Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 23 Jul 2022 22:57:39 IST

Nuvvu Naaku Nachav: బొమ్మ.. మూడు వారాలు ఆడితే గొప్పే అన్నారు

twitter-iconwatsapp-iconfb-icon

అమెరికాలో ఉద్యోగం అన్నా, అమెరికా అల్లుడు  అన్నా .. ఇప్పుడు కొంత  తగ్గింది కానీ ఒకప్పుడు బాగా క్రేజ్‌ ఉండేది. దీనికి కారణం సాఫ్ట్‌వేర్‌ బూమ్‌. దీన్ని దృష్టిలో పెట్టుకొని అమెరికా సంబంధం కంటే ప్రేమానుబంధమే  ముఖ్యమని చెబుతూ రూపుదిద్దుకున్న ఓ తెలుగు సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అంచనాలను  మించి  విజయం సాధించింది.  ఆ సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్‌’ (Nuvvu Naaku Nachav). ఇమేజ్‌ గురించి  పట్టించుకోకుండా ప్రతి సినిమాలోనూ కొత్తదనం కోసం పరితపించే కథానాయకుడు విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh) నటించిన  ఈ చిత్రం ఆయన అభిమానులనే  కాదు అందరినీ అలరించింది.


తరుణ్‌ (Tarun) హీరోగా నటించిన తొలి సినిమా ‘నువ్వే కావాలి’ (Nuvve Kaavali) ఉషాకిరణ్‌  మూవీస్‌ బ్యానర్‌లో రూపుదిద్దుకున్నా.. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌‌గా ఆ సినిమా  మేకింగ్‌ అంతా  స్రవంతి మూవీస్‌ అధినేత  రవి కిశోర్‌ (Sravanthi Ravi Kishore) దగ్గరుండి చూసుకున్నారు. నేటి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) ఆ చిత్రానికి రచయిత. విజయభాస్కర్‌ (Vijay Bhaskar) దర్శకుడు. వాళ్లిద్దరి పనితీరు రవికిశోర్‌ను ఆకట్టుకుంది. అందుకే  విడుదలైన తర్వాత ‘నువ్వే కావాలి’ చిత్రం రిజల్ట్‌ ఎలా ఉన్నా  వారిద్దరితో మరో  సినిమా చేయాలని ముందే ఫిక్స్‌ అయ్యారు రవికిశోర్‌. వాళ్లకు  అడ్వాన్సులు ఇచ్చేసి లాక్‌ చేశారు. చివరకు రవికిశోర్‌ నమ్మకమే నిజమైంది. ‘నువ్వే కావాలి’ ఘన విజయం సాధించింది.  ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే త్రివిక్రమ్‌ ‘నువ్వు నాకు నచ్చావ్‌’  స్ర్కిప్టు రెడీ చేశారు. ఏ కథ విన్నా వెంటనే ఓకే చెప్పే అలవాటు లేని  వెంకటేష్‌.. ఈ కథ వినగానే ఇమ్మీడియట్‌గా  షూటింగ్‌  మొదలు పెట్టేద్దాం.. అన్నారు. ఆయనతోపాటు నిర్మాత సురేశ్‌బాబు (Suresh Babu) కూడా ఈ కథ విన్నారు. ఆయనకు కూడా కథ నచ్చింది. ‘అయితే  కథ ఎక్కువగా ఒక ఇంట్లోనే జరుగుతోంది.. కొన్ని సీన్లు ఔట్‌ డోర్‌‌లో ఉండేలా ప్లాన్‌ చేయండి’ అని సలహా ఇచ్చారు. అప్పుడు ఊటీ ఎపిసోడ్‌, ఆషా సైనీ పెళ్లి సీన్లు, బ్రహ్మానందం (Brahmanandam) ఎపిసోడ్‌ కొత్తగా పుట్టాయి.

Nuvvu Naaku Nachav: బొమ్మ.. మూడు వారాలు ఆడితే గొప్పే అన్నారు

ఆర్తి అగర్వాల్‌ తొలి సినిమా

ఈ సినిమాలో హీరోయిన్‌ నందిని పాత్రకు కొత్త నటిని పరిచయం చేయాలని అనుకొని.. చాలా మందిని చూశారు. ఎవరూ నచ్చలేదు.  చివరకు ‘పాగల్‌ పన్‌’  హిందీ సినిమాలో నటించిన ఆర్తీ అగర్వాల్‌‌ (Aarthi Agarwal)ను ఎంపిక చేశారు. తన గ్లామర్‌తో అందరినీ కట్టి పడేసిన ఆర్తి తొలి హిట్‌తో  మరిన్ని  అవకాశాలు చేజిక్కించుకున్నారు.


ఈ సినిమాలో మరో కీలక పాత్ర నందిని తండ్రి మూర్తిది. ఆ పాత్రకు మొదట ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) పేరు పరిశీలించారు. కానీ ఏ సినిమాలోనూ ఆయన్ని తీసుకోకూడదని ఆ సమయంలోనే  మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) నిషేధం విధించింది. దాంతో  ఆ పాత్రకు నాజర్‌, రఘువరన్‌ పేర్లు అనుకొన్నారు కానీ కాంప్రమైజ్‌ కాలేక పోయారు. ప్రకాశ్‌రాజ్‌ చేస్తేనే ఆ పాత్రకు ఓ హుందాతనం వస్తుందనుకొని.. వెయిట్‌ చేయడానికి  దర్శకనిర్మాతలు ఫిక్స్‌ అయ్యారు. అందుకే ప్రకాశ్‌రాజ్‌ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలను పెండింగ్‌లో పెట్టి, మొదట మిగిలిన సీన్లు  చిత్రీకరించారు. ‘మా’ (Maa) తన మీద నిషేధం తొలగించగానే, ‘నువ్వు నాకు నచ్చావ్‌’ షూటింగ్‌లోకి ఎంటర్‌ అయి, 17 రోజుల్లో  తన వర్క్‌ పూర్తి చేశారు ప్రకాశ్‌ రాజ్‌.


మూడు వారాలు ఆడితే గొప్పే అన్నారు

వెంకటేశ్‌ పారితోషికం కాకుండా ‘నువ్వు నాకు నచ్చావ్‌’  నిర్మాణానికి రూ. నాలుగున్నర కోట్లు అయింది. వెంకటేశ్‌ పారితోషికం రూ. రెండున్నర కోట్లు. 64 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశారు. సినిమా నిడివి మూడు గంటల తొమ్మిది నిముషాలు వచ్చింది. అరగంట తగ్గిస్తే బాగుంటుందని  శ్రేయోభిలాషులు చెప్పారు.. కానీ చిత్ర సమర్పకుడు సురేశ్‌ బాబు, నిర్మాత రవి కిశోర్‌ వినలేదు. 2001 సెప్టెంబర్‌ 6న ‘నువ్వు నాకు నచ్చావ్‌’ చిత్రం విడుదలైంది.  ‘సినిమా పోయింది’ అంటూ ఫస్ట్‌ డే టాక్‌  వినిపించింది. ‘అబ్బే.. మూడు వారాలు కూడా కష్టమే’ అన్నారు. ఎక్కువ రేట్లు పెట్టి కొన్న బయ్యర్లు భారీగా నష్ట పోతారు.. అన్నవాళ్లూ ఉన్నారు.  కానీ రెండో వారం నుంచి కలెక్షన్స్‌  ఒక్కసారిగా పెరిగి సినిమాను హిట్‌ చేశాయి.

-వినాయకరావు

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement