ఇదేం ఫిట్టింగ్‌ జగనన్నా!

ABN , First Publish Date - 2021-12-19T08:00:07+05:30 IST

ఇదేం ఫిట్టింగ్‌ జగనన్నా!

ఇదేం ఫిట్టింగ్‌ జగనన్నా!

ప్రొబేషన్‌ ప్రకటనపై దోబూచులాట

సచివాలయాల ఉద్యోగులకు ఎడతెగని నిరీక్షణ

తొలుత కలెక్టర్లు ప్రకటిస్తారన్న ప్రభుత్వం

ప్రభుత్వ అనుమతితో చెయ్యాలని తాజా ఆదేశం

రెండున్నర నెలలుగా కాలయాపన


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఎడతెగని నిరీక్షణ కొనసాగుతోంది. ప్రొబేషనరీ కాలం పూర్తయి రెండున్నర నెలలయినా.. జాప్యమెందుకని ఆ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రొబేషన్‌ ప్రకటనపై ఎందుకు దోబూచులాడుతున్నారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రెండేళ్ల కిందట గాంధీ జయంతి రోజున వారంతా విధుల్లో చేరారు. చాలీచాలని జీతంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది అక్టోబరులోనే క్రమబద్ధీకరించి జీతాలు పెంచుతారని ఎదురుచూడగా నిరాశే మిగిలింది. వీరి క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం మూడు నెలల కిందట జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసి హడావుడి చేసింది. ఇప్పుడేమో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయశాఖ లేఖ రాయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు తమను క్రమబద్ధీకరిస్తారా? లేక కాలయాపనతో తాత్కాలిక ఉద్యోగులుగానే కొనసాగిస్తారా? అని వారంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ దుస్థితి ఎందుకు తెస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. 


దయనీయ స్థితిలో ఉద్యోగులు..

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆర్భాటంగా 1.34 లక్షల పోస్టుల నియామకాలు చేపట్టి, వారి ఆలనాపాలనను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపణలొస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ శాఖను దేనికీ కొరగాకుండా చేసిందని, ఉద్యోగులనూ దయనీయ స్థితిలోకి నెట్టిందని పలువురు విమర్శిస్తున్నారు. ముందస్తు ప్రణాళికలు, పకడ్బందీ వ్యూహం లేకుండా ఈ వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖలను నిర్లక్ష్యం చేశారని అంటున్నారు. 


ఏమిటీ కాలయాపన?

సెప్టెంబరు 29న ప్రొబేషన్‌ ప్రకటించాలని తొలుత జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అయినా, ఆ దిశగా ఒక్క అడుగూ పడలేదు. కొత్త సంవత్సరం లోపు అయినా ప్రక్రియ పూర్తయి పర్మినెంట్‌ ఉద్యోగులవుతామని ఆశగా ఎదురుచూశారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ప్లేట్‌ ఫిరాయించింది. ప్రొబేషన్‌ ప్రకటనకు అర్హులైన ఉద్యోగుల జాబితాను తయారుచేసి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపాలని తాజాగా ఆదేశాలివ్వడంతో ఆ ఉద్యోగులు నిరాశానిస్పృహలకు లోనయ్యారు. ఇవన్నీ కాలయాపన కోసమేనని భావిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఉన్నతాధికారులు వ్యూహం ప్రకారం దీనిపై మొదటి నుంచీ తాత్సారం చేస్తున్నారని వాపోతున్నారు. 


ఆది నుంచీ వేధింపులే..

సీఎం మానసపుత్రికగా పేర్కొన్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేసే సిబ్బంది చాలా సంతోషంగా ఉండాలి. అయితే, ఆ శాఖ ఒక దిశానిర్ధేశం లేకుండా నడుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఉద్యోగులుగా చేరడం తాము చేసుకున్న పాపమా? అని వారంతా వాపోతున్నారు. మొదటి నుంచి తమతో ప్రభుత్వం కుప్పిగంతులు వేయిస్తోందంటున్నారు. సచివాలయ వ్యవస్థ స్వరూపం ఏర్పడక ముందే ఉద్యోగుల ఎంపిక, లోపభూయిష్టంగా రాత పరీక్ష, అలా ఎంపికైనవారికీ పోస్టింగ్‌  ఇవ్వకపోవడం, ఉద్యోగంలో చేరినవారికి సుదీర్ఘకాలం జాబ్‌చార్ట్‌ రూపొందించకపోవడం, జాబ్‌చార్ట్‌పై రోజుకో రకంగా ఉత్తర్వులు మార్చడంతో వారంతా అయోమయానికి గురవుతున్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా మార్చడం, దానికి హైకోర్టు అభ్యంతరం చెప్పడం ఇలా అనేక రకాల చిక్కుల్లో ఆ ఉద్యోగులున్నారు. వలంటీర్లకు ఇచ్చిన గౌరవం కూడా తమకు లేకుండా చేసిందంటున్నారు. రికార్డ్‌ అసిస్టెంట్‌ స్థాయి పోస్టుకు గ్రూప్‌-1 స్థాయి పరీక్షలు నిర్వహించారని, అయినా, తమ సేవలను వినియోగించుకోవడంలో విఫలమైందని విమర్శిస్తున్నారు. రెండేళ్లు అప్రెంటి్‌సషిప్‌ పేరుతో రూ.15 వేలు గౌరవ వేతనం అందిస్తున్నారు. తదుపరి ఏదో ఒక ఉద్యోగం వచ్చే వరకు ఈ ఉద్యోగంలో కొనసాగుదామన్న ఉద్దేశంతోనే పలువురు చేరారు. తర్వాత ఏదో ఒక ఉద్యోగం రావడంతో రిజైన్‌ చేస్తున్నారు. అప్రెంటి్‌సషిప్‌ కాలంలో గౌరవవేతనం తిరిగి ఇవ్వాలన్న నిబంధనలు ఇబ్బందికరంగా మారాయి. అప్రెంటి్‌సషిప్‌ పూర్తి కాకముందే డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష, కంప్యూటర్‌ బేస్డ్‌ అసె్‌సమెంట్‌ పరీక్ష రాయాలని ఒత్తిడితో తమ ఓపికను పరీక్షించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీల్డ్‌లో పనిచేసే ఉద్యోగులకూ బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేయడంతో ఒక నెల జీతాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఒకట్రెండు నెలలు జీతాలూ జాప్యం చేశారు.



Updated Date - 2021-12-19T08:00:07+05:30 IST