శతక సాహిత్యం పునర్మూల్యాంకనకు ఇది తరుణం

ABN , First Publish Date - 2020-11-09T06:47:18+05:30 IST

తెలుగులో శతక సాహిత్యానికి వెయ్యేళ్ళు పైబడిన సాహిత్య చరిత్ర వుంది. ఏ పద్యా నికాపద్యం స్వతంత్రంగా నిలబడి సార్వ త్రిక సత్యాలనో...

శతక సాహిత్యం పునర్మూల్యాంకనకు ఇది తరుణం

పద్యం కష్టజీవి అయిన పల్లెవాసి జీవితాన్ని వివరించడానికైనా వాడవచ్చు లేదా దుష్టుడైన రాజును కీర్తించడానికైనా వాడవచ్చు. అది ఆ పద్యం రాసిన కవికున్న పరిమితుల మీద లేదా ఆ కవి స్వభావం మీద ఆధారపడి వుంటుంది. అంటే వస్తువు, వస్తు స్వభావమనేది ప్రక్రియతో ముడిపడాల్సిన అవసరం లేదు. కనుక ఈ ప్రక్రియను రాచరిక వ్యవస్థ దుర్గుణాలకు ప్రతీకగా పరిగణించక్కరలేదు. ఒక పద్యం అనాగరిక వస్తువుతో ఉన్నదంటే అందుకు అభిశంసించాల్సింది ఆ కాలపు రాచరిక వ్యవస్థనూ, ఆ కవికి లేని పోరాట గుణాన్ని మాత్రమే.


తెలుగులో శతక సాహిత్యానికి వెయ్యేళ్ళు పైబడిన సాహిత్య చరిత్ర వుంది. ఏ పద్యా నికాపద్యం స్వతంత్రంగా నిలబడి సార్వ త్రిక సత్యాలనో, మానవ ప్రవర్తననో విశ్లేషిస్తూ, చురకలేస్తూ ఎంతోకొంత మార్గనిర్దేశనం చేయడం ఈ శతక సాహిత్యంలో కనబడుతుంది. ఈ ప్రక్రి యలో పద్యకర్తలు పద్యంలోని చివరి పాదాన్ని మకుటంగా వాడడమో లేదా పద్యం చివరి మాటను తమ కేతనంగా వాడడమో లేదా చివరి పాదం సగ భాగాన్ని దీనికి వినియోగించడమో ఆన వాయితీగా వస్తోంది. వందకు పైబడిన పద్యాలువుంటే, సాంప్రదా యబద్ధంగా అయితే నూటపదహారు పద్యాలు ఉంటే, దాన్ని శతకంగా పిలవడం కద్దు. అయితే వస్తు పరమైన సూచన చేయడమో లేదా నిర్మాణపరమైన వైవిధ్యాన్నో సారూప్యాన్నో సూచించడమో కాకుండా- కేవలం పద్యాల సంఖ్య ఆధారంగా ఈ సాహితీ ప్రక్రియకు నామకరణం చేయడం గురించి ఆలోచిస్తే ఆశ్చర్యంగా వుంది. కాకతాళీయంగానో, హడావుడిగానో తొలుత నామకరణం జరిగి వుండవచ్చు! 


తెలుగులో పద్యానికి వెయ్యేళ్ళ చరిత్ర ఉన్నట్టే, శతక పద్యాలకు కూడా దాదాపు అంతే చరిత్ర వుంది. అచ్చు యంత్రం, కాగితం, కలం రాకపూర్వం రూపొందించబడిన ప్రక్రియ తెలుగు పద్యం. గ్యూటెన్‌బెర్గ్‌ 1456 ఆగస్టు 24న అచ్చు యంత్రం ఆధారంగా తొలి పుస్తకం ముద్రించాడు. 1476లో విలియం కాక్స్‌టన్‌ ఇంగ్లండ్‌లో వాణిజ్యపరమైన అచ్చు వసతులు రూపొందించగలిగాడు. ఇదంతా సాంస్కృతిక పునరుజ్జీవనం తర వాత జరిగిన వ్యవహారం. దీనికి ఐదారు శతాబ్దాల ముందు తెలుగు పద్యం బయల్దేరింది. దానికి ముందే పద నిర్మాణం, వాక్యం, వ్యాకరణం, ఛందస్సు వంటివి రూపుది ద్దుకుని వుంటేనే ఈ పద్య సాహిత్య కృషి సాధ్య మయి వుంటుంది. అప్పటి పరిమితులతో పరిశీ లిస్తే పద్యం అనేది నాటి చారిత్రక అవసరం. రాసుకునే సౌలభ్యాలు, దాచుకునే వెసులుబాట్లు, ఏమాత్రమూలేని కాలమది. తాళపత్రాలు అందరికీ అందుబాటులో లేని కాలం కూడా అదే. కనుకనే సులువుగా గుర్తుపెట్టుకుని, మననం చేసుకుని, అవసరమైనప్పుడు సులువుగా వ్యక్తీకరించగలిగే సౌలభ్యం పద్యం ద్వారా లభించింది. గుర్తుపెట్టుకో వడానికి ఛందస్సు దోహదపడుతుంది. కనుక పద్య ప్రక్రియను ఆ దృష్టికోణంలో పరిగణించాలి. 


