ఇదేమి దీక్ష..!

ABN , First Publish Date - 2021-10-23T07:06:21+05:30 IST

తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన జనాగ్రహ దీక్ష జనం విమర్శలకు తావిచ్చింది.

ఇదేమి దీక్ష..!
జనాగ్రహ దీక్షలో చిందులు వేస్తున్న వైసీపీ కార్యకర్తలు

వైసీపీ జనాగ్రహ దీక్షలో కార్యకర్తల చిందులు

చంద్రబాబు దిష్టిబొమ్మకు అంతిమ యాత్ర తీరుపై విమర్శలు 


తిరుపతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన జనాగ్రహ దీక్ష జనం విమర్శలకు తావిచ్చింది. రెండోరోజైన శుక్రవారం ర్యాలీగా తీసుకొచ్చిన జనంతో కార్పొరేషన్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న రెండు రోడ్లపై ట్రాఫిక్‌ను కొద్దిసేపు నిలిపి వేయడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలువురు రుసరుసలాడుతూ వెళ్లడం కనిపించింది. చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించడం.. లోకేశ్‌ వేషధారణలో ఉన్న కార్యకర్తలతో నిప్పంటించడం విమర్శలకు తావిచ్చింది. శవయాత్ర సందర్భంగా పలకల దరువుకు టౌన్‌బ్యాంకు ఛైర్మన్‌తోపాటు కొందరు కార్పొరేటర్లు రోడ్లపై డ్యాన్సులు చేశారు. చంద్రబాబు బొమ్మను చెప్పులతో కొట్టడం, నేరుగా నరకానికి పోవాలంటూ బైబై బాబు...అంటూ ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి సమక్షంలోనే నినాదాలు చేయడం శృతిమించిన నిరసనగా కొందరు అభిప్రాయపడ్డారు. దీక్ష వేదికపైన ఉన్నవారితో పాటు కింద ఉన్న కార్యకర్తలు వైసీపీ రికార్డింగ్‌ పాటలకు చిందులు వేయడంపై స్థానికులు విస్మయానికి గురయ్యారు. 


జనసమీకరణలో కార్పొరేషన్‌ అధికారులు!

ఈ ఫొటోలో వెనుకనుంచి కనిపిస్తున్న ఇద్దరు ఉన్నతాధికారుల్లో ఒకరు కమిషనర్‌ తర్వాత రెండో స్థానంలో ఉన్న వ్యక్తి. మరొకరు మెప్మా విభాగానికి ముఖ్య అధికారి. జనాగ్రహ దీక్ష సమీపాన ఎందుకున్నారంటే.. రెండో రోజు దీక్షకు పెద్దఎత్తున జన సేకరణకు ఏర్పాట్లు చేయాలని కార్పొరేషన్‌ అధికారిని అధికారపార్టీ నేతలు పురమాయించారు. వెంటనే ఆయన మెప్మా వాళ్లను రంగంలోకి దింపారు. డ్వాక్రా మహిళా గ్రూపులకు సమాచారమిచ్చి కార్యక్రామానికి కచ్చితంగా హాజరుకావాలని షరతు పెట్టారు. దీంతో చేసేదిలేక పలువురు డ్వాక్రా మహిళలు కార్పొరేషన్‌ కార్యాలయానికి చేరుకుని కార్యక్రమానికి దూరంగా కనిపించారు. వీరితో ఆ అధికారులు మాట్లాడి సభావేదికవైపు పంపించారు. ఆ అధికారుల తీరుపై సర్వతా విమర్శలు వచ్చాయి. 



Updated Date - 2021-10-23T07:06:21+05:30 IST