Abn logo
Jun 24 2020 @ 00:30AM

ఇది కూడా యుద్ధమే!

కరోనా ఉత్పాతం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే గల్వాన్ లోయలో సంఘటన జరిగిందని కొన్ని కువ్యాఖ్యలు వినిపించాయి కానీ, అది పెద్దగా తర్కానికి నిలవదు. కరోనాను తానే సృష్టించి వదిలిందని చైనా మీద అమెరికా ఆరోపణలు చేస్తున్నది. ఆ వైరస్ ఎట్లా పుట్టిందో మూలాల దగ్గర నుంచి తవ్వితీయాలని కోరుతున్నది. కొన్ని యూరప్ దేశాలు కూడా అమెరికాతో గొంతు కలుపుతున్నాయి. ఈ హడావిడి నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికే భారత సరిహద్దుల్లో హింసకు పాల్పడిందని అనుకుందామా! అక్కడేమి జరిగిందో భారత్ చెప్పడమూ, అభ్యంతరాలు ప్రకటించడం తప్ప, చైనా ప్రపంచానికి, తన దేశ ప్రజలకు గల్వాన్ సంఘటన గురించి వివరంగా చెప్పిందే లేదు. తమ వైపు ఎందరు మరణించారో లెక్క కూడా చెప్పడం లేదు. జరిగిందేమంత పెద్ద విషయం కాదన్నట్టు ఆ దేశం వ్యవహరిస్తున్నది. కాబట్టి, ఈ సంఘటన ద్వారా ప్రపంచం దృష్టి మళ్లించడానికి చైనా ప్రయత్నించిందని అనలేము. ఇక భారతదేశంలోనూ, కరోనా కట్టడి, ఇతర అంశాలలో ప్రభుత్వ వైఫల్యం మీద అసంతృప్తి గట్టిగా రగులుతున్న విషయం వాస్తవమే అయినా, సరిహద్దు ఘర్షణ ప్రభుత్వం ప్రతిష్ఠను కాపాడింది లేదు, పైగా, తత్తరపాటుకు కూడా లోనుకావలసి వచ్చింది. ఉద్రిక్తతలను తగ్గించుకునే ప్రయత్నం రెండు దేశాలూ మొదలుపెట్టాయని వస్తున్న వార్తలు సంతోషించదగ్గవి. ఈలోగా, కొన్ని రోజులుగా సమస్య తీవ్రత పెరిగినా, దృష్టి మళ్లిన కరోనా సమస్యను తిరిగి వేదిక మీదకు తేవలసిన అవసరం ఉన్నది. 


చూడగా, చూడగా కరోనా కట్టడి విషయంలో దేవుడి మీదనే భారం వేసినట్టు కనిపిస్తున్నది. ఏవో కొన్ని సమన్వయ చర్యలు తప్ప చేయగలిగేది కూడా ఏమీ ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రభుత్వాల వైఖరి అట్లా ఉన్నదంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రాణభయం ఉండవలసిన ప్రజలు కూడా, అత్యధికులు, ఏమి జరిగితే అది జరుగుతుందిలే అన్న తెగింపుకో, వైరాగ్యానికో జారిపోయినట్టు కనిపిస్తున్నది. కారుచిచ్చు లాగా వ్యాధి వ్యాపిస్తుంటే, ఏమి చేయాలో జనానికి అర్థం కావడం లేదు. ఇటువంటి స్థితి, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి ఏ మాత్రం దోహదం చేయదు. 


