ఇదే ఫైనల్‌!

ABN , First Publish Date - 2020-10-24T08:32:27+05:30 IST

పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులపై కేంద్రం స్పష్టంగా ‘షాక్‌’ ఇచ్చింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లకే కట్టుబడి ఉంటామని

ఇదే ఫైనల్‌!

ఒప్పుకోకుంటే రూ.2234 కోట్లు కూడా ఇవ్వం

పోలవరం పాత అంచనా రూ.20 వేల కోట్లే

ఇప్పటిదాకా ఇచ్చినవి పోగా వచ్చేది 7 వేల కోట్లు

బుగ్గనకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల స్పష్టీకరణ!?

కేంద్రం వైఖరితో ఏపీ సర్కారుకు షాక్‌

జలశక్తి కార్యదర్శి యూపీ సింగ్‌తో దాస్‌ భేటీ

సంతృప్తికర జవాబు రాకపోవడంతో నిరాశ

పీపీఏతో తేల్చుకోవాలని కేంద్ర అధికారుల సూచన!

గత ప్రభుత్వంపై నెపం నెట్టిన బుగ్గన


జాతీయ ప్రాజెక్టు హోదా పొందిన పోలవరంపై కేంద్రం కుండబద్దలు కొట్టింది. పాత అంచనాలే ‘ఫైనల్‌’ అని తేల్చేసింది. 2013 భూసేకరణ చట్టంతో పునరావాస వ్యయం భారీగా పెరిగినా పట్టించుకునేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు... 2013-14 అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లకు అంగీకరించాలని... లేనిపక్షంలో రాష్ట్రానికి రీయింబర్స్‌ చేయాల్సిన రూ.2,234.28 కోట్లు కూడా ఇవ్వబోమని హెచ్చరించినట్లు సమాచారం. విపక్షంలో ఉండగా.. పోలవరం అంచనా వ్యయంపై అనుమానాలు సృష్టించి, ‘వ్యయం’ పెంచొద్దు అని కేంద్రానికి లేఖలు రాసిన వైసీపీ.. ఇప్పుడు నెపాన్ని టీడీపీ సర్కారుపై నెడుతోంది. పోలవరానికి నిధులను పోరాడి సాధించుకుంటుందా? ‘మీ దయ, మా ప్రాప్తం’ అని చేతులెత్తేస్తుందా? జగన్‌ సర్కారు ఏం చేస్తుంది?


న్యూఢిల్లీ/అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులపై కేంద్రం స్పష్టంగా ‘షాక్‌’ ఇచ్చింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లకే కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పింది. ‘‘2013-14 నాటికి రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ.4,730.71 కోట్లను తీసివేయగా కేంద్రం భరించాల్సింది రూ.15,667.90 కోట్లు. అందులో, ఇప్పటివరకు రూ.8,614.16 కోట్లు రీయింబర్స్‌ చేశాం. మిగిలింది 7,053.74 కోట్లు. ఇందులో ఇప్పటికే రాష్ట్రం ఖర్చు చేసిన రూ.2,234.28 కోట్లను రీయింబర్స్‌ చేస్తాం. దానిని మినహాయిస్తే... పోలవరం ప్రాజెక్టు కింద రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చేది 4,819.56 కోట్లు’’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డికి స్పష్టం చేసినట్లు సమాచారం.


పోలవరం అంచనా వ్యయాన్ని కేంద్రం భారీగా కుదించిన నేపథ్యంలో... బుగ్గన శుక్రవారం ఢిల్లీలో నిర్మలా సీతారామన్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించాలని కోరారు. తుది అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.55,548.87 కోట్లు అని.. దీనిని ఆమోదించి నిధులివ్వాలని గతంలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ అంచనాలపై నాటి ప్రతిపక్ష నేత జగన్‌ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అంచనాలు పెంచొద్దని ఆయన  వైసీపీ కేంద్రానికి లేఖలు కూడా రాసింది.


అయితే... గత ఏడాది ఎన్నికల ముందే 55,548 కోట్ల సవరించిన అంచనాలను కేంద్ర జలసంఘం పరిధిలోని సాంకేతిక సలహా మండలి (టీఏసీ) ఆమోదించింది. తర్వాత ఈ ఫైలును కేంద్ర జలశక్తి శాఖ కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. సవరించిన అంచనాలను పట్టించుకోని ఆర్థిక శాఖ.. 2013-14 అంచనాల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లేనని.. ఆ మేరకు రాష్ట్రప్రభుత్వాన్ని ఒప్పించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి లేఖ రాసింది.

నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం బుగ్గన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై నెపం మోపే ప్రయత్నం చేశారు. అంచనాలను రూ.55,548 కోట్లకు సవరించి కేంద్ర జలసంఘానికి, జలశక్తి శాఖకు పంపింది టీడీపీ ప్రభుత్వం కాగా.. తామే సవరించి పంపించినట్లు చెప్పడం గమనార్హం.


పీపీఏలోనే తేల్చుకోవాలి!

అంచనా వ్యయం విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నుంచి బుగ్గనకు సంతృప్తికరమైన సమాధానం రాలేదని తెలిసింది. ఇదే సమయంలో రాష్ట్ర జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ కూడా ఢిల్లీలో కేంద్ర జలశక్తి కార్యదర్శి యూపీ సింగ్‌ను కలిశారు. ఆయన నుంచి కూడా సరైన సమాధానం లభించలేదని తెలిసింది. పీపీఏ సమావేశంలో చర్చించి దీనిపై సమాధానం పంపించాలని కేంద్ర అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.


వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను టీఏసీ గత ఏడాది రూ.55,548.87 కోట్లకు ఆమోదించాక.. కేంద్ర ఆర్థిక శాఖ తొలుత దానిని రూ.47,725.24 కోట్లకు కుదించింది. సీఎం జగన్‌, రాష్ట్ర మంత్రులు బుగ్గన, అనిల్‌కుమార్‌ తనను కలిసినప్పుడు.. కుదించిన మొత్తానికి అంగీకరించాలని వారికి జలశక్తి మంత్రి షెకావత్‌ సూచించారు కూడా. రాష్ట్రప్రభుత్వం  దాదాపుగా సమ్మతించాలని భావించినట్లు తెలిసింది.


ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ ఒక్కసారిగా పిడుగు వేసింది. తుది అంచనాలను రూ.20,398.61 కోట్లకు కుదించి.. దీనికి రాష్ట్రాన్ని అంగీకరింపజేయాలని పీపీఏని నిర్దేశించింది. తుది అంచనాల విషయాన్ని పీపీఏ మాజీ సీఈవో ఆర్‌కే జైన్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. టీఏసీ ఆమోదించినంత మాత్రాన అంతే మొత్తం నిధులను కేంద్రం మంజూరు చేయాలని లేదని.. కొన్ని షరతులు, పరిమితులకు అనుగుణంగానే నిధులు మంజూరు చేస్తుందని ఆయన బదులిచ్చారు.


వాటి నిర్ణయాన్ని కాదనలేరు!

రాష్ట్ర ప్రభుత్వ వాదన మాత్రం వేరుగా ఉంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాలకు సంబంధించి కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని టీఏసీ, ఆర్థిక శాఖ పరిధిలోని అంచనా మదింపు కమిటీ నిర్ణయాలను ఎవరూ కాదనలేరని అంటోంది. కుదించిన అంచనాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుందో పీపీఏ గురువారం తమను ఆరా తీసినట్లు రాష్ట్ర జలవనరుల అధికారులు తెలిపారు.

తుది అంచనాలపై కేంద్రం తమను నేరుగా అభిప్రాయం కోరలేదని.. పీపీఏతోనే సంప్రదింపులు జరుపుతున్నందున అథారిటీ గవర్నింగ్‌ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే తమ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తామని పీపీఏకి తెలియజేశామని వెల్లడించారు.


టీఏసీ ఆమోదించింది ఇదీ..

2019 ఫిబ్రవరి 11వ తేదీనే సవరించిన అంచనాలను టీఏసీ ఆమోదించింది. దానిపై అదే ఏడాది మే 7వ తేదీన 141వ టీఏసీ సర్వసభ్య సమావేశం ఆమోద ముద్ర వేసింది. తుది అంచనా వ్యయాన్ని టీఏసీ  రూ.55,548 కోట్లకు ఆమోదం తెలిపిందని షెకావత్‌ 2019 జూలైలో రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ 2017 నాటి కేంద్ర కేబినెట్‌ తీర్మానాన్ని బయటకు తీసి..రూ.20,398.61 కోట్లే అనడం రాష్ట్రప్రభుత్వాన్ని దిగ్ర్భాంతికి గురిచేసింది.


పీపీఏ గవర్నింగ్‌ బాడీ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారులు కూడా సభ్యుల హోదాలో హాజరవుతున్నందున.. తుది అంచనాలపై వారూ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారని.. దాంతో తమకు కూడా స్పష్టత వస్తుందని రాష్ట్ర  అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రప్రభుత్వ స్పందనను పీపీఏ కేంద్రానికి పంపిన అనంతరం.. పెంచిన అంచనాలను ఆమోదించాలని మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని, ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశముందని ఆయన తెలిపారు.


Updated Date - 2020-10-24T08:32:27+05:30 IST