ఈ బాధ్యతారాహిత్యం తగునా?

ABN , First Publish Date - 2021-05-18T05:59:08+05:30 IST

దేశంలో ఒకవైపు కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతుండగా, మరో వైపు వాక్సిన్‌లు అందరికీ అందుబాటులో ఉంచేందుకు కేంద్రప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, పడకల విషయంలో....

ఈ బాధ్యతారాహిత్యం తగునా?

దేశంలో ఒకవైపు కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతుండగా, మరో వైపు వాక్సిన్‌లు అందరికీ అందుబాటులో ఉంచేందుకు కేంద్రప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, పడకల విషయంలో కేంద్రం ఆగమేఘాలపై తీసుకుంటున్న చర్యలను సైతం తక్కువ అంచనా వేయలేము. కాకపోతే కొన్ని రాష్ట్రప్రభుత్వాలు ఈ విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నాయి. అందుకే ప్రధాని మోదీ ఇటీవల కేంద్ర సరఫరాలపై ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. కేంద్రాన్ని తప్పుపడుతున్న రాష్ట్రాల నిజాయితీ ఏమిటో ఆ తర్వాత బయటపడుతుంది.


దేశంలో కోవిడ్ కేసులు గత వారంతో పోలిస్తే తగ్గుముఖం పట్టడం అత్యంత సంతోష కరమైన పరిణామం. ఏప్రిల్ 21 తర్వాత మొట్ట మొదటిసారిగా దేశంలో రోజువారీ కొవిడ్ కేసులు మూడు లక్షలలోపు పడిపోయాయి. కేంద్రం తన పరిపాలనా యంత్రాంగాన్ని పూర్తిగా కరోనాను ఎదుర్కొనేందుకే సమాయత్తం చేయడం, వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించడం వల్ల పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. అయితే కొన్ని రాష్ట్రాలు ఇంకా కరోనా కన్నా రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఒక్కరోజే 24వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ప్రతిరోజూ దాదాపు వందమంది కరోనాతో మరణిస్తున్నారు.


రాయలసీమలో ప్రధానంగా ముఖ్యమంత్రి స్వంత జిల్లా కడపలో కరోనా విలయతాండవం చేస్తున్నది. అనంతపురంలో అన్ని జిల్లాలకన్నా ఎక్కువగా 3,356 కేసులు ఆదివారం నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌లో 9వేల మందికి పైగా మరణించారు. దేశంలో కరోనాకేసుల విషయంలో మొదటి అయిదు రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు అక్కడ వైద్య వసతులు లేక ప్రక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి పరుగులు తీయాల్సిన పరిస్థితి కనపడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తన రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల్లో తలమునకలై ఉన్నారు. సంగం డైరీని స్వాధీనపరుచుకోవాలనుకోవడం, తన పార్టీ ఎంపి రఘురామకృష్ణ రాజును సిఐడి పోలీసులతో అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించేందుకు ప్రేరేపించడం జగన్ రెడ్డి మనస్తత్వాన్ని తెలియజేస్తోంది.


ఒక వైపు ప్రజలు కరోనాతో అల్లలాడుతూ హాహాకారాలు చేస్తుంటే, తమ రాష్ట్రాన్నుంచి వచ్చే అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటుంటే జగన్‌కు చీమకుట్టినట్లయినా లేకపోయింది. అంబులెన్స్‌ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో మాట్లాడాలన్న ఆలోచన కూడా ఆయనకు లేకపోయింది. తన వైఫల్యాలనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న జగన్, అత్యంత కీలక సమయంలో న్యాయస్థానాల విలువైన సమయాన్ని వృథా చేయడం కూడా దారుణం. బెంగాల్‌లో మూడో సారి అధికారంలోకి వచ్చిన వెంటనే బిజెపి కార్యకర్తలపై తన అనుయాయులను మారణకాండకు ప్రేరేపించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి, జగన్‌కు పెద్ద తేడా ఏమీ లేదు. అక్కడ కూడా కరోనా కేసులు రోజుకు 20వేల చొప్పున పెరిగిపోతుండగా, నారద కుంభకోణంలో సిబిఐ తృణమూల్ నేతలను అరెస్టుచేసినందుకు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా తన బాధ్యతల్ని మరిచి సిబిఐ కార్యాలయం ముందు ఆరుగంటల పాటు ధర్నా చేశారు.


తెలంగాణలో సరైన సమయంలో వైద్య సౌకర్యాలు లభించక ఒక గర్భిణీ మరణించడాన్ని హైకోర్టు తీవ్రంగా పరగిణించడమే కాక రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను తప్పుపట్టింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కూడా కరోనా కంటే రాజకీయ ప్రాధాన్యతలే ముఖ్యం అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. దేశంలో ప్రాంతీయ పార్టీలకు అధికారం అప్పజెప్పితే అరాచకత్వం, నియంతృత్వం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం తప్ప ప్రజలకు మేలు చేసే ఉత్తమ పరిపాలన అందించడం జరిగే అవకాశాలు తక్కువ అన్న విషయం ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు నిరూపిస్తున్నారు.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ కరోనా రెండో ప్రభంజనం విషయంలో ఎలాంటి హెచ్చరికలూ చేయలేదని, ఆయన పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రతిపక్షాలు గత కొద్ది రోజులుగా ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే మోదీ ఈ ప్రచారాన్ని పట్టించుకోకుండా స్థితప్రజ్ఞతతో తన బాధ్యతలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి 2021 మార్చిలోనే ముఖ్యమంత్రులతో జరిపిన సమావేశంలో కరోనా రెండో ప్రభంజనం గురించి హెచ్చరించి అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అవుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. 2021 జనవరి నుంచీ కేంద్రం కరోనా రెండో ప్రభంజనం గురించి రాష్ట్రాలకు అడ్వైజరీలు పంపుతూనే ఉన్నది. మోదీ ఎన్నికల ర్యాలీలను వేలేత్తి చూపుతున్న ప్రతిపక్షాలు రైతుల ర్యాలీలను ప్రేరేపించడం, తాము స్వయంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సభల్లో పాల్గొనడం గురించి విస్మరించాయి. 