సరిహద్దు వివాదం అనగానే రంగంలోకి దిగిన రాజకీయపక్షాలకు, కరోనా స్థితి మీద ప్రజల పక్షాన మాట్లాడాలన్న స్పృహలేదు. ప్రభుత్వం సరిగ్గా చేయడం లేదని ఆస్పత్రుల ముందు ధర్నాలూ, భీకర ప్రకటనలూ చేసే పక్షాల వారు కూడా, ప్రభుత్వాలకు సూచనలు చేయరు, తాము స్వయంగా ప్రజలకు మార్గనిర్దేశనం చేయరు. తమిళనాడులో హైకోర్టు న్యాయమూర్తులు స్వయంగా కల్పించుకుని, కరోనా వ్యాప్తి తీవ్రత గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము న్యాయమూర్తుల హోదాలో ఈ అంశాన్ని లేవనెత్తడం లేదు, సుమోటోగా దీన్ని చేపట్టడంలేదు, చెన్నై నగర పౌరులుగా అడుగుతున్నాము, ఎందుకు మళ్లీ కొంతకాలం లాక్‌డౌన్‌ విధించరు? -అని న్యాయమూర్తులు జూన్ 12 నాడు ప్రశ్నించిన మీదట, ప్రభుత్వం పునరాలోచన చేసి, జూన్ 19 నాడు చెన్నైతో సహా నాలుగు జిల్లాలలో పూర్తి లాక్‌డౌన్‌ విధించారు. బుధవారం నాటి నుంచి మదురైజిల్లాలో కూడా లాక్‌డౌన్‌ విధించనున్నారు. కర్ణాటకలో జనతాదళ్ (-ఎస్) నేత కుమారస్వామి గౌడ బెంగళూరు మరో లాక్‌డౌన్‌ విధించాలని డిమాండ్ చేశారు. తరువాత బాధపడేకంటే, ముందే మేల్కొనడం మంచిదని ఆయన హితవు చెప్పారు. నిజానికి తమిళనాడులో వ్యాధి వ్యాప్తి కర్ణాటక కంటె, తెలంగాణ కంటె ఎక్కువ. కర్ణాటకలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించదగ్గవి అని కేంద్రం ఈ మధ్యన సూచించింది కూడా. అయినప్పటికీ, అక్కడ వ్యాధి తీరు గురించిన ఆందోళన, పరిష్కార మార్గాల ప్రతిపాదన జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో సమాజం, రాజకీయపార్టీలు- అందరూ రాజకీయాలలో మునిగితేలుతున్నారు తప్ప, సమస్య వైపు చూడడం లేదు. జాగ్రత్తలూ పాటించడం లేదు. సూర్యగ్రహణం రోజు కేవలం సంప్రదాయవిశ్వాసం కారణంగా ఇళ్లకు పరిమితమైన ప్రజలు, కరోనా రాక్షసి వీధుల్లో తిరుగుతున్నదన్నా, ఇంటిపట్టున ఉండడం లేదు. 


పరీక్షలు తగినన్ని చేయడం లేదని అనేక వర్గాల నుంచి పదే పదే విమర్శలు వచ్చినమీదట, 50వేల పరీక్షలు ఒక పదిరోజుల కాలంలో చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్షలు కూడా ఎవరికి పడితే వారికి చేసేవి కావు. వ్యాధి సోకినవారి కుటుంబసభ్యులు, సన్నిహితులు, వారికి సమీపంగా మెలగినవారు, కరోనా విపత్తులో ముందుండి పనిచేస్తున్న వైద్యసిబ్బంది, పోలీసులు, పాత్రికేయులు, సంఘసేవకులు- వీరికి మాత్రమే జరుగుతున్నాయి. పరీక్షలు జరిపినవారిలో 27 శాతం మందికి వ్యాధినిర్ధారణ జరుగుతున్నదంటే, తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టే. దీనిపై ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించి అమలుచేయకపోతే, మహానగరానికి మహావిపత్తు ఏర్పడినా ఆశ్చర్యం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో స్థానికంగా కొన్ని పట్టణాల్లో పూర్తి లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నారు. నిజానికి, ఒక పట్టణంలో వ్యాధి వ్యాప్తిని ఎట్లా కట్టడి చేయవచ్చునో కరీంనగర్ పట్టణంతో తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించింది. కట్టడి ప్రాంతాల ఆలోచన కూడా మొదట చేసింది తెలంగాణయే. అటువంటిది ఇప్పుడు జంటనగరాలలో ఏవి కంటెయిన్మెంట్ ప్రాంతాలు, ఏవి కావు, ఆంక్షల విస్తృతి ఎంత- అనేవి ప్రశ్నార్థకంగా మారాయి. వ్యాధిసోకిన వ్యక్తి ఉన్న ఇల్లు మాత్రమే కంటెయిన్మెంట్ అంటే ఎంత హాస్యాస్పదం? ఇక పాజిటివ్ రోగులను ఇళ్లకే తిప్పి పంపడం, క్వారంటైన్ అమలు తీరు తెన్నులు- వీటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. 


ఇది కూడా యుద్ధమే. దీనికీ ఒక వ్యూహం కావాలి. ప్రచారం కావాలి. నిబద్ధులైన, సాహసులైన యోధులు కావాలి. అవసరమైతే మరోసారి తాళం వేయడానికి కూడా ధైర్యం ఉండాలి. ఎక్కువ మేలు కోసం, తక్కువ నష్టం కోసం ఆలోచించే, పథకం రచించే వివేకులు కావాలి. ద్వేషమో ఆవేశమో ఆగ్రహమో కాక, ప్రేమ, పట్టింపు, సహోదరభావం ఈ యుద్ధానికి అవసరం. హైదరాబాద్, విజయవాడ, ముంబయి, అహ్మదాబాద్, ఢిల్లీ... ముప్పు ఉన్న ప్రతిచోటా ప్రమాదసూచిక ఎగురవేయాలి. ఉదాసీనతకు ఉద్వాసన పలకాలి.

Advertisement
Advertisement
Advertisement