పనికిరాని పాత కార్లను స్క్రాప్‌గా ఎలా మార్చేస్తారో తెలుసా..? తుక్కుగా చేయాలంటే ఈ ఐదు స్టెప్స్ పాటించాల్సిందే..!

ABN , First Publish Date - 2021-11-25T18:57:35+05:30 IST

మీరు పది, పదిహేనేళ్ల నుంచి ఒకే కారు వాడుతున్నారా? మీ కారు ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఫెయిల్ అయిందా?

పనికిరాని పాత కార్లను స్క్రాప్‌గా ఎలా మార్చేస్తారో తెలుసా..? తుక్కుగా చేయాలంటే ఈ ఐదు స్టెప్స్ పాటించాల్సిందే..!

మీరు పది, పదిహేనేళ్ల నుంచి ఒకే కారు వాడుతున్నారా? మీ కారు ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఫెయిల్ అయిందా? అయితే మీ పాత కారును స్క్రాప్ సెంటర్‌కు పంపించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన వాలంటరీ వెహికల్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్ ప్రకారం డీజిల్ కారును పదేళ్ల వరకు, పెట్రోల్ కారును పదిహేనేళ్ల వరకు మాత్రమే ఉపయోగించాలి. అలాగే ఇకపై కారుకు ఇన్సూరెన్స్ చేయించాలంటే పిట్‌నెస్ టెస్ట్ కూడా తప్పనిసరిగా చేయించాలి. ఆ టెస్ట్‌లో మీ కారు ఫెయిల్ అయితే స్క్రాప్ సెంటర్ల‌కు అప్పగించెయ్యాలి. 


నొయిడాలోని తొలి స్క్రాప్ సెంటర్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. రూ.44 కోట్ల రూపాయలతో మారుతీ సుజుకీ, టయోటా సంస్థలు సంయుక్తంగా ఈ సెంటర్‌ను నెలకొల్పాయి. దేశవ్యాప్తంగా మరో 60-70 స్క్రాప్ సెంటర్లు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. మరి, మీ కారును స్క్రాప్ సెంటర్‌కు పంపించి కొత్త కారు కొనేటపుడు డిస్కౌంట్ ఎలా పొందాలో తెలుసుకోవాలంటే ఈ కింది విషయాలు చదవాల్సిందే.


ఫిట్‌నెస్ టెస్ట్

మీ కారుకు ప్రతి ఏడాది ఫిట్‌నెస్ టెస్ట్ చేయించాలి. ఆ పరీక్షలో మీ కారు ఫెయిల్ అయితే స్క్రాప్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ స్క్రాప్ సెంటర్లు తెరుచుకోబోతున్నాయి. ఒకవేళ మీ నగరంలో ఆ సెంటర్ లేకపోతే దగ్గర్లోని మరో నగరానికి మీరే స్వయంగా కారును తీసుకెళ్లాల్సి ఉంటుంది. 


ఏమేం తీసుకెళ్లాలి?

మీ కారును స్క్రాప్ సెంటర్‌కు తీసుకెళ్లేటపుడు దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను తీసుకెళ్లాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ), డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, మీ ఐడెంటిటీ కార్డు ఒరిజినల్స్‌తోపాటు జెరాక్స్‌లు కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాలి. వాటిని అక్కడ చూపించిన తర్వాత మీ కారును వారు స్వాధీనం చేసుకుంటారు. 


ఎలా స్క్రాప్ చేస్తారు?

మీ కారు భాగాలను మీ ఎదురుగానే విడదీస్తారు. తిరిగి ఉపయోగించుకునే వీలున్న స్టీల్ వంటి వాటిని వేరేగా, బ్యాటరీ, ఆయిల్, కూల్‌నట్ వంటి తిరిగి ఉపయోగించుకునే వీలులేని వాటిని వేరేగా పెడతారు. తర్వాత వాటిని స్క్రాప్ చేస్తారు. మీ కారుకు సంబంధించిన ఏ విడి భాగాన్నీ మీకు ఇవ్వరు. 


అక్కడి నుంచి ఏమి తీసుకోవాలి?

స్క్రాప్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు మీకు ఇచ్చేస్తారు. అలాగే ఇంజిన్ నెంబర్, బండి నెంబర్ ప్లేట్ కూడా వెనక్కి ఇస్తారు. అలాగే వారు మీ కారును స్క్రాప్ చేసినట్టు తెలుపుతూ సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ డాక్యుమెంట్ ఇస్తారు. వారు స్క్రాప్ చేసిన తేదీ, మోడల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ దాని మీద ఉంటాయి. అలాగే డిస్ట్రక్షన్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. దానిని మీకు సమీపంలోని ఆర్టీవో ఆఫీస్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. 


ఎంత డిస్కౌంట్ వస్తుంది?

మీరు కొత్త కారు కొనాలనుకున్నప్పుడు షోరూమ్ వాళ్లకు సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ డాక్యుమెంట్ ఇస్తే ఎక్స్-షోరూమ్ ధర మీద 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంతే కాకుండా కొత్త వాహనానికి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఏమీ ఉండదు. 


Updated Date - 2021-11-25T18:57:35+05:30 IST