ఇదీ తర‘గతి’...!

ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST

ఈ గుడిలో కూర్చున్నది భక్తులు కాదు..

ఇదీ తర‘గతి’...!

  1. ఫేజ్‌-2 కింద 965 పాఠశాలలు ఎంపిక
  2. మరో రెండు రోజుల్లో తెరుచుకోనున్న బడి తలుపులు 
  3. జిల్లా వ్యాప్తంగా కదిలిక లేని రెండో దశ పనులు
  4. చదువులు చెబుతారా..? పనులు చేస్తారా..?
  5. ప్రధానోపాధ్యాయుల ఖాతాలకు 15 శాతం నిధులు
  6.   పిల్లర్లు దాటని అదనపు తరగతి గదులు.. ఇబ్బందుల్లో విద్యార్థులు

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): 

 ఈ గుడిలో కూర్చున్నది భక్తులు కాదు.. బావిభారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు. బడిలో ఉండాల్సిన గురువులకు ఇక్కడేం పని అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం. కోడుమూరు మండలం రామాపురం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో 19 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. గదులు శిథిలావస్థకు చేరాయి. కొత్త గదుల నిర్మాణానికి 2018లో పాత‘బడి’ని కూల్చేసి పునాదులు తవ్వి వదిలేశారు. బడి గుడికి చేరింది. పాలకులు మారినా నూతన భవనాల నిర్మాణం మాత్రం మొదలు కాలేదు. నాలుగేళ్లుగా విద్యార్థులకు గుడి గంటే.. బడి గంటయ్యింది. 

 

ఎమ్మిగనూరు మండలం సోగనూరు ప్రాథమికోన్నత పాఠశాల ఇది. 1 నుంచి 8వ తరగతి వరకు 233 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2010లో రూ.7.50 లక్షల ఎస్‌ఎస్‌ఏ నిధులతో ఈ పాఠశాల నూతన భవనాలు నిర్మించారు. నాణ్యత లోపంతో పదేళ్లు గడవకుండానే శిథిలావస్థకు చేరింది. విద్యార్థులు రోడ్డున పడ్డారు. గతేడాది డిసెంబరు 8న బడికి తాళం వేసి చిన్నారులు ఆందోళన చెశారు. అయినా పాలకులు కనికరించలేదు. అదనపు గదులు నిర్మించలేదు. ఎస్సీ కాలనీలో కొత్త ప్రాథమిక పాఠశాలలో ఇచ్చిన ఒక గదిలో 1 నుంచి 5 వరకు తరగతులు... ఉర్దూ పాఠశాలలోని ఒక గదిలో 6 నుంచి 8వ తరగతి వరకు మూడు తరగతులు విద్యార్థులు సర్దుకోవలసి వస్తోంది. 

 ...జిల్లాలో ఇలాంటి పాఠశాలలు ఎన్నో. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఫేజ్‌-2 పనులు మొదలే కాలేదు. ఇప్పుడిప్పుడే 15 శాతం నిధులు పేరెంట్స్‌ కమిటీ ఖతాలో జమ చేశారు. దీంతో చదువులు చెప్పాలో..లేక గదులు కట్టాలో తెలియని అయోమయంలో గురువులు ఉన్నారు. మరో రెండు రోజుల్లో బడుల పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో  పరిస్థితిని పరిశీలిస్తే..ఎక్కడికక్కడే అధ్వాన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

 జిల్లాలో ప్రభుత్వ ... జిల్లా పరిషత్తు... మున్సిపల్‌... కస్తూరిబాగాంధీ బాలికల ఉన్నత పాఠశాలు, ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌తో కలిపి 1,433 విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో 6.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. చిన్నారులకు విద్యాబోధనకు 8 వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి వివిద పథకాల ద్వారా ఏటా రూ.వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నా.. ఇప్పటికీ అనేక బడుల్లో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు లేవు. ఫర్నీచర్‌, తాగునీరు, విద్యుత్తు సమస్యలు వేధిస్తున్నాయి. నాడు-నేడు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మరుగుదొడ్లు, తాగునీరు, ప్రతి తరగతి గదికి ఫ్యాన, ట్యూబ్‌లైట్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫర్నీచర్‌, రంగులు, అవసరమైన మరమ్మతులు, ఆకుపచ్చ  బోర్డు, అదనపు తరగతి గదులు, ప్రహరీ వంటి సౌకర్యాల కోసం రూ.వందల కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తోంది. ఫేజ్‌-1 కింద 574 పాఠశాలలను ఎంపిక చేసి... సౌకర్యాల కల్పనకు రూ.163.17 కోట్లు ఖర్చు చేశామని అధికారులు చెబుతున్నారు. నాబార్డు కింద ఎంపిక చేసిన మరో 20 పాఠశాలల్లో నేటికి అదనపు తరగతి గదులు పూర్తికాక బడి పునఃప్రారంభంలోనే విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 

ఫ బడి తెరిచే ముందు పనులా..?:

కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మినూరు, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో నాడు-నేడు ఫేజ్‌-2 కింద 289 పాఠశాలల్లో 1,920 అదనపు తరగతి గదులకు రూ.236.42 కోట్లు మంజూరు చేశారు. 665 పాఠశాలల్లో మరమ్మతులు, వివిధ సౌకర్యాలు, మరమ్మతుల కోసం రూ.183.76 కోట్లు కలిపి రూ.420.18 కోట్లు మంజూరు చేశారు. అందులో 15 శాతం నిధులు అదనపు గదుల కోసం 304 పాఠశాలలకు రూ.24.53 కోట్లు, మౌలిక వసతులకు 365 పాఠశాలలకు రూ.12.90 కోట్లు కలిపి రూ.37.43 కోట్లు పేరెంట్స్‌ కమిటీ ఖాతాలకు నాలుగు రోజుల క్రితం జమ చేశారు. ఒక్క బడిలో కూడా అదనపు తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు మొదలు కాలేదు. వేసవి సెలవుల్లో చేపట్టాల్సిన పనుల గురించి ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం బడి తెరిచే ముందు 15 శాతం నిధులు ఇస్తే పనులు ఎలా చేయాలి..? ప్రధానోపాధ్యాయులు ఈ పనులు చేయించాలా..? విద్యార్థులకు చదువులు చెప్పాలా..? అని గురువులు ప్రశ్నిస్తున్నారు. 

ఫ పుస్తకాలూ అంతే...

 జిల్లాలోని 11,433 పాఠశాలల్లో 6.60 లక్షల మంది విద్యార్థులు 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు. వీరికి మూడు దశల్లో 28,90,754 పుస్తకాలు కావలసి ఉంది. 20,33,420 పుస్తకాలు వచ్చాయి. 8,57,328 పుస్తకాలు రావాల్సి ఉంది.  మూడు సెమిస్టర్లకు 20,34,577 పుస్తకాలు జిల్లాకు వస్తే 5,78,955 పుస్తకాలు మాత్రమే 20 మండలాలకు పంపిణీ చేశారు. పుస్తకాలు పూర్తిస్థాయిలో సరఫరా కాకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. 

 





Updated Date - 2022-07-03T05:30:00+05:30 IST