డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఘనత ఇదే : మోదీ

ABN , First Publish Date - 2022-04-28T18:26:17+05:30 IST

ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి కోసం చేపట్టిన అనేక చర్యలను

డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఘనత ఇదే : మోదీ

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి కోసం చేపట్టిన అనేక చర్యలను వివరిస్తూ, ఇదంతా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఘనత అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అస్సాంలోని కర్బి అంగ్‌లాంగ్ జిల్లాలో వివిధ ఆరోగ్య సంరక్షణ, విద్యా సంబంధిత ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పడటాన్ని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అని ఆ పార్టీ  పిలుస్తున్న సంగతి తెలిసిందే. 


కర్బి అంగ్‌లాంగ్‌లోని డిఫులో ‘శాంతి, ఐక్యత, అభివృద్ధి సభ’ పేరుతో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ,  ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితులు మెరుగుపడినందువల్ల సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్‌పీఏ) అమలును అస్సాంలోని 23 జిల్లాల్లో, ఈ ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాల్లో రద్దు చేసినట్లు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి నమ్మకం, అందరి కృషి’ స్ఫూర్తితో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇదే స్ఫూర్తితో సరిహద్దుల సమస్యలు కూడా పరిష్కారమయ్యాయని చెప్పారు. ఇటీవల అస్సాం-మేఘాలయ మధ్య కుదిరిన ఒప్పందం ఇతరులను కూడా ప్రోత్సహిస్తుందన్నారు. శాంతి, అభివృద్ధి కోసం గత ఏడాది కర్బి అంగ్‌లాంగ్‌ నుంచి అనేక సంస్థలు దృఢ నిశ్చయంతో ముందుకు వచ్చాయని చెప్పారు. బోడో ఒప్పందం 2020లో శాశ్వత శాంతికి నూతన ద్వారాలను తెరిచిందన్నారు. 


అస్సాంలోని డిఫులో వెటరినరీ కళాశాలకు, వెస్ట్ కర్బి అంగ్‌లాంగ్‌లో డిగ్రీ కళాశాలకు, కోలోంగలో వ్యవసాయ కళాశాలకు మోదీ గురువారం శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా పాల్గొన్నారు. 


Updated Date - 2022-04-28T18:26:17+05:30 IST