ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన భారతీయులకు స్మృతి ఇరానీ స్వాగతం పలికిన విధంబెట్టిదనిన...

ABN , First Publish Date - 2022-03-02T21:47:28+05:30 IST

ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చిన భారతీయులు, విద్యార్థులకు స్మృతి ఇరానీ

ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన భారతీయులకు స్మృతి ఇరానీ స్వాగతం పలికిన విధంబెట్టిదనిన...

న్యూఢిల్లీ : ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చిన భారతీయులు, విద్యార్థులకు స్మృతి ఇరానీ స్వాగతం పలికిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. వారి మాతృభాషలలోనే వారికి ఆమె స్వాగతం పలికారు. విమానంలోకి వెళ్ళి గుజరాతీ, బెంగాలీ, మలయాళం, మరాఠీలలో మాట్లాడుతూ స్వాగతం పలికారు. సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని నిలబడగలిగే సత్తాను ప్రదర్శించినందుకు, ధైర్యసాహసాలు, సంయమనం చూపినందుకు అభినందించారు. ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేశారు. ఆమె తమ మాతృభాషలో తమకు స్వాగతం పలకడంతో విద్యార్థులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. 


యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ పేరుతో ఉక్రెయిన్ పొరుగు దేశాలకు విమానాలను పంపిస్తోంది. ఉక్రెయిన్ గగనతలంపై విమానాల రాకపోకలపై నిషేధం ఉండటంతో ఆ దేశం నుంచి పొరుగు దేశాలకు భారతీయులు, విద్యార్థులు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి ఈ విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొస్తున్నారు.  పోలండ్ నుంచి కొందరు భారతీయులు, విద్యార్థులు బుధవారం స్వదేశానికి చేరుకున్నారు. వీరికి స్మృతి ఇరానీ స్వాగతం పలికారు. 


స్మృతి ఇరానీ బుధవారం ఇచ్చిన ట్వీట్లలో, ‘భారత దేశం తన బిడ్డలకు స్వాగతం పలుకుతోంది’ అని చెప్పారు. ‘ఆపరేషన్ గంగ’ ద్వారా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తున్న వైమానిక సిబ్బందికి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ కృషికి సహకరిస్తున్న పైలట్లు, ఇతర వైమానిక సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. 


ఇదిలావుండగా, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులందరినీ మార్చి నాలుగునాటికి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని కోసం 36 విమానాలను నడపాలని నిర్ణయించింది. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా స్లొవేకియా, రొమేనియాలకు 4 విమానాలను నడపాలని స్పైస్‌జెట్ నిర్ణయించింది. 


Updated Date - 2022-03-02T21:47:28+05:30 IST