ఇది సరికాదు

ABN , First Publish Date - 2021-12-22T08:24:04+05:30 IST

పంజాబ్ లోని రెండు ప్రసిద్ధ సిక్కు ప్రార్థనాస్థలాల్లో ఇరవైనాలుగుగంటల్లో ఒకే తరహా ఘటనలు రెండు చోటుచేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అమృత్ సర్ స్వర్ణదేవాలయంలో శనివారం సాయంత్రం పవిత్రగురుగ్రంథ్ సాహెబ్ వద్ద...

ఇది సరికాదు

పంజాబ్ లోని రెండు ప్రసిద్ధ సిక్కు ప్రార్థనాస్థలాల్లో ఇరవైనాలుగుగంటల్లో ఒకే తరహా ఘటనలు రెండు చోటుచేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అమృత్ సర్ స్వర్ణదేవాలయంలో శనివారం సాయంత్రం పవిత్రగురుగ్రంథ్ సాహెబ్ వద్ద ఒక వ్యక్తి అనుచితంగా ప్రవర్తించడంతో ఆగ్రహించిన భక్తులు అతడిని అక్కడనుంచి ఈడ్చుకుపోయి కొట్టిచంపేశారు. సాయంకాలం ప్రార్థనల సందర్భంగా ఈ ఘటన జరగడంతో ఆగంతకుడి ప్రవర్తన, అతడిని పక్కకు లాక్కుపోవడం టీవీల్లో ప్రత్యక్ష ప్రసారమైంది కూడా. ఈ ఘటన జరిగిన మరునాడే కపుర్తలా గురుద్వారాలో మత పతాక ‘నిశాన్ సాహిబ్’ను అవమానించాడంటూ స్థానికులు కొట్టడంతో ఒక వ్యక్తి ఆస్పత్రిలో మరణించాడు. పంజాబ్ ప్రభుత్వం ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నప్పటికీ, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ రెండు దైవద్రోహ ఘటనలూ పాలకపక్షాన్ని ఇబ్బందిపెట్టేవే. 


కపుర్తలా ఘటనలో నిందితుడిని మూకదాడినుంచి రక్షించేందుకు పోలీసులు చివరివరకూ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు సహా ఎవరూ జోక్యం చేసుకోవద్దనీ, భక్తులు పెద్ద సంఖ్యలో వెంటనే చేరుకోవాలని గురుద్వారానుంచి ప్రకటన వెలువడిందని అంటున్నారు. వచ్చిన జనం ఆ వ్యక్తిని పోలీసుల చేతుల్లోంచి తమ చేతుల్లోకి తీసుకొని వారి సమక్షంలోనే దాదాపుగా చంపేశారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ ఈ ఘటనల రాజకీయ ప్రభావాన్ని ఉపశమింపచేసేందుకు ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దినెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున కొంతమంది కావాలనే మతవిద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర చేశారని వారు ఆరోపించారు. పనిలోపనిగా, ఇటువంటి దైవద్రోహ ఘటనలకు కారకులైనవారిని బహిరంగంగా ఉరితీయాలని కూడా సిద్దూ డిమాండ్ చేశారు. పవిత్రస్థలాలు, గ్రంథాలు ఏ మతానికి చెందినవైనా వాటిని లక్ష్యంగా చేసుకున్నవారిని ఉరితీయాల్సిందేనని అన్నారాయన. మతభావాలను గాయపరిచే ఈ తరహా ఘటనలపై తీవ్రంగా స్పందించవలసిందే, ఖండించవలసిందే. కానీ, సిద్దూ సహా అనేకమంది పంజాబ్ నాయకులు మందిరాల అపవిత్రతను మాత్రమే ప్రస్తావిస్తూ, జరిగిన మూకదాడుల ఊసెత్తడం లేదు. మరికొందరు ఎంతో తెలివిగా ఈ కొట్టిచంపేయడాలను పరోక్షంగా సమర్థిస్తూ, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని మాటమాత్రంగా మరోపక్క అంటున్నారు. మూకదాడులను నేరుగా ప్రస్తావించి, ఖండించే ధైర్యం పంజాబ్ నేతలకు లేకపోయింది. అలా చేసినపక్షంలో గురుగ్రంథ సాహెబ్‌ను అవమానించినవారిని వెనకేసుకొచ్చిన భావన ప్రజలకు కలుగుతుందని వారి భయం కావచ్చు. తమ ప్రత్యక్షదైవానికి జరిగిన అవమానంకంటే దానికి కారకులైనవారిని కొట్టిచంపడం పెద్ద అపచారమేమీ కాదని ప్రజలు నమ్ముతారని, అందువల్ల మూకదాడులపై నోరువిప్పకపోవడమే ఉత్తమమని వారు భావిస్తుండవచ్చు. కానీ, ఇలా అనుమానితులను అక్కడికక్కడే చంపేయడం వల్ల నిజమైన సాక్ష్యాన్ని నాశనం చేస్తున్నామనీ, తద్వారా అసలు కుట్రదారులు, ద్రోహులూ ఎవరో ఎన్నటికీ బయటకు తెలియదని గ్రహించాలి. అలాగే, ప్రార్థనాస్థలాల్లో ఏ పవిత్రతకోసమైతే అందరూ తాపత్రయపడుతున్నారో దానికి ఈ తరహా దాడులవల్ల నష్టం వాటిల్లకూడదు. పవిత్ర స్థలాల్లో ఈ తరహా ప్రతీకారహింసకు చోటులేదు. కపుర్తలా ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదనీ, దొంగతనానికి వచ్చిన వ్యక్తిని గురుద్వారాకు చెందినవారు కొట్టిచంపారన్న ప్రచారం కూడా ఉన్నది. అలాగే, స్వర్ణదేవాలయంలో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తి మతిస్థిమితంలేని ఓ బిహారీ అని అంటున్నారు. గురుద్వారాలను అపవిత్రం చేసే ఘటనలు గత ఏడెనిమిదేళ్ళలోనే ఓ వందవరకూ జరిగివుంటాయని అంటారు. ఎవరు కారకులన్నది ఎప్పటికీ తేలని రహస్యంగా మిగిలిపోతూ, మతావేశాలను తాత్కాలికంగా రాజేసి, రాజకీయానికి ఉపయోగపడటం విషాదం.

Updated Date - 2021-12-22T08:24:04+05:30 IST