‘‘ఇది వాగ్గేయ పరంపరకు దక్కిన గౌరవం’’

ABN , First Publish Date - 2022-01-10T05:53:58+05:30 IST

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత గోరటి వెంకన్నతో ‘వివిధ’ జరిపిన సంభాషణ...

‘‘ఇది వాగ్గేయ పరంపరకు దక్కిన గౌరవం’’

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత 

గోరటి వెంకన్నతో ‘వివిధ’ జరిపిన సంభాషణ


‘వల్లంకి తాళం’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నందుకు అభినందనలు. 

ఇది మొత్తంగా వాగ్గేయ పరంపరకు దక్కిన గౌరవంగా భావిస్తాను. నా పని నేను చేసుకుంటూ వచ్చాను. దాన్ని గుర్తించినందుకు సాహిత్య అకాడమీకి కృతజ్ఞతలు. 


మీ గేయం వచన కవితలా ఉంటుంది. గేయం వైపే ఎందుకు వచ్చారు?

వచన కవిత్వం, గేయం అనే తేడా నాకు లేదు. సమాజంలో జరిగే మార్పులను అనుసరించి సాహిత్య ప్రక్రియల పుట్టుక ఉంటుంది. తెలంగాణ మూలాల్లోనే గేయం వైపు ఎక్కువ మొగ్గు ఉన్నది. ఉద్యమాలూ ఆకలీ కరువూ భూస్వామ్య పెత్తందారీ తనం దోపిడీ... ఈ ఘర్షణ వాతావరణంలో సహజంగానే పాటకు అగ్రస్థానం దక్కింది. నేను అటు మళ్లాను. 


మీ గేయంపై పద్య సాహిత్య ప్రభావం గురించి చెప్పండి?

పాల్కురికి సోమనాథుడి ‘బసవ పురాణం’, పొన్నగంటి తెలుగన్న ‘యయాతి చరిత్రము’, గోన బుద్ధారెడ్డి ‘రంగనాథ రామాయణం’, శ్రీనాథుడి ‘పలనాటి వీరచరిత్రము’... ఈ కావ్యాల్లోని ద్విపద దేశీ మార్గానికి దగ్గరగా ఉంటుంది. 

ఇంకా పోతన పద్యంలోని లయ, వేమన పద్యంలోని విసుర్లు ఎంతో ఇష్టం. ఇవన్నీ నాకు గేయాన్ని సులభం చేశాయి.  


మిమ్మల్ని ప్రేరేపించిన కవులు రచయితలు?

కృష్ణశాస్త్రి, దువ్వూరి రామిరెడ్డి, జాషువా, అజంతా, శివసాగర్‌, మద్దూరి నగేష్‌బాబు, గుడిహాళం రఘునాథం, యువక, త్రిపురనేని శ్రీనివాస్‌... వీరి కవిత్వాన్ని బాగా అభిమానిస్తాను. రచయితల్లో కేశవరెడ్డి, రావిశాస్త్రి, పతంజలి, నామిని.... ఇంకా అంతకుముందు ఉన్నవ లక్ష్మీనారాయణ, శ్రీపాద వీరి రచనలను ఎంతో ఇష్టపడతాను. విమర్శకులలో రాచమల్లు రామచంద్రారెడ్డి, కె.కె.ఆర్‌., ముదిగొండ వీరభద్రయ్య, సీతారాం, బి. తిరుపతిరావు, గుడిపాటి, పెన్నా శివరామకృష్ణ ఇష్టం. ఇప్పటివాళ్లలో గద్దరన్న, బండినారాయణ స్వామి, శివారెడ్డి, ఖాదర్‌ మొహియుద్దీన్‌, యాకూబ్‌, మునాసు వెంకట్‌ మొదలుకొని చాలామంది ఉన్నారు. అందరినీ చదువుతాను, అభిమానిస్తాను. నా యోచన విస్తృతికి కె. శ్రీనివాస్‌ రచనలు, అంబటి సురేంద్ర రాజు రచనలు బాగా ఉపయోగపడ్డాయి.  


