ఇది ఫక్తు ఫ్యూడల్‌ దురహంకారమే!

ABN , First Publish Date - 2022-05-02T06:03:37+05:30 IST

‘కష్టజీవికై కదం తొక్కిన పదం’ పేరుతో వివిధ (ఏప్రిల్‌ 4)లో వెలువడిన నా వ్యాసానికి ప్రతిస్పందనగా చెరు కూరి సత్యనారాయణ రాసిన ‘గద్దర్‌ కాదు, మలిన మంటిన చద్దర్‌’...

ఇది ఫక్తు ఫ్యూడల్‌ దురహంకారమే!

‘కష్టజీవికై కదం తొక్కిన పదం’ పేరుతో వివిధ (ఏప్రిల్‌ 4)లో వెలువడిన నా వ్యాసానికి ప్రతిస్పందనగా చెరు కూరి సత్యనారాయణ రాసిన ‘గద్దర్‌ కాదు, మలిన మంటిన చద్దర్‌’ (ఏప్రిల్‌ 18) వ్యాసాన్ని చూశాను. ఆయన లేవనెత్తిన ప్రశ్నలు నా వ్యాసపరిధిలో లేనివి. నా రచనలోని ప్రతిపాదనలన్నీ పూర్తి ఆధారాలతో, పరిశోధించి రాసినవే. వాటి ప్రామాణికతపై ప్రశ్నలు వేస్తే చర్చ ప్రజాస్వామికంగా ఉండేది. కానీ ‘జగన్‌ రెడ్డి పొగడ్తలు’ పేరుతో గద్దర్‌ నిర్వహించిన సాహిత్య, సాంస్కృతికోద్యమాన్ని కొట్టివేసే వైఖరి ఆయన అహంకారానికి పరాకాష్ట. చెప్పాలంటే పుకార్ల ఆధారంగా చర్చకు దిగిన చెరుకూరి వారి వైఖరి చాలా చౌకబారు కాదా? ఎస్సీ సామాజిక వర్గంలో పుట్టి ఏడు దశాబ్దాల పాటు స్థానికంగా, జాతీయ స్థాయిలో నిర్విరామంగా సాహిత్య, సాంస్కృతికోద్యమం నిర్వ హిస్తూ ఎన్నో కష్ట నష్టాలకు, నిర్బంధాలకు, జైలు జీవితానికి, దాడులకు, చివరికి హత్యాయత్నంతో కొన ఊపిరితో బయట పడిన గద్దర్‌ వంటి ప్రజా కవిని ఉద్యమకారున్ని ‘‘గోచిగాడుగా, గొంగడిగాడుగా, డప్పుగాడుగా, చెప్పుగాడుగా’’ అంటూ సంబోధించడం చెరుకూరిలోని ఫ్యూడల్‌ అహంకారాన్ని తేటతెల్లం చేస్తోంది. నేతులు, మూతుల వంటి ఫ్యూడల్‌ సామెతను ప్రస్తావించడంలోనే ఆయనకు చారిత్రిక అవగాహనలేదని తేలిపోయింది. ఇక రామానుజునిపై పాట రాయడం గురించి చూద్దాం. రామానుజనివంటి సంస్కర్తపై గద్దర్‌ పాట రాయడం తొలిసారి కాదు. గతంలోనే బుద్ధుడు, బసవన్న, మహాత్మాఫులే, బిఆర్‌ అంబేడ్కర్‌, పెరియార్‌లపై గొప్ప పాటలు రాసి పాడారు. జీయ్యరు స్వామి అభ్యర్థిస్తే ఆ పరం పరలో భాగంగా రామానుజుని మీద కూడ పాట రాశాడు. బ్రాహ్మణుడై ఉండి కులాతీతంగా దేవుని ముందు మనుషు లంతా ఒకటే అని 12వ శతాబ్దంలోనే ప్రకటించి ఉద్యమాన్ని నడిపిన రామానుజుని మీద గౌరవంతో రాసిన పాట అది. అంబేడ్కర్‌ కూడ రామానుజుని పాత్ర గురించి తన రచనలలో ప్రస్తావించిన సందర్భం ఉన్నది.  


గద్దర్‌ యాదగిరి గుట్ట, భద్రాచలం దేవాలయాలకు వెళ్లిన సంగతి చూద్దాం. అక్కడ ఏవో సమావేశాలకు వెళ్లినప్పుడు స్థానిక ప్రజలు, దేవాలయ ఉద్యోగులు ప్రేమగా ఆయనను తమ ఊరి దేవాలయానికి వచ్చి వెళ్లమని కోరితే వెళ్లిన సందర్భాలవి. ఇంతే కాదు, గద్దర్‌ను అక్కడ పూజారులు గర్బగుడిలోకి ఆహ్వానించి గౌరవం వ్యక్తం చేసిన సంఘటన అది. 2022లో కూడ ఇంకా అంటరానితనం కొనసాగుతున్న నేపథ్యాన అది హిందూ నిచ్చెన మెట్ల వ్యవస్థ బ్రాహ్మణ వ్యవస్థ, రాచరిక భూస్వామ్య, వైశ్య వ్యవస్థపై గద్దర్‌ సాధించిన విజయం కాదా? ‘‘భద్రాచలం వెళ్లి నప్పుడు గర్భగుడిలో దండం పెట్టినట్టు వార్తలు వచ్చింది నేను కూడ చూసానన్న’’ అని అంటే ఆయన సమాధానం చూసి విస్తుపోవడం నాంతయ్యింది. ‘‘రామాయణంలో సీతమ్మ పాత్ర ప్రపంచ సాహిత్యలోనే గొప్పది. నా చిన్ననాడు మా అమ్మ ఏ ఆడామైనా బాధతో వస్తే సీతమ్మవారికే కష్టాలచ్చినయి బిడ్యా, భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాల బిడ్యా అని ఓదార్చేది. అది గుర్తుకొచ్చి దండం పెట్టిన’’ అన్నాడు. చెరు కూరి రాహుల్‌ గాంధీతో పొటో గురించి కూడ ప్రస్తావించాడు. చంద్రబాబుతో కర చాలనం చేయడాన్ని కూడా నేను కూడ ప్రశ్నిస్తే ‘‘తప్పుచేసినవాడు మనదగ్గర కొచ్చి క్షమించాలిరా!’’ అన్నాడు. ఆయన సంస్కా రాన్ని చూసి ఆశ్చర్యం వేసింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నిర్మాతగా గద్దర్‌ గురించి తెలిసి స్థానిక రాజకీయ పరిస్థితుల తెలుసుకోవడానికి ఆయనను రాహుల్‌, సోనియా గాంధీలు ఆహ్వానించారు. గతంలో కోదండరామ్‌, జయశంకర్‌ వంటివారితో కూడ వారు చర్చలు జరిపారు. అదే క్రమమిది. అయితే అక్కడ కూడ గద్దర్‌ తన హిందీ పాట ‘‘భారత్‌ అప్నీ మహాను భూమి’’ అనే పాట వినిపించి పేదలబతుకులు ఎందుకు మారలేదని వారిని ప్రశ్నించాడు. అనేక ఒత్తిళ్ళ మధ్య ప్రజా జీవితంలో ఉండే గద్దర్‌ వంటి ప్రజల మనిషి గురించి నిజాలు తెలుసుకోకుండా ఏదిపడితే అది రాయడం మూర్ఖత్వమే.

సామిడి జగన్‌ రెడ్డి

85006 32551


Updated Date - 2022-05-02T06:03:37+05:30 IST