పద్యం కష్టజీవి అయిన పల్లెవాసి జీవితాన్ని వివరించడానికైనా వాడవచ్చు లేదా దుష్టుడైన రాజును కీర్తించడానికైనా వాడవచ్చు. అది ఆ పద్యం రాసిన కవికున్న పరిమితుల మీద లేదా ఆ కవి స్వభావంమీద ఆధారపడి వుంటుంది. అంటే వస్తువు, వస్తుస్వభావమనేది ప్రక్రియతో ముడిపడాల్సిన అవసరం లేదు. కనుక ఈ ప్రక్రియను రాచరిక వ్యవస్థ దుర్గుణాలకు ప్రతీకగా పరిగణించక్కరలేదు. ఒక పద్యం అనాగరిక వస్తువుతో ఉన్నదంటే అందుకు అభిశంసించాల్సింది ఆ కాలపు రాచరిక వ్యవస్థనూ, ఆ కవికి లేని పోరాట గుణాన్ని మాత్రమే. వస్తుపరంగా అవాంఛనీయమైనవి మనం ఆదరిం చనక్కరలేదు, నెత్తినపెట్టుకోనక్కరలేదు. అదే సమ యంలో మొత్తం పద్య ప్రక్రియనే ఖండించడం సబబు కాదు. 


ఆధునిక కాలంలో జంధ్యాల పాపయ్య శాస్త్రి, గుర్రం జాషువా, నార్ల వెంకటేశ్వరరావు, అంతకు ముందు చిలకమర్తి లక్ష్మీనరసింహం, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి సృజించిన పద్యాలను పరిశీలిస్తే, ఎంతటి సృజనాత్మకత అయినా ఇక్కడ కూడా సాధ్యమవుతుందని బోధపడుతుంది. వ్యర్థ పదాలు పద్యంలో చోటు చేసుకోవడం గురించి ఎదురయ్యే విమర్శను ఆ కవుల అసమర్థత గానే పరిగణించాలి. అదే సమ యంలో వచన కవితల్లో, కథల్లో, నవలల్లో, నాటకాల్లో కూడా వ్యర్థ పదాలు ఎన్నింటినో ఎంతోమంది రచనల నుంచీ చూపించవచ్చు. కనుక కవి లేదా రచయిత సామర్థ్యాన్ని ప్రక్రియతో ముడివే యడం అర్థరహితం.


పద్యం మరో లక్షణం దాని సంగీత ధర్మం. యతి, ప్రాస, లయ, తూగు ఇలా పలురకాలుగా పిలు వబడే శ్రావ్యతను పద్యంలో సులువుగా సాధించవచ్చు. ఈ ధర్మం కారణంగానే పద్యానికి నడక, వినడంలో సొంపు అలవడుతోంది. మనం అనుకునే అక్షరాస్యత అసలు లేని ఎంతోమంది గయోపాఖ్యానం లోని పద్యాలను, రాయబారం పద్యాలను, సత్యహరిశ్చంద్రలో కొన్ని సన్నివేశాల్లోని పద్యాలను, పోతన పద్యాలను సులువుగా గుర్తుంచు కున్నారు, నోరారా పాడి ఆనంది స్తున్నారు. ఈ సంగీత ధర్మం కారణంగానే పద్యం ప్రాచుర్యం లోకి వచ్చింది, ప్రజల నాలుక లపై మిగిలింది! 


శతక పద్యాల తీరును చూస్తే అవి ఒక్కొక్కటి ఒక మినీ కవిత లా అనిపిస్తాయి. వీటిలో  తత్త్వపరమైన ఆలోచనలు, అవసరమైన మానవ ప్రవర్తన, ప్రపంచ స్వభావం, పరిస రాలు, మంచి అలవాట్లు ఇలా... పలు విషయాలను గమనించవచ్చు. శృంగారం, భక్తి ఎలాగూ వున్నాయి. అంతేగాక శతక పద్యాల్లో ఫిలాసఫీ, సైకాలజీ, ఛైల్డ్‌ కేర్‌, మోరల్‌ వ్యాల్యూస్‌, ఎన్విరాన్‌మెంట్‌... ఇలా ఎన్నో విషయాలు పొందుపరచబడి వున్నాయి. వాహిక సాహిత్యమైనా వస్తువు మాత్రం సోషల్‌ సైన్సెస్‌ లేదా హ్యుమానిటీస్‌ను కలుపుకొని ఎంతో విస్తృతం పరిధిని కలిగి ఉంటాయి. ఈ అవగాహనలతో శతక సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చెయ్యవలసిన సమయం ఆసన్నమైందనిపిస్తుంది!!

నాగసూరి వేణుగోపాల్‌

94407 32392


Updated Date - 2020-11-09T06:47:18+05:30 IST