పాట ఉనికి, ప్రభావం తెలంగాణలో ఉన్నంతగా ఇతర తెలుగు ప్రాంతాల్లో లేదని చెప్పవచ్చు. తెలంగాణను ఈ విషయంలో ప్రత్యేకంగా నిలబెట్టేది ఏది? 

మొట్టమొదటిది తెలంగాణ నైసర్గిక స్వరూపం. రెండవది ఇక్కడి అలజడి. ఇక్కడున్న వేదన నుంచే, యాతన నుంచే పాట పురుడుపోసుకున్నది. ఆధిపత్యాన్ని ధిక్కరించే దారిలో పాట ఒక నిర్ణయాత్మక శక్తిగా పెరిగింది. ప్రధానంగా గద్దరన్న దాన్ని ఆ స్థాయికి తీసుకుపోయినాడు. ఉత్తరాంధ్రలో వంగపండు తీసుకెళ్లినాడు. రాయలసీమలోనూ తత్త్వం పాడే కవులు ఉన్నారు. అలాగే తెలంగాణలో దీనికి పునాదులు వేసి ఆలంబనగా నిలబడిన వ్యక్తులు సంస్థలు ఉన్నాయి. సుద్దాల హనుమంతు, ప్రజా నాట్యమండలి... ఇవన్నీ పాట ప్రాభవానికి దోహదం చేశాయి. 


మీ గేయం ప్రజాసమస్యల మధ్య పుట్టి, వామపక్ష భావజాలం ఆలంబనతో కొనసాగి, ఆధ్యాత్మికత వైపు, జీవన తాత్త్వికత వైపు మళ్లినట్టు అనిపిస్తుంది... 

నా ఆధ్యాత్మికతకు కారణం బుద్ధుడు. నా ప్రజా పక్షపాతానికి కాణం వేమన. నా కవిత్వంలో భావుకత్వానికి కారణం కృష్ణశాస్త్రి. నేను ఏ ఐడియాలజీకి పూర్తి పరాధీనం కాను. ఏ ఐడియాలజీ సమగ్రం అనుకోను. ‘సంచారమెంతొ బాగుంటది’ అని నేను రాసింది చెట్లు పట్టిపోవటం గురించి కాదు, ఇక్కడ సంచారమంటే జ్ఞాన సంచారమని అర్థం. 

ఒక తాన ఆగిపోకుండ ప్రయాణించాలి. నాకు అప్పుడు ఏది అనిపిస్తే అది రాస్తాను. ఒకదానికి కట్టుబడి ఉండే పద్ధతి నాకు లేదు.    


మీ తాత్త్వికత హిందూత్వలో భాగమనే విమర్శలున్నాయి? 

పునర్జన్మ, కర్మ, మనువు, పురోహిత వర్గం... దీనికి భిన్నంగా హిందూ మతానికి ఇంకో పార్శ్వముంది. అది అచల సంప్రదాయం, సిద్ధ బైరాగి అవధూత అమనస్క సంప్రదాయం. అది ఒక ఆల్టర్నేటివ్‌ ధార. హిందూత్వాన్ని పైపైన చూసి విమర్శించటం వల్లనే అది పాలకులకు ఆయుధంగా మారుతుంది. హిందూమతంలోని నిజమైన తత్త్వధార- కబీర్‌, తుకారాం, నామ్‌దేవ్‌, అక్కమహాదేవి, దాసమయ్య, వీరబ్రహ్మం, దున్న ఇద్దాసు లాంటి వాళ్లు తెచ్చిన పరంపర- అది వేరు. అది ఆత్మావతు సర్వభూతాని, నిర్వికార తత్త్వం, నిరంజన తత్త్వం.... అది సారాంశంలో లాభాపేక్షకు, మార్కెట్‌ సంస్కృతికి వ్యతిరేకం. అది సర్వ జీవుల్లోనూ భగవంతుడిని కాంచాలనే తత్త్వం. 


Updated Date - 2022-01-10T05:53:58+05:30 IST