పైశాచిక ఆనందం.. రఘురామ అరెస్టుపై నేతల స్పందనలు

ABN , First Publish Date - 2021-05-15T09:32:50+05:30 IST

‘‘పుట్టిన రోజు నాడే ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులతో అరెస్టు చేయించ డం సీఎం జగన్‌రెడ్డి ఉన్మాదానికి నిదర్శనం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు’’

పైశాచిక ఆనందం.. రఘురామ అరెస్టుపై నేతల స్పందనలు

  • రఘురామ అరెస్టుపై చంద్రబాబు మండిపాటు
  • అరెస్టు అప్రజాస్వామికం: టీడీపీ, బీజేపీ నేతలు

అమరావతి, న్యూఢిల్లీ, విశాఖపట్టణం, మే 14(ఆంధ్రజ్యోతి): ‘‘పుట్టిన రోజు నాడే ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులతో అరెస్టు చేయించ డం సీఎం జగన్‌రెడ్డి ఉన్మాదానికి నిదర్శనం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన చేశారు. ‘‘ప్రజా సమస్యలపై ఒక ఎంపీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏకంగా దేశ ద్రోహం కేసు పెట్టి అరెస్టు చేశారు. వై కేటగిరీ భద్రతలో ఉన్న ఎంపీని లోక్‌సభ స్పీకర్‌ అనుమతి లేకుండా ఎలా అరెస్టు చేస్తారు? ఎమర్జెన్సీని మించిపోయి ఈ రాష్ట్రంలో ఇష్టానుసారం అరెస్టులు చేస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు’’ అని విమర్శించారు. అమూల్‌ విషయంలో రైతుల హక్కుల గురించి మాట్లాడిన ఎంపీపై దేశద్రోహం కేసు పెట్టినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు.


నియంత కంటే ఘోరంగా, ప్రజల ప్రాణాల రక్షణ పట్టించుకోకుండా, తన కక్ష తీర్చుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుతున్న ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అని  లోకేశ్‌ ఓ ప్రకటనలో విమర్శించారు. రఘురామ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జగన్‌రెడ్డి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. రఘురామరాజును దేశద్రోహంతో పరిగణించే ఐపీసీలోని 124-ఏ సెక్షన్‌కింద అరెస్ట్‌ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుందని, తక్షణమే విడుదల చేయాలని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. టీడీఎల్పీ ఉప నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్‌ చేస్తూ... ‘‘అంబులెన్సులు తిరగకూడదుగాని, అటూ ఇటూ పోలీసులు తిరుగుతూ అక్రమ అరెస్టులు చేయవచ్చా?’’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేసినందుకే రఘురామరాజుపై కక్షగట్టారని దక్షిణ భారత కాపు సంఘం ప్రధాన కార్యదర్శి వేల్పూరి శ్రీనివాస్‌ శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు.


రఘురామ అరెస్టు అప్రజాస్వామికం: విష్ణు

విశాఖపట్నం, మే 14 (ఆంధ్రజ్యోతి): ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. ఇది అప్రజాస్వామికమని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.   


ప్రతిష్ఠకు భంగం కలిగించాడని అరెస్టా?

‘‘ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించాడన్న ఆరోపణలతో సొంత పార్టీకి చెందిన రఘురామకృష్ణంరాజును అరెస్ట్‌ చేస్తారా? ఇదెక్కడి చోద్యం? ప్రభుత్వానికి లేని ప్రతిష్ఠకు ఎవరైనా ఎలా భంగం కలిగించగలరు?’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్‌ ప్రశ్నించారు.




ఎంపీ అరెస్టుకు ఇదా సమయం: పవన్‌

అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో కరోనా విశృంఖలంగా విభృంభిస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కదిలించి ప్రజలను రక్షించాల్సి ఉండగా ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. కొంతకాలం పాటైనా రాజకీయ దమన నీతిని కట్టిపెట్టాలి’’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు.  


అరెస్టులో తప్పు లేదు: మంత్రి బాలినేని

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 14: ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడంలో ఎలాంటి తప్పు లేదు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రాజు సైకోలా మాట్లాడుతున్నారు. తనపై వ్యక్తిగతంగా మాట్లాడినా ఇంతవరకు సీఎం సహించారు’’ అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో అన్నారు. 

Updated Date - 2021-05-15T09:32:50+05:30 IST