్యవసాయ వ్యర్థాల దహనం మన దేశంలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు. ఈ వివరాలను ప్రపంచ వాయు నాణ్యత నివేదిక (డబ్ల్యూఏక్యూఆర్) వెల్లడించింది. 


పురుషులపై ఎక్కువ ప్రభావం

ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ ప్రపంచంలో అత్యంత కలుషిత ప్రాంతీయ నగరం. ప్రపంచంలో అత్యంత కలుషిత రాజధాని నగరంగా న్యూఢిల్లీ నిలిచింది. వాయు కాలుష్యం వల్ల సంవత్సరానికి దాదాపు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అంచనా. మన దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 30 శాతానికి కారణం పర్యావరణ ప్రభావమేనని వెల్లడైంది. పరిసరాల్లోని వాయు కాలుష్యం ప్రభావం ప్రజారోగ్యంపై అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణుల అధ్యయనాల్లో వెల్లడైంది. డబ్ల్యూహెచ్ఓ 2016 మీడియన్ ఇయర్ నివేదిక ప్రకారం, పరిసరాల్లోని వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్న మరణాలు చైనా తర్వాత భారత దేశంలో అధికంగా ఉన్నాయి. పురుషులు తమ ఇళ్ల నుంచి దూరంగా వెళ్ళి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి మహిళల కన్నా ఎక్కువగా పురుషులు వాయు కాలుష్యానికి గురవుతూ, ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడైంది.


కలుషిత గాలి వల్ల వచ్చే వ్యాధులు ఏమిటంటే...

గ్రీన్‌హౌస్ వాయువులను అధికంగా విడుదల చేసే 15 దేశాల్లో ప్రజారోగ్యంపై వాయు కాలుష్యం మూల్యం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4 శాతానికిపైగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది. డబ్ల్యూహెచ్ఓ 2016 మీడియన్ ఇయర్ డేటా ప్రకారం, భారత దేశంలో పరిసర వాయు కాలుష్యం వల్ల ప్రతి 1 లక్ష జనాభాకు 82 మంది మరణిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే 10,87,000 మంది పరిసరాల్లోని గాలి కాలుష్యం వల్ల మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో డబ్ల్యూహెచ్ఓ సభ్య దేశాల్లో మన దేశం 12వ స్థానంలో ఉంది. గాలి కాలుష్యం వల్ల గుండె జబ్బులు, శ్వాస సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల కేన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఢిల్లీ వంటి కలుషిత నగరాల్లో జన్మించిన బిడ్డలకు ఈ వ్యాధుల భయం ఎక్కువగా ఉంటుంది. 


భారత ప్రభుత్వ చర్యలు 

గాలి కాలుష్యాన్ని అరికట్టేందుకు భారత ప్రభుత్వం కొన్ని చర్యలను అమలు చేస్తోంది. ఢిల్లీ నగరంలో గాలి కాలుష్య నిర్వహణ కోసం అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఢిల్లీ కోసం సమగ్ర వాయు ప్రణాళికను రూపొందించింది. 122 నాన్ అటైన్‌మెంట్ నగరాల్లో ప్రతిదానికి ప్రత్యేకంగా ప్రణాళికను అమలు చేస్తోంది. జాతీయ శుద్ధ వాయు పథకాన్ని అమలు చేస్తోంది. ఈ చర్యల వల్ల మెరుగైన ఫలితం కనిపిస్తోంది. అయితే వాయు కాలుష్యాన్ని నిరోధించేందుకు సమగ్ర వ్యూహం అవసరం.


Updated Date - 2021-10-14T21:52:43+05:30 IST