దేశంలో కరోనా కేసులు, మరణాలకు సంబంధించిన భోగట్టాను కేంద్రం రూపొందించదు. అన్ని వివరాలు రాష్ట్రాలనుంచే వస్తాయి. కేంద్రం వాటిని సమీకరించడమే చేస్తుంది. కనుక భోగట్టాను కేంద్రం కప్పిపుచ్చుతోందని, పెద్ద ఎత్తున మరణాలు జరిగినా బయటకు వెల్లడించడం లేదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? భారత దేశంలో యూరప్, ఉత్తర అమెరికా లకంటే ఎక్కువ జనాభా ఉన్నది. కనుక కరోనా కేసులసంఖ్య మొత్తంగా సహజంగానే ఎక్కువగా కనపడుతుంది. కాని పదిలక్షల జనాభాకు కేసులు, మరణాల సంఖ్యతో పోలిస్తే ప్రపంచంలో భారత్ 110వ స్థానంలో ఉన్న విషయం తెలుసుకోవాలి. న్యూజిలాండ్ ప్రధానిలాగా మన ప్రధాని సమర్థుడు కాడని ప్రచారం చేస్తున్నవారు కూడా న్యూజిలాండ్ జనాభా హైదరాబాద్ జనాభాలో సగం కన్నా తక్కువ అన్న విషయం తెలుసుకోవాలి. మోదీని ఏ రకంగానైనా దుమ్మెత్తి పోయాలనుకున్న వారు వాస్తవాలను సగం సగం మాత్రమే చెబుతారన్న విషయం జనం అర్థం చేసుకోగలరు.


ఇక వాక్సినేషన్ విషయానికి వస్తే, మొత్తం వాక్సిన్ డోసులలో 50 శాతం కేంద్రమే రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో వాక్సిన్‌ను ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. మరి ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు ఎందుకు ఉచితంగా వాక్సిన్‌ను పంపిణీ చేయడంలేదు? వాక్సిన్ కంపెనీలతో మాట్లాడి ధరను తగ్గించుకోవాల్సిన బాధ్యత రాష్ట్రాలకు లేదా? అసలు తామే వాక్సిన్ కంపెనీలతో మాట్లాడి ధరలను నిర్ణయించు కుంటామని రాష్ట్ర ప్రభుత్వాలు కోరిన మాట నిజం కాదా? భారత దేశం పెద్ద ఎత్తున ఇతర దేశాలకు వాక్సిన్ డోసులను సరఫరా చేసిందన్న మాటలో కూడా నిజం లేదు. ఇతర దేశాలనుంచే భారత దేశానికి 17వేల కోట్ల వాక్సిన్ డోసులు దిగుమతి చేసుకోగా, భారత్ ఎగుమతి చేసిన వాక్సిన్‌ల డోసులు అందులో మూడో వంతు మాత్రమే ఉంటాయి. ఇవి కూడా వ్యాక్సిన్‌ల కోసం ఏర్పడిన గ్లోబల్ అలయెన్స్ (జిఏవిఐ)లో భారత్ సభ్య దేశంగా పేద దేశాలకు సరఫరా చేసే బాధ్యతను స్వీకరించినందువల్ల జరిగితే వ్యాక్సిన్ కంపెనీలు కూడా కొన్ని కాంట్రాక్టు ఒప్పందాలను నెరవేర్చాల్సి వచ్చింది. దేశాన్ని కొన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ ఈ విషయంలో మసిపూసి మారేడు కాయ చేయడం ఎంతవరకు సరైంది?


దేశంలో ఒకవైపు కేసుల సంఖ్య తగ్గుతుండగా, మరో వైపు పెద్ద ఎత్తున వాక్సిన్‌లు దేశంలో ప్రవేశించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం మరో మంచి పరిణామం. కొవాగ్జిన్ ఉత్పత్తి చేసేందుకు కేంద్రం మరో ప్రభుత్వ రంగ సంస్థల్ని సిద్ధం చేస్తుండగా, ఏడు కంపెనీలు రష్యాకు చెందిన స్పుత్నిక్ వాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరో నాలుగు కొత్త వాక్సిన్‌లకు కూడా అత్యవసర అనుమతి లభించబోతున్నది. వాక్సిన్ లోటు లేని దేశంగా భారత్ త్వరలో అవతరించబో తున్నది. ఈ మధ్య కాలంలో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, పడకల విషయంలో కేంద్రం ఆగమేఘాలపై తీసుకుంటున్న చర్యలను కూడా తక్కువ అంచనా వేయలేము. కాకపోతే కొన్ని ప్రభుత్వాలు ఈ విషయంలో కూడా రాజకీయాలు చేస్తున్నాయి. అందుకే ప్రధానమంత్రి ఇటీవల కేంద్ర సరఫరాలపై ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. కేంద్రాన్ని తప్పుపడుతున్న రాష్ట్రాల నిజాయితీ ఏమిటో ఆ తర్వాత బయటపడుతుంది.




వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2021-05-18T05:59:08+05:30 IST